ఎవరిది పైచేయి?

26 Dec, 2013 21:22 IST|Sakshi
ఎవరిది పైచేయి?

పరిస్థితులు, పిచ్‌లు, రికార్డులు... అన్నీ దక్షిణాఫ్రికాకే అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి రెండు టెస్టుల సిరీస్‌లో భారత్‌పై ఆతిథ్య జట్టే ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
 దక్షిణాఫ్రికా పేస్ బౌలింగ్ లైనప్‌కు... భారత యువ బ్యాట్స్‌మెన్‌కు ఈ సిరీస్‌లో అసలైన పోరు జరగబోతోంది. అదే సమయంలో వ్యక్తుల మధ్య పోటీ కూడా ఆసక్తికరమే. ఈ సిరీస్‌లో అలాంటి ఆసక్తికర సమరాలను పరిశీలిస్తే...
 సాక్షి క్రీడావిభాగం
 దక్షిణాఫ్రికా పర్యటనకు ఎంపిక చేసిన టెస్టు జట్టులో జహీర్‌ఖాన్ పేరు కనిపించగానే... సఫారీ శిబిరం, ముఖ్యంగా కెప్టెన్ గ్రేమ్ స్మిత్ అప్రమత్తమయ్యాడు. క్రికెట్‌లో సాధారణంగా ఎప్పుడూ కొన్ని రైవలరీస్ ఉంటాయి. అలాంటి వాటిలో ప్రముఖంగా చెప్పుకోదగింది స్మిత్, జహీర్‌ల పోరాటం. ఈ సిరీస్‌లో భారత్ గెలవాలంటే అన్ని విభాగాల్లోనూ నిలకడగా ఆడాలి. జట్టంతా సమష్టిగా రాణించడం ముఖ్యం. అయితే ఇందులో కొన్ని వ్యక్తిగత పోరాటాల్లో భారత క్రికెటర్లు పైచేయి సాధించాలి.
 
 గ్రేమ్ స్మిత్ vs జహీర్
 జహీర్ ఇప్పటి వరకూ స్మిత్‌ను ఆరుసార్లు అవుట్ చేశాడు. ప్రపంచ క్రికెట్‌లో స్మిత్‌ను అవుట్ చేయడంలో సక్సెస్ రేట్ అందరికంటే ఎక్కువగా జహీర్‌కే ఉంది. అందుకే దీని గురించి విపరీతమైన చర్చ జరుగుతోంది. అయితే స్టార్ క్రికెటర్లిద్దరూ దీనిని కొట్టిపారేశారు. ‘స్మిత్‌ను ఒక్కడినే లక్ష్యం చేసుకోవడమేమీ లేదు. దక్షిణాఫ్రికా జట్టులో నాణ్యమైన బ్యాట్స్‌మెన్ చాలా మంది ఉన్నారు. కాబట్టి నిలకడగా రాణించడం ముఖ్యం’ అని జహీర్ అన్నాడు. ‘అసలు ఇది పట్టించుకోవాల్సిన పనిలేదు. ప్రతి బౌలర్ ఎన్నో కొన్నిసార్లు ప్రతి బ్యాట్స్‌మన్‌నూ అవుట్ చేస్తాడు’ అని స్మిత్ కొట్టిపారేశాడు. బయట మాటలు ఎలా ఉన్నా... స్మిత్‌పై జహీర్ పైచేయి సాధించడం చాలా ముఖ్యం. ఆరంభంలోనే జహీర్... ఫామ్‌లో ఉన్న స్మిత్‌ను అవుట్ చేస్తే భారత్ మానసికంగా పైచేయి సాధిస్తుంది.
 
 ఆమ్లా, కలిస్ vs ఇషాంత్
 దక్షిణాఫ్రికా విజయాల్లో కీలక ఆటగాళ్లు ఆమ్లా, కలిస్. ఈ ఇద్దరూ కుదురుకున్నారంటే ప్రత్యర్థి బౌలర్లకు కష్టాలు తప్పవు. కలిస్, ఆమ్లా జోడీ వేగంగా ఆడదు. కానీ భారీ భాగస్వామ్యాలు ఏర్పాటు చేయడంలో ఈ ఇద్దరూ దిట్ట. మరోవైపు ఇషాంత్ దక్షిణాఫ్రికాతో మూడో వన్డేలో ప్రదర్శన ద్వారా టెస్టుల్లో తుది జట్టులో తన స్థానాన్ని దాదాపుగా ఖరారు చేసుకున్నాడు. జహీర్ తర్వాత భారత లైనప్‌లో అతనే అనుభవజ్ఞుడు. కాబట్టి ఈ ఇద్దరినీ నియంత్రించాల్సిన బాధ్యత ఇషాంత్‌ది.
 
