'సీనియర్‌ ఆటగాళ్లకు తగినంత గౌరవం ఇవ్వడం లేదు'

8 Apr, 2020 16:25 IST|Sakshi

ప్రస్తుతం టీమిండియాలో సీనియర్‌ ఆటగాళ్లుగా ఉన్న విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మలకు జట్టులో ఉన్న కుర్రాళ్ల నుంచి అనుకున్న స్థాయిలో గౌరవం లభించడం లేదని భారత మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ పేర్కొన్నాడు. ప్రస్తుత జట్టు వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, యువరాజ్‌ల మధ్య ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తికర చర్చ జరిగింది. 'ఇప్పుడున్న జట్టుకు, అప్పటి జట్టుకు ఏం తేడా ఉందో చెప్పాలంటూ' రోహిత్‌ శర్మ యూవీని అడడగా అతను పైవిధంగా జవాబిచ్చాడు.యూవీ మాట్లాడుతూ... 'నేను, నువ్వు( రోహిత్‌) జట్టులోకి వచ్చినప్పుడు మన సీనియర్‌ ఆటగాళ్లంతా ఎంతో క్రమశిక్షణతో ఉండేవారు. జట్టులో ఉన్న ప్రతి ఆటగాడిని సమానస్థాయిలో చూసేవారు. అప్పట్లో సోషల్‌మీడియా ప్రభావం కూడా అంతగా లేకపోవడంతో ఎలాంటి బేధాలు ఉండేవి కావు. జట్టులోని సీనియర్‌ ఆటగాళ్లను గౌరవిస్తూనే వారి మార్గదర్శకత్వంలో ముందుకు నడిచేవాళ్లం. ఒక సీనియర్‌ ఆటగాడు మీడియాతో ఎలా మాట్లాడాలి, వారడిగే ప్రశ్నలకు ఏ విధంగా సమాధానాలు ఇవ్వాలనేది స్వయంగా నేర్చుకున్నాం. అందుకే అప్పటి జట్టు ఆటగాళ్లంతా ఆటకు అంబాసిడర్లుగా మారారు.(రోహిత్‌పై యువరాజ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు)

కానీ ప్రస్తుతం భారత జట్టు మూడో జనరేషన్‌లో కోహ్లి, రోహిత్‌లు తప్ప సీనియర్‌ ఆటగాళ్లలెవరు లేరు. వీరిద్దరే ఇప్పుడు అన్ని ఫార్మాట్లలో స్థిరంగా ఆడుతున్నారు.. మిగతావారు మాత్రం అన్నిఫార్మాట్లలో స్థిమితంగా ఉండడం లేదు. అయితే సోషల్‌ మీడియా ప్రభావం పెరిగిపోవడంతో ఇప్పటి ఆటగాళ్లు అనవసరమైన వ్యాఖ్యలు చేస్తూ ఇబ్బందులకు గురవుతున్నారు. అంతేగాక జట్టులోని సీనియర్‌ ఆటగాళ్లకు గౌరవం ఇవ్వడమనేది కూడా సున్నిత అంశంగా మారింది. ఏదైనా తప్పులు మాట్లాడితే అప్పట్లో మా సీనియర్లు ఏది తప్పో, రైటో నిర్మొహమాటంగా చెప్పేవారు. ఉదాహరణకు హార్దిక్‌ పాండ్యా, కేఎల్‌ రాహుల్‌లు ఒక షోలో మహిళలపై వివక్షకు గురి చేసేలా సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ ఇలాంటి సంఘటనలు మా కాలంలో జరగలేదని ' తెలిపాడు.

ఇందుకు రోహిత్‌ శర్మ  బదులిస్తూ.. ' నేను జట్టులోకి వచ్చేసరికి జట్టులో చాలా మంది సీనియర్‌ ఆటగాళ్లు ఉండేవారు. పీయూష్‌ చావ్లా, సురేశ్‌ రైనాలతో పాటు నేను మాత్రమే జూనియర్‌ ఆటగాళ్లగా ఉన్నాం. కానీ ఇప్పుడు నేను సీనియర్‌ హోదా సంపాధించిన తర్వాత జట్టులోని యువ ఆటగాళ్లతో మంచి సంబంధాన్ని కొనసాగించా. రిషబ్‌ పంత్‌ విషయంలో మీడియాలో ఒక తప్పుడు అభిప్రాయం ఉంది. కానీ నిజానికి రిషబ్‌ను నేను చాలా దగ్గర్నుంచి గమనించాను. అతని మాట తీరు నాకు చాలా బాగా అనిపించేది. అందుకే రిషబ్‌ గురించి రాసేముందు మీడియా నిజానిజాలు తెలుసుకోవడం మంచిదని' పేర్కొన్నాడు. యువరాజ్‌ కల్పించుకొని... ఇప్పుడు జట్టులోని ఆటగాళ్లంతా కేవలం టీ20, పరిమిత ఓవర్ల ఆటకే మొగ్గుచూపుతున్నారని, సంప్రదాయ టెస్టు క్రికెట్‌ను అంతగా ఇష్టపడడం లేదని తెలిపాడు.
(జడేజాను ఎదుర్కొవడం కష్టం: స్మిత్‌)

>
మరిన్ని వార్తలు