పీఎఫ్‌ ఫట్‌

13 Feb, 2018 12:56 IST|Sakshi
తమ సమస్యలు చెప్పుకునేందుకు జిల్లా కలెక్టరేట్‌కు సోమవారం వచ్చిన ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులు

ఎస్‌ఎస్‌ఏలో కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు ప్రభుత్వం ఝలక్‌

జీతాల నుంచి దాచుకునే భవిష్యనిధికి సర్కారు చెల్లుచీటి

ఈపీఎఫ్, ఈఎస్‌ఐ ఉత్తర్వులు రద్దు చేసిన ప్రభుత్వం

జిల్లాలో 1,100 మందిపై ప్రభావం

వీరఘట్టం: ప్రభుత్వ కార్యాలయాల్లో నెలకు రూ. 6 వేలు ఆదాయం దాటిన కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల జీతాల నుంచి భవిష్య నిధి(ఈపీఎఫ్‌) కోసం కనీసం 7 నుంచి 12 శాతం కట్‌ చేసి, ఉద్యోగ విరమణ అనంతరం వారికి ప్రభుత్వం ఇచ్చే 13.61 శాతం షేర్‌తో కలిపి భవిష్యనిధి అందజేయాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు మాత్రమే ఈ నిబంధన అమలవుతోంది. అయితే సర్వశిక్షా అభియాన్‌లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు మాత్రం ఇక మీదట భవి ష్యనిధి వర్తించదని ఇటీవల సర్కార్‌ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జిల్లాలోని 1,100 మంది ఎస్‌ఎస్‌ఏ కాంట్రాక్ట్‌ ఉద్యోగులు భవిష్యనిధికి దూరమవుతున్నారు.

ఇదీ పరిస్థితి
జిల్లా సర్వశిక్షా అభియాన్‌లో పనిచేస్తున్న క్లస్టర్‌ రీసోర్స్‌ పర్సన్లు(సీఆర్‌పీ), మండల ఇన్‌ఫర్మేషన్‌ సిస్టం కో–ఆర్డినేటర్లు(ఎంఐఎస్‌), డేటాఎంట్రీ ఆపరేటర్లు, సహిత ఉపాధ్యాయులు(ఐఈఆర్‌టీ), జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్లు, కేజీబీవీల్లో పనిచేస్తున్న బోధనా సిబ్బందికి భవిష్యనిధి వర్తించదని కొద్ది  రోజుల క్రితం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి ఝలక్‌ ఇచ్చింది. ఎప్పటికైనా తమ సేవలను ప్రభుత్వం గుర్తిస్తుందని వీరంతా ఎంతో ఆశపడ్డారు. జీతాలు పెంచాలని గతంలో అమరావతిలో ఆందోళన కూడా చేశారు. రూ. 14 వేలు వేతనం పెంచుతూ ఈపీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యాలు కల్పించే విధంగా జీవో చేస్తామని ప్రభుత్వం భరోసా ఇచ్చింది. అందుకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2017 ఆగస్టు నుంచి జీవో అమలు చేసింది. ఆరు నెలలు గడవకముందే ఈ జీవోను రద్దు చేస్తూ  ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులకు ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది.

పీఎఫ్‌కు దూరమైన ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులు
ఎస్‌ఎస్‌ఏలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు ఈపీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యం లేదు. దీంతో వీరు చేసిన పోరాటాల ఫలితంగా గతేడాది ఆగస్టు 17 నుంచి ఉద్యోగుల జీతాల్లో ఈపీఎఫ్, ఈఎస్‌ఐ రికవరీ చేశారు. ఉద్యోగుల షేర్‌ ఈపీఎఫ్‌ 12 శాతం, ఈఎస్‌ఐ 1.75 శాతం కట్‌ చేస్తూ వచ్చారు. మళ్లీ ఇప్పుడు ప్రభుత్వం మాట మార్చేసి వీరి భవిష్యనిధి ఉత్తర్వులను రద్దు చేసింది. వీటికి సంబంధించి ఇప్పటివరకు కట్‌ చేసిన మొత్తాన్ని తిరిగి ఉద్యోగుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగులు భవిష్యనిధికి దూరమైపోయారు.

ఇదీ నిబంధన
దేశ వ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర భాగస్వామ్యంతో ఉన్న స్కీంలోని ఉద్యోగులకు ఈసీఎఫ్, ఈఎస్‌ఐ కల్పించాలనే నిబంధన ఉంది. ప్రస్తుత నేషనల్‌ హెల్త్‌ మిషన్‌లో పనిచేస్తున్న కాంట్ట్రాక్‌ ఉద్యోగులకు ఆ సౌకర్యం అమలులో ఉంది. 2017 ఆగస్టు నుంచి ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులకు ఈపీఎఫ్, ఈఎస్‌ఐ అమలు అని ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. అప్పటి నుంచి వీరి జీతాల్లో రికవరీ కూడా చేశారు. ఆరు నెలల నుంచి ఈపీఎఫ్, ఈఎస్‌ఐ అమలు కోసం ప్రయత్నాలు చేస్తున్నామని కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు ప్రభుత్వం చెబుతూనే ఉంది. ఇప్పుడేమో అకస్మాత్తుగా ఈ జీవో రద్దు చేయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత
ఎస్‌ఎస్‌ఏ కాంట్రాక్ట్‌ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. జిల్లా వ్యాప్తంగా 1,100 మందికిపైగా ఈ ఉద్యో గులు ఉన్నారు. ఔట్‌ సోర్సింగ్, కాంట్రా క్ట్‌ ఉద్యోగులు, కేజీబీవీ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ జేఏసీ ఈ నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తోంది. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు