యువీ.. వాటే సిక్స్‌

28 Jul, 2019 11:10 IST|Sakshi

ఒంటారియో: ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన భారత క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌.. గ్లోబల్‌ టీ20 కెనడా లీగ్‌లో ఆడుతున్నాడు. ఈ లీగ్‌లో టోరంటో నేషనల్స్‌ తరఫున ఆడుతున్న యువరాజ్‌ సింగ్‌ తనలోని సత్తా ఇంకా తగ్గలేదని నిరూపించాడు. శనివారం ఎడ్మాంటన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో యువరాజ్‌ 21 బంతుల్లో మూడు సిక్సర్లు, మూడు ఫోర్లతో 35 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అందులో యువరాజ్‌ కొట్టిన ఒక సిక్స్‌ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.

 ఎడ్మాంటన్‌ నిర్దేశించిన 192 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో నాల్గో స్థానంలో వచ్చిన యువరాజ్‌ తనదైన శైలిలో బ్యాట్‌ ఝుళిపించాడు. ఎడ్మాంటన్‌ తరఫున ఆడుతున్న పాకిస్తాన్‌ లెగ్‌ స్సిన్నర్‌ షాదబ్‌ ఖాన్‌ బౌలింగ్‌లో  మిడ్‌ వికెట్‌గా మీదుగా  ఫ్లాట్‌ సిక్స్‌ కొట్టి ఔరా అనిపించాడు. దీనికి సంబంధించి వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ మ్యాచ్‌లో టోరంటో నేషనల్స్‌ రెండు వికెట్లు తేడాతో విజయం సాధించింది. 29 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన తరుణంలో హెన్రిచ్‌ క్లాసెన్‌-యువరాజ్‌ సింగ్‌లు ఆదుకున్నారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 56 పరుగులు జత చేసిన తర్వాత యువీ ఔటయ్యాడు. యువీ పెవిలియన్‌ చేరిన తర్వాత పరిస్థితి మళ్లీ మొదటకొచ్చింది.  జట్టు స్కోరు 85 పరుగుల వద్ద యువీ ఔట్‌ కాగా, మరో మూడు పరుగుల వ్యవధిలో పొలార్డ్‌ పెవిలియన్‌ చేరాడు. అటు తర్వాత స్వల్ప విరామాల్లో టోరంటో వికెట్లు కోల్పోతూ వచ్చింది.  125 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ దశలో మన్‌ప్రీత్‌ గోనీ(33; 12 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు) బ్యాట్‌ ఝుళిపించాడు. చివర్లో మాంట్‌ఫోర్ట్‌- సల్మాన్‌ నజార్‌లు సమయోచితంగా ఆడటంతో టోరంటో 17.5 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది.

మరిన్ని వార్తలు