 డివిలియర్స్, డుప్లెసిస్ vs షమీ
 దక్షిణాఫ్రికా మిడిలార్డర్‌లో అత్యంత కీలక ఆటగాళ్లు డివిలియర్స్, డుప్లెసిస్. ఈ ఇద్దరూ వేగంగా ఆడటంలో దిట్ట. ప్రత్యర్థి బౌలర్లు తేరుకునేలోపే చకచకా పరుగులు చేసి స్కోరుబోర్డు మీద భారీ మొత్తం చూపించేస్తారు. ఇక భారత బౌలర్ షమీ ఇటీవలీ కాలంలో పెద్ద సంచలనం. ముఖ్యంగా వెస్టిండీస్‌తో స్వదేశంలో సిరీస్‌లో రివర్స్ స్వింగ్ ద్వారా సంచలన ఫలితాలు రాబట్టాడు. దక్షిణాఫ్రికాలోనూ వన్డేల్లో రాణించాడు. టెస్టుల్లో మిడిలార్డర్‌లో సఫారీ జోడీని రివర్స్ స్వింగ్‌తో కట్టడి చేయాల్సిన బాధ్యత షమీది.
 
 స్టెయిన్ vs భారత టాప్ ఆర్డర్
 టెస్టు మ్యాచ్‌ల్లో వికెట్లు ఎలా ఉండబోతున్నాయో వన్డేల్లోనే దక్షిణాఫ్రికా శాంపిల్ చూపించింది. తెల్ల బంతితోనే బౌన్సర్ల వర్షం కురిపించిన స్టెయిన్... తనకు బాగా నచ్చిన పచ్చిక పిచ్‌లపై ఎర్రబంతితో ఎలా నిప్పులు చెరుగుతాడో ఊహించుకుంటేనే ఆందోళన చెందే పరిస్థితి. ప్రస్తుత క్రికెట్‌లో స్టెయిన్ కంటే ప్రమాదకర బౌలర్ లేడు. తనని సమర్థంగా ఎదుర్కొని భారత టాప్ ఆర్డర్ ఎలాంటి ఆరంభం ఇస్తుందనేది సిరీస్‌లో అత్యంత కీలక అంశం. మురళీ విజయ్, శిఖర్ ధావన్‌లకు పెద్దగా అనుభవం లేదు. అసలు ధావన్ భారత్ బయట టెస్టు మ్యాచ్ ఆడటం కూడా ఇప్పుడే. స్టెయిన్ బౌలింగ్‌ను ఎదుర్కొనే సాంకేతిక నైపుణ్యం వీరికి ఉందా అనేది ప్రశ్నార్థకమే. అయితే పుజారా విషయంలో మాత్రం సగటు భారత అభిమాని చాలా అంచనాలతో ఉన్నాడు.
 
 భారత మిడిలార్డర్ vs మోర్కెల్, ఫిలాండర్
 దక్షిణాఫ్రికా ఒకవేళ నలుగురు పేసర్లతో బరిలోకి దిగినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ముగ్గురు పేసర్లతోనే ఆడితే స్టెయిన్‌తో పాటు మోర్కెల్, ఫిలాండర్ తుది జట్టులోకి వస్తారు. ఈ ఇద్దరూ కూడా బాగా ప్రమాదకరమైన బౌలర్లు. మోర్కెల్ బౌన్స్‌ను నమ్ముకుంటే... ఫిలాండర్ స్వింగ్‌తో సంచ లనాలు సృష్టిస్తున్నాడు. సచిన్ రిటైర్మెంట్ తర్వాత భారత్ ఆడబోతున్న తొలి సిరీస్ ఇది. మాస్టర్ స్థానంలో కోహ్లి నాలుగో స్థానంలో రావడం దాదాపుగా ఖాయమే. రోహిత్, రహానే, ధోని మిడిలార్డర్‌లో మిగిలిన బ్యాట్స్‌మెన్. నిజానికి ఈ నలుగురూ నాణ్యమైన బ్యాట్స్‌మెనే అయినా... దక్షిణాఫ్రికా పిచ్‌లపై ఓపిగ్గా గంటల తరబడి క్రీజులో నిలబడాలి. ఈ ఓపిక ఈ నలుగురికి ఉందా అనేదే పెద్ద ప్రశ్న. రోహిత్, కోహ్లి, ధోని ముగ్గురూ వన్డేల్లో తేలిపోయారు. షార్ట్‌పిచ్ బంతులను ఆడటంలో తమ బలహీనతలను బయటపెట్టుకున్నారు. కాకపోతే టెస్టుల్లో కావలసినంత సమయం ఉంటుంది. దీనిని వినియోగించుకుంటారో లేదో చూడాలి.

మరిన్ని వార్తలు