ఐసీసీ ర్యాంకింగ్స్‌లో చహల్‌ ‘మాయాజాలం’

20 Mar, 2018 10:54 IST|Sakshi

దుబాయ్‌ : గత రెండు రోజుల క్రితం శ్రీలంకలో జరిగిన నిదహాస్‌ ముక్కోణపు టీ 20 ట్రోఫీని గెలుచుకున్న భారత జట్టు ఆటగాళ్ల సంతోషం రెండింతలయింది. తాజాగా విడుదల చేసిన ఐసీసీ  టీ20 ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లకు మెరుగైన ర్యాంకులు లభించాయి. తన మణికట్టు మాయాజాలంతో సిరీస్‌ గెలవటంలో కీలక పాత్ర పోషించిన యుజవేంద్ర చహల్‌ కెరీర్‌ అత్యుత్తమంగా రెండో ర్యాంక్‌ సొంతం చేసుకున్నాడు.   ఈ సిరీస్‌లో ఎనిమిది వికెట్లు తీసిన చహల్‌ ఏకంగా 12స్థానాలు ఎగబాకి 706 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. 

మరొకవైపు పొదుపుగా బౌలింగ్‌ చేసి ఎనిమిది వికెట్లు తీసిని వాషింగ్టన్‌ సుందర్‌ ఏకంగా 151 స్థానం నుంచి 31 స్థానంలో నిలిచాడు.  అఫ్గాన్‌ సంచలనం రషీద్‌ ఖాన్‌ 759 పాయింట్లతో తొలి స్థానంలో కొనసాగుతున్నాడు.  

ఇక టీ20 బ్యాటింగ్‌ జాబితాలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. బంగ్లాదేశ్‌తో ఫైనల్‌లో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి కప్‌ అందించిన దినేశ్‌ కార్తీక్‌ 126 స్థానం నుంచి 95వ స్థానానికి చేరాడు. కార్తీక్‌కు టీ20లో ఇదే అత్యుత్తమం కావడం విశేషం. ఇక తాత్కాలిక కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌ 13,17 స్థానాలలో కొనసాగుతున్నారు.  విరాట్‌ కోహ్లి 670 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో కొనసాగుతుండగా న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మెన్‌ మున్రో 801 పాయింట్లతో తొలి స్థానంలో కొనసాగుతున్నాడు.  

సిరీస్‌లో సగం మ్యాచ్‌లు ఆడలేకపోయిన బంగ్లా కెప్టెన్‌ షకీబుల్‌ హసన్‌ ఆల్‌రౌండర్‌ జాబితాలో నెంబర్‌ వన్‌ స్థానం నుంచి మూడో స్థానానికి పడిపోయాడు. మాక్స్‌వెల్‌ తొలి స్థానానికి ఎగబాకాడు. టీ20 టీం జాబితాలో భారత్‌ 124పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. పాకిస్తాన్‌ 126 పాయింట్లతో మొదటి స్థానంలో ఉండగా ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంది.  
 

>
మరిన్ని వార్తలు