మూడో వన్డే : చహల్‌ సరికొత్త రికార్డు

18 Jan, 2019 13:05 IST|Sakshi

మెల్‌బోర్న్‌: భారత స్పిన్నర్‌ యజువేంద్ర చహల్‌ మాయాజాలం చేశాడు. 6 వికెట్లు తీసి ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌కు ముచ్చెమటలు పట్టించాడు. చహల్‌తో పాటు భువనేశ్వర్‌ కుమార్‌, మహ్మద్‌ షమీ చెరో రెండు వికెట్లు తీయడంతో మరో 8 బంతులు మిగిలుండగానే ఆసీస్‌ 230 పరుగులకు ఆలౌట్‌ అయింది. టీమిండియాకు 231 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ క్రమంలో 6 వికెట్లు తీసిన చహల్‌ పలు రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై 6 వికెట్లు తీసిన తొలి స్పిన్నర్‌గా రికార్డు సృష్టించాడు. అంతకు ముందు ఈ ఘనత సాధించిన స్పిన్నర్లు.. అబ్దుల్‌ ఖదీర్‌, టీమిండియా ప్రస్తుత కోచ్‌ రవిశాస్త్రి , షేన్‌వార్న్‌, సక్లెయిన్‌ ముస్తాక్‌, జిమ్మీ ఆడమ్స్‌, బ్రాడ్‌ హాగ్‌, ఇమ్రాన్‌ తాహిర్‌. (విజృంభించిన చహల్‌; ఆసీస్‌ ఆలౌట్‌)

తొలి రెండు వన్డేల్లో కుల్దీప్‌ యాదవ్‌కు స్థానం కల్పించగా.. అతను అడిలైడ్‌ వన్డేలో 66 పరుగులిచ్చిన ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు. దీంతో విరాట్‌ చహల్‌కు అవకామిచ్చాడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఈ స్పిన్నర్‌ 6 వికెట్లతో సత్తా చాటాడు. కాగా, వన్డేల్లో 5 వికెట్లు తీయడం చహల్‌కు ఇది రెండోసారి. గతేడాది దక్షిణాఫ్రికాతో జరిగిన సెంచూరియన్‌ వన్డేలో 5 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. ఆ మ్యాచ్‌లో టీమిండియా 9 వికెట్లతో ఘనవిజయం సాధించింది. ఇక మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో 5 వికెట్లు తీసిన రెండో భారత క్రికెటర్‌గా కూడా చహల్‌ రికార్డు సృష్టించాడు. అంతకుముందు అజిత్‌ అగార్కర్‌ 42 పరుగులకు 6 వికెట్లు తీశాడు. మొత్తం 35 వన్డేలాడిన చహల్‌  61 వికెట్లు తీశాడు.


టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 27 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. భువనేశ్వర్‌ కుమార్‌ పదునైన బంతులతో ఓపెనర్ల భరతం పట్టాడు. తర్వాత ఖవాజా, మార్ష్‌ జాగ్రత్తగా ఆడి స్కోరును వంద పరుగులకు చేర్చారు. వీరిద్దరినీ వెంట వెంటనే అవుట్‌ చేసి చహల్‌ వికెట్ల వేట ప్రారంభించాడు. ఒక ఎండ్‌లో హ్యాండ్స్‌కోంబ్ బాధ్యతాయుతంగా ఆడుతూ జట్టు స్కోరు 200 పరుగులు దాటించాడు. ఈ క్రమంలో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. 63 బంతుల్లో 2 ఫోర్లతో 58 పరుగులు చేసి 8వ వికెట్‌గా వెనుదిరిగాడు. చివరి వరుస బ్యాట్స్‌మన్ల నుంచి పెద్దగా ప్రతిఘటన ఎదురుకాకపోవడంతో ఆసీస్‌ సాధారణ స్కోరుకే పరిమితమైంది. ఖవాజా 34, షాన్‌ మార్ష్‌ 39, మ్యాక్స్‌వెల్‌ 26, రిచర్డ్‌సన్‌ 16, ఫించ్‌ 14, సిడిల్‌ 10 పరుగులు చేశారు.

మరిన్ని వార్తలు