అప్పుడే గుడ్‌ బై చెబుతా: యువరాజ్‌

7 Jan, 2019 11:10 IST|Sakshi

న్యూఢిల్లీ: ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌లో ఆడటానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నానని టీమిండియా వెటరన్‌ ఆటగాడు యువరాజ్‌ సింగ్‌ పేర్కొన్నాడు. గొప్పగా ఆడే సమయంలోనే ఆటకు గుడ్‌ బై చెప్పాలనుకుంటున్నట్లు తెలిపాడు. ఇందుకోసం తీవ్రంగా కృషి చేస్తున్నానన్నాడు. మళ్లీ తాను సత్తా చాటుకుని జట్టులోకి వస్తానని, అదే సమయంలో వరల్డ్‌కప్‌ కూడా ఆడతాననే ఆశ ఉందన్నాడు.  ‘క్రికెట్‌ నాకన్నీ ఇచ్చింది.  ఆటకు వీడ్కోలు పలికేటప్పుడు అత్యుత్తమంగా ఉండాలని కోరుకుంటున్నా. బాధతో వెళ్లిపోవద్దు. ప్రస్తుతం రంజీ ట్రోఫీ ఆడుతున్నా. రంజీ ట్రోఫీ తర్వాత జాతీయ టీ20 టోర్నీ, ఐపీఎల్‌ ఉన్నాయి. మంచి జరుగుతుందని ఆశిస్తున్నా. నేను సత్తా చాటడానికి ఈ టోర్నీలు ఉపయోగపడతాయనే భావిస్తున్నా’ అని బెంగాల్‌తో రంజీ మ్యాచ్‌ సందర్భంగా యువీ పేర్కొన్నాడు.

మరొకవైపు ఆస్ట్రేలియాలో అదరగొడుతున్న టీమిండియాపై యువీ ప్రశంసలు కురిపించాడు. ‘టీమిండియా బ్యాటింగ్‌ గతంలో కన్నా మెరుగ్గా ఉంది. ఆటగాళ్లంతా బాగా కష్టపడుతున్నారు. ముఖ్యంగా పుజారా, కోహ్లి, బుమ్రాలు రాణిస్తున్నారు. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో దిగువన వచ్చి రిషభ్‌ పంత్‌ పరుగులు చేయడం బాగుంది. దాంతోనే ఆసీస్‌ను వారి గడ్డపై ఓడించ గల్గుతున‍్నాం. 2003-04లో ఆస్ట్రేలియాలో మేం సిరీస్‌ను డ్రా చేశాం. అక్కడ గెలవడం అంత సులభం కాదు. గతేడాది రిషభ్‌  టీమిండియాకు ఎంపికయ్యాడు. అతడు ఎక్కువ షాట్లు ఆడతాడని, నిర్లక్ష్యంగా బాదేస్తాడని, ఆలోచించలేడని అన్నారు. ఐపీఎల్‌లో రాణించి టీమిండియాకు ఎంపికైన ఏడాదిలోనే విదేశాల్లో రెండు శతకాలు బాదేశాడు’ అని యువీ అన్నాడు.

మరిన్ని వార్తలు