కుల్దీప్‌పై చహలే గెలిచాడు..!

11 Jun, 2019 17:08 IST|Sakshi

లండన్‌: ప్రస్తుత భారత క్రికెట్‌ జట్టులో స్పిన్‌ విభాగంలో యజ్వేంద్ర చహల్‌, కుల్దీప్‌ యాదవ్‌లది ప్రధాన పాత్ర. ఇటీవల కాలంలో వీరిద్దరూ లేకుండా భారత్‌ తుది పోరుకు సిద్ధం కాని సందర్భాలు చాలా అరుదు. వీరిలో ఎవరినీ తీయాలన్నా భారత్‌ మేనేజ్‌మెంట్‌కు పరీక్షగా నిలుస్తోంది. వన్డే వరల్డ్‌కప్‌లో ఇప్పటివరకూ భారత్‌ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ వీరికి స్థానం దక్కడమే ఇందుకు ఉదాహరణ. స్పెషలిస్టు పేసర్‌ను పక్కకు పెట్టీ మరీ చహల్‌-కుల్దీప్‌లకు చోటు కల్పిస్తున్నారంటే వారి ప్రాధాన్యత ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ స్పిన్‌ ద్వయానికి భారత క్రికెట్‌ జట్టులో పోటీ లేదంటే అతిశయోక్తి కాదేమో.  

ఇక్కడ చహల్‌ లెగ్‌ బ్రేక్‌ బౌలర్‌ కాగా, కుల్దీప్‌ చైనామన్‌ బౌలర్‌(ఎడమచేతి మణికట్టు స్పిన్నర్‌). బౌలింగ్‌ విషయంలో వీరిద్దరిదీ ప్రత్యేక శైలి కావడంతో జట్టులో రెగ్యులర్‌ స్పిన్నర్లుగా స్థిరపడిపోయారు. మరి, ఇక్కడ వీరిద్దరూ బౌలింగ్‌లో ముఖాముఖి తలపడ్డారు. గురువారం న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ జరుగనున్న నేపథ్యంలో కుల్దీప్‌-చహల్‌లు బౌలింగ్‌ ప్రాక్టీస్‌ చేశారు. ఈ క్రమంలోనే వారిద్దరూ ఒక షూటౌట్‌ను నిర్వహించుకున్నారు. తమ రెగ్యులర్‌ బౌలింగ్‌ను వీడి కుడి-ఎడమైతే పొరపాటు లేదన్నట్లు ప్రాక్టీస్‌ చేశారు. చహల్‌ ఎడమ చేతితో వికెట్లు మీదకి బంతులు వేయగా, కుల్దీప్‌ కుడి చేతితో బంతులు విసిరాడు. ఈ పోరులో కుల్దీప్‌పై చహలే గెలిచాడు. తమ సహజసిద్ధ బౌలింగ్‌ శైలికి భిన్నమైన షూటౌట్‌లో చహల్‌ రెండు సార్లు వికెట్లు కూల్చగా, కుల్దీప్‌ ఒక్కసారి మాత్రమే వికెట్‌కు నేరుగా బంతి విసిరాడు. దీనికి సంబంధించిన వీడియో బీసీసీఐ పోస్ట్‌ చేయగా, అది వైరల్‌గా మారింది.


 

>
మరిన్ని వార్తలు