గోకులం.. అంతా కలకలం

13 Mar, 2019 09:10 IST|Sakshi
బొబ్బిలిపేట గ్రామంలో పునాది దశలో ఉన్న గోకులం నిర్మాణాలు

సాక్షి, ఆమదాలవలస రూరల్‌: వ్యవసాయరంగానికి పెద్దపీట అంటూనే ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులను దగా చేస్తున్నారు. పథకాలు, రాయితీలు, సబ్సీడీలు ఇవిగో అంటూ ఒక చేత్తో చూపించి మరో చేత్తో లాగేసుకుంటూ పథకం ప్రకారం పక్కాగా మోసం చేస్తున్నారు. ఇటీవల పశుసంవర్థకశాఖ ఆధ్వర్యంలో కొత్తగా అమలు చేసిన గోకులం పథకమే దీనికి చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 90 శాతం రాయితీతో మొదట ఊరించిన టీడీపీ సర్కారు ఉన్న ఫలంగా రాయితీపై కొర్రీలు వేయడంతో చివరికి పథకాన్ని అటకెక్కించారు.

ఈ పథకం గురించి పశుసంవర్థకశాఖలో పనిచేస్తున్న సిబ్బంది కూడా గోకులం గురించి రైతులు తగిన ప్రచారం చేయకపోవడంతో షెడ్లు నిర్మించి తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ పథకం గురించి క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాల్సిన టెక్నికల్‌ మోనటరింగ్, ఎంపీడీఏలు కేవలం కార్యాలయానికే పరిమితం కావడంతో రైతులకు కష్టాలు తప్పడం లేదు. బిల్లులు మంజూరుకాకపోయినా సరే నిర్మాణాలు చేపట్టాలని రైతుల నుంచి ఒత్తిడి తీసుకురావడంతో నిర్మించిన రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు.

ఊరించిన సర్కార్‌ ..
పశుసంవర్థకశాఖ ఆధ్వర్యంలో సామాజిక గోకులాలు, మినీ గోకులాల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తామని చంద్రబాబు సర్కార్‌ రైతులను ఊరించింది. నాలున్నరేళ్లగా రైతులకు ఉపయోగపడే ఒక్క పథకాన్ని అమలు చేయకుండా మభ్యపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం చివరకు గోకులం అనే పథకం అమలుకు శ్రీకారం చుట్టడంతో రైతులు ఎగబడ్డారు. ఉపా«ధి హామీ పథకానికి అనుసంధానంతో గోకులం(పశు వసతి గృహం) నిర్మించనున్న లబ్ధిదారులు తమ వాటా కింద 10 శాతం భరిస్తే మిగతా 90 శాతం రాయితీ రూపంలో ఇస్తామని నమ్మబలికారు. పథకం బాగానే ఉందంటూ చాలా మంది రైతులు దరఖాస్తులు చేసుకున్నారు.

గోకులాల కేటాయింపులు ఇలా
గోకులాల పథకం ప్రవేశపెట్టినప్పుడు మూడు పథకాలు అమల్లో ఉండేది. రెండు పశువులకు గాను షెడ్డు నిర్మాణానికి రైతు వాటా రూ.10 వేలు, ప్రభుత్వం నుంచి రూ. 90 వేలు కేటాయించారు. నాలుగు పశువులకు షెడ్డు నిర్మాణానికి రైతు వాటా రూ.15 వేలు, ప్రభుత్వం వాటా రూ.1.35 లక్షలు, ఆరు పశువులకు షెడ్డు నిర్మిస్తే రైతు వాటా రూ.18 వేలు, ప్రభుత్వం వాటా రూ. 1.68 లక్షలు అంటూ చెప్పడంతో రైతులు దరఖాస్తులు చేసుకున్నారు. 

నిర్మించినవి ఇవే..
ఆమదాలవలస మండలంలో 426 మంది రైతులు గోకులానికి దరఖాస్తులు చేసుకోగా అందులో ప్రస్తుతానికి 40 షెడ్లు పూర్తిగా నిర్మాణాలు జరిపారు. గొర్రెల కాపరులు కూడా 30 షెడ్లు నిర్మించారు. ఇందులో 180 షెడ్లు నిర్మాణ దశలో ఉండగా 176 షెడ్లు  పునాదుల దశలో ఉన్నాయి. బూర్జ మండలంలో కేవలం 69 షెడ్లు మాత్రమే పనులు జరుగుతున్నవి. అయితే గోకుల లబ్ధిదారులకు ఇప్పటి వరకు ఒక్క రూపాయి బిల్లు కూడా మంజూరు కాలేదు.  

బిల్లు రాలేదు
గోకులం పథకం పేరుతో గొర్రెల నివాసానికి షెడ్డు నిర్మిస్తున్నాను. గోతులు తీసి పునాదులు కూడా వేశాను. ఇప్పటి వరకు పైసా బిల్లులు కూడా మంజూరు కాలేదు. పునాదుల కోసం అప్పులు చేసి నిర్మాణాలు చేపట్టాను. బిల్లులు మంజూరు కాకపోతే తీవ్రంగా నష్టపోతాను.

తాన్ని ఎర్రయ్య, లబ్ధిదారుడు, బొబ్బిలిపేట, ఆమదాలవలస మండలం

పథకం మంజూరు కాలేదు
గోకులం పథకం ద్వారా పశువుల షెడ్డు నిర్మించడానికి డీడీ తీశాను. పథకానికి అర్హత ఉన్నా ఇంతవరకు మంజూరు చేయలేదు. డీడీ తీసుకుని కార్యాలయం చుట్టూ తిప్పుతున్నారే తప్ప నిర్మాణానికి ఎటువంటి అనుమతి ఇవ్వలేదు. డీడీ తీసుకుని నష్టపోవడం తప్ప ఉపయోగం లేదు.

– గేదెల లక్ష్మణరావు, దూసి, ఆమదాలవలస మండలం

బడ్జెట్‌ విడుదల కాలేదు
గోకులం పథకం లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లులు మంజూరు కావడం లేదన్న మాట వాస్తవమే. బిల్లులు నివేదికను జిల్లా అధికారులకు అందజేశాం. బడ్జెట్‌ విడుదల కానందున బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. బిల్లులు రాకున్నా పనులు నిలుపుదల చేయవద్దని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు ఉన్నాయి. అందుకే పనులు వేగవంతం చేస్తున్నాం. –ఆర్‌.ఆనందరావు, పశుసంవర్థకశాఖ ఏడీ, ఆమదాలవలస   

మరిన్ని వార్తలు