వార్న్‌ తర్వాత జంపానే..

10 Mar, 2019 18:13 IST|Sakshi

మొహాలి: భారత్‌తో నాల్గో వన్డేలో ఆస్ట్రేలియా స్పిన్నర్‌ ఆడమ్‌ జంపాకు వికెట్‌ మాత్రమే లభించింది. భారత్‌ ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ను జంపా ఔట్‌ చేశాడు. దాంతో 50వ వన్డే వికెట్‌ను జంపా తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే 50వ వన్డే వికెట్‌ను సాధించే క్రమంలో అతి తక్కువ మ్యాచ్‌లు ఆడిన ఆసీస్‌ బౌలర్లలో జాబితాలో జంపా రెండో స్థానంలో నిలిచాడు. తొలి స్థానంలో షేన్‌ వార్న్‌ ఉన్నాడు. యాభైవ వికెట్‌ను తీయడానికి జంపాకు 38 ఇన్నింగ్స్‌లు అవసరం కాగా, షేన్‌ వార్న్‌ 25 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మార్కును చేరాడు. అతి తక్కువ మ్యాచ్‌ల్లో యాభై వికెట్లు సాధించిన ఆసీస్‌ స్పిన్నర్ల జాబితాలో వార్న్‌, జంపాల తర్వాత స్థానంలో పీటర్‌ టేలర్‌(40 మ్యాచ్‌లు), నాథన్‌ హారిట్జ్‌(44 మ్యాచ్‌లు), బ్రాడ్‌ హాగ్‌(47)లు వరుసగా ఉన్నారు.

ఆసీస్‌తో నాల్గో వన్డేలో భారత్‌ తొమ్మిది వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్ ఆది నుంచి దూకుడుగా ఆడింది. భారత ఓపెనర్లలో శిఖర్‌ ధావన్‌(143; 115బంతుల్లో 18 ఫోర్లు, 3 సిక్సర్లు) భారీ శతకం నమోదు చేయగా, రోహిత్‌ శర్మ(95; 92 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 193 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించారు.  అయితే భారత్‌ స్కోరు 254 పరుగుల వద్ద ధావన్‌ రెండో వికెట్‌ ఔటయ్యాడు. ప్యాట్ కమిన్స్‌ బౌలింగ్‌లో ధావన్‌ బౌల్డ్‌ అయ్యాడు. ఆపై మరో 12 పరుగుల వ్యవధిలో విరాట్‌ కోహ్లి(7) ఔట్‌ కావడంతో భారత్ మూడో వికెట్‌ను నష్టపోయింది. ఆ తరుణంలో కేఎల్‌ రాహుల్‌తో జత కలిసిన రిషబ్‌ పంత్‌ బ్యాట్‌ ఝుళిపించాడు.  జట్టు స్కోరు 296 పరుగుల వద్ద రాహుల్‌(26) నాల్గో వికెట్‌గా పెవిలియన్‌ బాటపట్టాడు.

కాసేపటికి రిషభ్‌ పంత్‌(36; 24 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్‌) ఐదో వికెట్‌గా ఔటయ్యాడు. అటు తర్వాత జాదవ్‌(10), భువనేశ్వర్‌లు స్వల్ప వ్యవధిలో ఔట్‌ కావడంతో భారత్‌ స్కోరులో వేగం తగ్గింది. చివర్లో విజయ్‌ శంకర్‌( 26; 15 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్సర్లు) ధాటిగా ఆడటంతో భారత్‌ నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు