మోడల్‌ స్కూల్‌ పిలుస్తోంది

14 Feb, 2018 13:32 IST|Sakshi
పొందూరులో ఆదర్శ పాఠశాల

ఆరో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

స్వీకరణకు ఈ నెల 16 వరకూ గడువు

14 పాఠశాలల్లో అందుబాటులో 1120 సీట్లు

స్కాలర్‌షిప్, కంప్యూటర్‌ ఎడ్యుకేషన్, ఈ–లెర్నింగ్‌ సదుపాయాలు

కార్పొరేట్‌కు దీటుగా ఆంగ్ల మాధ్యమంలో బోధన

పొందూరు: తమ పిల్లలను ఆంగ్ల మాధ్యమంలో చదివించాలని ఎంతోమంది తల్లిదండ్రులు భావిస్తున్నారు. కానీ ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతోపాటు రూ.వేలల్లో ఫీజులు చెల్లించలేక వెనకడుగు వేస్తున్నారు. మధ్యతరగతి వారు అప్పోసొప్పో చేసి ఫీజులు చెల్లించి కార్పొరేట్‌ పాఠశాలల్లో చదివిస్తున్నారు. నిరుపేదల పిల్లలకు కార్పొరేట్‌ విద్య అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది. ఈ నేపథ్యంలో కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా అన్ని సదుపాయాలు కల్పిస్తూ.. ఆంగ్ల మాధ్యమంలో విద్య  అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆదర్శ పాఠశాలలు ప్రారంభించింది. ఉచితంగా విద్యతో పాటు పక్కా భవనాలు, ల్యాబ్‌లు, లైబ్రరీ సదుపాయాలు అందుబాటులో ఉంచుతోంది. ఆరో తరగతిలో ప్రవేశిస్తే ఇంటర్మీడియట్‌ వరకు అదే పాఠశాలల్లో చదువుకునే అవకాశం కల్పిస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఆదర్శ పాఠశాలలో 2018–19కు గాను ఆరో తరగతిలో చేరేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ నెల 16తో దరఖాస్తులు చేసుకొనేందుకు గడువు ముగుస్తుంది.

దరఖాస్తులు ఇలా
ఆదర్శ పాఠశాలల్లో 2018–19కి గాను ఆరో తరగతిలో విద్యార్థుల ప్రవేశానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 2018 ఏప్రిల్‌ 8వ తేదీన ఐదో తరగతి స్థాయిలో తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో ప్రవేశ పరీక్ష ఉంటుంది. విద్యార్థులు చేరే పాఠశాలలోనే దీనిని ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు రాయాల్సి ఉంటుంది. ఓసీ, బీసీ కులాలకు చెందిన విద్యార్థులు 2006, సెప్టెంబర్‌ 1  నుంచి 2018, ఆగస్టు 31 మధ్య జన్మించాలి. వయసు 10 నుంచి 12 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన వారు 2006 సెప్టెంబర్‌ 1 నుంచి 2018 ఆగస్టు 31, 2018 మధ్య జన్మించాలి. 10 నుంచి 14 ఏళ్లు దాటకూడదు. విద్యార్థి ప్రాథమిక వివరాలతో ప్రవేశ పరీక్ష రుసుమును నెట్‌ బ్యాంకింగ్, క్రెడిట్, డెబిట్‌ కార్డులను ఉపయోగించి చెల్లిస్తే జనరల్‌ నంబర్‌ కేటాయిస్తారు.

ఆ నంబరు ఆధారంగా విద్యార్థి పూర్తి వివరాలతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అలా చేసిన దరఖాస్తును సంబంధిత పాఠశాల ప్రిన్సిపాల్‌కు అందించాలి. ఓసీ, బీసీలకు రూ.100లు, ఎస్సీ, ఎస్టీలకు రూ.50 పరీక్ష రుసుం చెల్లించాల్సి ఉంటుంది. పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. ఐదో తరగతి సిలబస్‌  మేరకు తెలుగు – 25, ఇంగ్లీష్‌ – 25, గణితం – 25, పరిసరాల విజ్ఞానం –25 మార్కులకు ప్రశ్నాపత్రం ఉంటుంది. ఈ పరీక్షలో ఓసీ, బీసీలు 50 మార్కులు, ఎస్సీ, ఎస్టీలు 35 మార్కులు పొందాలి. ప్రవేశాలు ప్రతిభ, రిజర్వేషన్‌ ఆధారంగా ఉంటాయి. 

జిల్లాలో 1120 సీట్లు
జిల్లాలో ఉన్న 14 ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతిలో చేరేందుకు 1120 సీట్లు ఉన్నాయి. ఒక్కొక్క ఆదర్శ పాఠశాలలో 80 మందిని మాత్రమే చేర్చుకుంటారు. పొందూరు, కుప్పిలి, రణస్దలం, లావేరు, జి.సిగడాం, పోలాకి, జలుమూరు, కవిటి, సోంపేట, ఇచ్ఛాపురం, భామిని, పాతపట్నం, కంచిలి, ఓవిపేట(బూర్జ) ఆదర్శ పాఠశాలల్లో చదివేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

పాఠశాల ప్రత్యేకతలు
కార్పొరేట్‌ స్థాయిలో ఆంగ్ల మాధ్యమంలో విద్య, క్రమ శిక్షణ, నైతిక విలువలు, కమ్యూనికేషన్‌ స్కిల్స్, స్పోకెన్‌ ఇంగ్లిషులపై బోధన ఉంటుంది. అన్ని సదుపాలతో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ల్యాబ్, గ్రంథాలయం అందుబాటులో ఉన్నాయి. ఉచిత పాఠ్య పుస్తకాలు, మధ్యాహ్న బోధన సదుపాయం ఉంది. విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ సౌకర్యం, కంప్యూటర్‌ ఎడ్యుకేషన్, ఈ–లెర్నింగ్, సీసీఈకు అనుగుణంగా విద్యాబోధన చేస్తారు.

బ్రిడ్జి కోర్సు నిర్వహిస్తున్నాం
తెలుగు మీడియం నుంచి వచ్చిన పిల్లల కోసం ఆరో తరగతిలో బ్రిడ్జి కోర్సును నిర్వహిస్తున్నాం. ఏడో తరగతికి వచ్చేసరికి పూర్తిస్థాయిలో ఆంగ్ల మాధ్యమంలో బోధన చేస్తున్నప్పటికీ అర్థం చేసుకుంటున్నారు. ఈ పాఠశాల నుండి రిలీవైన పిల్లలు ఉన్నత విద్యను పూర్తి చేసుకొన్న తర్వాత ఉద్యోగాలకు నిర్వహించిన ఇంటర్వ్యూల్లో విజయం సాధించగలరు.
– మార్తా తిలకం, ప్రిన్సిపాల్, ఆదర్శ పాఠశాల, పొందూరు 

మరిన్ని వార్తలు