'పాండ్యా తొందరపడకు.. సమయం చాలా ఉంది'

4 Feb, 2020 18:42 IST|Sakshi

ముంబై : గత కొంతకాలంగా వెన్నునొప్పితో సతమతమవుతున్న టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా విదేశాల్లో శస్త్రచికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే. దీంతో గతేడాది సెప్టెంబరు నుంచి జట్టుకు దూరమైన పాండ్యా గాయం నుంచి కోలుకొని నెల క్రితమే ప్రాక్టీస్ మొదలుపెట్టాడు.న్యూజిలాండ్‌-ఎ జట్టుకు హార్దిక్‌ను మొదట ఎంపిక చేసినా ఫిట్‌నెస్‌ పరీక్షలో ఫెయిలవడంతో జట్టు నుంచి అతని పేరును తొలగించారు. ప్రస్తుతం ఎన్‌సీఏ చీఫ్ రాహుల్‌ ద్రవిడ్‌ పర్యవేక్షణలో హార్దిక్‌ శిక్షణ పొందనున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ పేసర్‌ జహీర్‌ ఖాన్‌ హార్దిక్‌ పాండ్యాకు ఒక సలహా సూచించాడు.

'ఐపీఎల్‌కు ఇంకా ఎంతో సమయం ఉంది. అప్పటిలోగా నువ్వు 120 శాతం ఫిట్‌నెస్‌తో బరిలోకి దిగడానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే.. గాయాలతో జట్టుకు దూరమైన తర్వాత పునరాగమనం ముఖ్యం కాదు. జట్టులో ప్రదర్శన ఏ స్థాయిలో ఉందనేదే పరిగణనలోకి తీసుకుంటారు. గాయాలతో జట్టుకు దూరమైనప్పుడు ఎంతో అసహనంతో ఉంటాం. కానీ.. ఓపికతో ఉంటేనే తిరిగి కోలుకోగలం. మన శరీరం మాట మనం వినాలి. అందుకే ఇప్పుడు నీకు ఓపిక అనేది చాలా అవసరం' అని జహీర్‌ పేర్కొన్నాడు. సహాయ సిబ్బంది, ఫిజియో, ట్రైనర్స్‌తో పాటు వైద్య సిబ్బంది మాటను పాండ్యా వినాల్సిన అవసరం ఉందని జహీర్‌ పేర్కొన్నాడు. (ఇంకా కోలుకోని హార్దిక్‌ పాండ్యా)

కాగా న్యూజిలాండ్‌ పర్యటనలో టీమిండియా ప్రదర్శనపై జహీర్‌ స్పందించాడు.'న్యూజిలాండ్‌ను సొంతగడ్డపై టీ20 సిరీస్‌లో క్లీన్‌స్వీప్‌ చేసి భారత్‌ సత్తాచాటింది. టీమిండియా 5-0తో విజయం సాధించడం ఎంతో గొప్ప విషయం. ప్రస్తుతం కివీస్ క్లిష్ట సమయంలో ఉంది. భారత్‌ను ఎదుర్కోవడానికి వారు ఇతర మార్గాలు అన్వేషించాలి. బుధవారం నుంచి మొదలుకానున్న వన్డే సిరీస్‌ కూడా కివీస్‌కు సవాలుగా నిలవనుంది. టీమిండియా ఇదే జోరుని కొనసాగిస్తూ వన్డే, టెస్టు సిరీస్‌లను గెలచుకోవాలని కోరుకుంటున్నా. జట్టును గాయాలు వేధిస్తున్నా రిజర్వ్‌ బెంచ్‌ ఎంతో పటిష్ఠంగా ఉంది. ఈ విషయంలో జట్టు దిగులు చెందాల్సిన అవసరం లేదని' జహీర్‌ చెప్పుకొచ్చాడు.('వారి ఆటతీరు చిన్నపిల్లల కంటే దారుణం')

మరిన్ని వార్తలు