కరోనా ఎఫెక్ట్‌ : మాస్క్‌తో చహల్‌

11 Mar, 2020 12:24 IST|Sakshi

ధర్మశాల : కరోనా ఎఫెక్ట్‌ క్రీడలకు కూడా తాకిందనడంలో ఎటువంటి సందేహం లేదు. టోక్యో ఒలింపిక్స్‌ 2020తో పాటు పలు రకాల క్రీడలు కరోనా వైరస్‌ దాటికి వాయిదా పడిన సంగతి తెలిసిందే. మార్చి 29 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్‌ 13వ సీజన్‌పై కూడా స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో టీమిండియా క్రికెటర్‌, లెగ్‌ స్పిన్నర్‌ యజువేంద్ర చహల్‌ ముఖానికి మాస్క్‌ తొడిగిన ఫోటో ఒకటి తన ట్విటర్‌లో షేర్‌ చేశాడు. ప్రసుత్తం చహల్‌ ఫోటో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. చాహల్‌ ముఖానికి మాస్క్‌ వేసుకోవడంతో అతనికి వైరస్‌ ఏమైనా సోకిందా అని అభిమానులు కంగారు పడిపోయారు. కానీ అదేం లేదంటూ చాహల్‌ తేల్చేశాడు. (ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టిన పఠాన్‌)

మన జాగ్రత్తలో మనం ఉంటే ఎలాంటి వైరస్‌లు అయినా మన దగ్గరకు రాలేవని చహల్‌ ట్విటర్‌లో అభిప్రాయపడ్డాడు. కరోనా ప్రభావం తగ్గేవరకు ఇతరులతో షేక్‌ హ్యాండ్‌ ఇవ్వడం లాంటివి చేయకపోవడమే మంచిదని అభిప్రాయపడ్డాడు. కాగా దక్షిణాఫ్రికాతో భారత్‌ మూడు వన్డేల సిరీస్‌ ఆడనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇరు జట్లు మొదటి వన్డే జరిగే ధర్మశాలకు చేరుకొని ప్రాక్టీస్‌ కూడా మొదలుపెట్టేశాయి. కాగా చహల్‌ ఒకరోజు ఆలస్యంగా జట్టుతో కలిశాడు. ఈ నేపథ్యంలో మంగళవారం ధర్మశాలకు వెళ్లే సమయంలో న్యూఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ముఖానికి మాస్క్‌ వేసుకొని ఇలా దర్శనమిచ్చాడు. (క్లార్క్‌కు వచ్చిన నష్టం ఏంటో ?)

మరోవైపు స్వదేశానికి చేరుకున్న ప్రొటీస్‌ జట్టు ప్రాక్టీస్‌లో నిమగ్నమైంది. దక్షిణాఫ్రికా ప్రధాన కోచ్‌ మార్క్‌ బౌచర్‌ మాట్లాడుతూ.. ప్రసుత్తం కరోనా వైరస్‌ నేపథ్యంలో ఆటగాళ్ల పట్ల తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. అంతేగాక మ్యాచ్‌లు జరిగే సమయంలో ఆటగాళ్లతో పాటు స్టేడియంకు వచ్చే ప్రేక్షకులతోనూ ఎలాంటి కరచాలనం చేయకుడదని జట్టును ఆదేశించినట్టు బౌచర్‌ వెల్లడించారు. ఆటగాళ్ల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరిక్షించేందుకు ఒక మెడికల్‌ హెల్త్‌ సూపర్‌వైజర్‌ను ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. కాగా ఇరు జట్ల మధ్య మొదటి వన్డే ధర్మశాల వేదికగా జరగనుంది. కరోనా వైరస్‌ దాటికి ప్రపంచవ్యాప్తంగా మొత్తం లక్షకు పైగా కేసులు నమోదు కాగా,  మృతుల సంఖ్య 4వేలకు పైగా చేరుకుంది. ఇక భారత్‌లో ఇప్పటివరకు 50 కోవిడ్‌ కేసులు నమోదైనట్లు తేలింది.(కోవిడ్‌ గుప్పిట్లో ఇటలీ)

మరిన్ని వార్తలు