ఆపదలో బాల్యంపై విజి‘లెన్స్‌’!

13 Feb, 2018 13:05 IST|Sakshi
కవిటిలో ఉన్నత పాఠశాల విద్యార్థుల ఆరోగ్యంపై విజిలెన్స్‌ అధికారులు నివేదిక సిద్ధం చేస్తున్న దృశ్యం

సాక్షి కథనానికి స్పందించిన కలెక్టర్‌

విద్యార్థుల ఆరోగ్యంపై తనిఖీలు చేపట్టాలని విజిలెన్స్‌ విభాగానికి ఆదేశం

కవిటి మండలంలో 5 బృందాలు పర్యటన

శ్రీకాకుళం, కవిటి: విద్యార్థుల ఆరోగ్యానికి భరోసా కల్పించాల్సిన జవహర్‌ బాల ఆరోగ్య రక్ష పథకం తీరు అందుకు భిన్నంగా ఉంది. సర్కార్‌ బడుల్లో చదువుతున్న పిల్లలకు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేసి ఆరోగ్యంగా ఉండేలా చూడాల్సి ఉండగా.. వివిధ కారణాలతో ఆ ప్రక్రియ జరగడం లేదు. దీంతో చాలామంది పిల్లలు రోగాలబారిన పడుతున్నారు. ఈ పరిస్థితులను వివరిస్తూ ఈ నెల 7వ తేదీన ఆపదలో బాల్యం శీర్షికతో  ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనికి జిల్లా కలెక్టర్‌ కె.ధనంజయరెడ్డి  స్పందించారు. విద్యార్థుల ఆరోగ్య స్థితిగతులపై తనిఖీలు చేపట్టాలని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ విభాగాన్ని ఆదేశించారు. దీంతో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగానికి చెందిన ఎస్పీ టి.హరికృష్ణ ఆదేశాలతో ఐదు బృందాలు కవిటి మండలం మాణిక్యపురం, కుసుంపురం జెడ్పీ ఉన్నత పాఠశాల, కవిటి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, సోంపేట మండలం మామిడిపల్లి కేజీబీవీ, కంచిలి మండలం జాడుపుడిలోని కేజీబీవీ పాఠశాలల్లో సోమవారం ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా పాఠశాలల్లో రాష్ట్రీయ బాలస్వాస్ధ్య కార్యక్రమం (ఆర్‌బీఎస్‌కే) (గతంలో దీనినే జవహర్‌బాల ఆరోగ్యరక్ష కార్యక్రమంగా పిలిచేవారు) అమలు జరుగుతున్న తీరును పరిశీలించారు.

విద్యార్థులకు ఇంతవరకు వైద్యులు ఎన్నిసార్లు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు, అందుకు సంబంధించిన రికార్డుల నిర్వహణ  ఎలా ఉంది అనే అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే పథకం నిర్వహణలో పలు లోపాలు వెలుగు చూసినట్టు తెలిసింది. 8 మంది విద్యార్థులు వివిధ వ్యాధులతో బాధపడుతూ అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్టు  విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారుల విచారణలో వెలుగుచూసింది. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలో మెనూ అమలు తీరుపై తనిఖీ బృందాలు విద్యార్థులను  అడిగి తెలుసుకున్నాయి. ‘సాక్షి’ కథనంలో ప్రస్తావించిన మృతి చెందిన విద్యార్థుల గురించి వారి కుటుంబసభ్యులు, పాఠశాలల సిబ్బందితో విచారణ సిబ్బంది మాట్లాడారు. విద్యార్థుల మరణానికి దారితీసిన పరిస్థితులను తెలుసుకొని వివరాలు నమోదు చేసుకున్నారు. మధ్యాహ్న భోజనంలో నాణ్యతతో కూడిన పోషకాహారం అందిస్తున్నారా? ఆహారం వండేటప్పుడు పరిశుభ్రతకు ఏమేరకు ప్రాధాన్యత ఇస్తున్నారు, మరుగుదొడ్ల నిర్వహణ ఉందా లేదా చూశారు. వాస్తవ గణాంకా లతో కూడిన నివేదికను సిద్ధం చేశారు. దీన్ని విజిలెన్స్‌ ఎస్పీ టి.హరికృష్ణ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌కు నివేదించనున్నట్టు  అధికారులు తెలి పారు. విచారణలో విజిలెన్స్‌ ఎస్పీ హరికృష్ణ  డీఎస్పీ ప్రసాదరావు, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ సీహెచ్‌ సూర్యత్రినాథరావు, డీసీటీవో తారకరామారావు, ఆర్‌. విద్యాసాగర్, టి.సామ్యూల్‌రాజు, కె కృష్ణారావు, రవికాంత్‌ ఉన్నారు.

మరిన్ని వార్తలు