జహీర్‌ బాధ్యతలు ఐదు నెలలే: గంగూలీ

15 Jul, 2017 00:39 IST|Sakshi
జహీర్‌ బాధ్యతలు ఐదు నెలలే: గంగూలీ

కోల్‌కతా: టీమిండియా బౌలింగ్‌ కన్సల్టెంట్‌గా ఎంపికైన జహీర్‌ ఖాన్‌ ఏడాదిలో 150 రోజులు మాత్రమే అందుబాటులో ఉంటారని క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ) సభ్యుడు సౌరవ్‌ గంగూలీ స్పష్టం చేశారు. దీంతో జహీర్‌ జట్టుకు పూర్తి స్థాయి బౌలింగ్‌ కోచ్‌ కాదనే విషయంలో స్పష్టత వచ్చినట్టయ్యింది. అటు బీసీసీఐ కూడా ఇప్పటికే జహీర్‌ నియామకం ఆయా పర్యటనల వారీగా సేవలందించే వరకేనని పేర్కొంది.

మరోవైపు తాను కేవలం వంద రోజుల వరకే సేవలందించగలనని జహీర్‌ స్పష్టం చేసినా... సీఏసీ ఒత్తిడి మేరకు తనతో 150 రోజుల ఒప్పందం కుదిరింది. ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రిని నియమించిన అనంతరం సహాయక కోచ్‌లుగా జహీర్, రాహుల్‌ ద్రవిడ్‌ల ఎంపిక అనేక మలుపులు తిరిగిన విషయం తెలిసిందే. జహీర్‌ స్థానంలో పూర్తి స్థాయి కోచ్‌గా భరత్‌ అరుణ్‌ను తీసుకోవాలని రవిశాస్త్రి గట్టిగా పట్టుబడుతున్నారు.

మరిన్ని వార్తలు