'కళా 'పవర్‌కు ఎస్‌ఈ చిత్తు!

12 Jan, 2018 09:39 IST|Sakshi

విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ బదిలీపై రాజకీయ నీడ

మంత్రి అచ్చెన్నకు అనుకూల అధికారులపై మరో మంత్రి కన్నెర్ర

అరసవల్లి: జిల్లాలోని ఇద్దరు మంత్రుల మధ్య విభేదాలు ఓ అధికారి బదిలీకి కారణమయ్యాయి. వీరి ఆధిపత్య పోరులో అధికారులు నలిగిపోతున్నారు. గడిచిన మూడేళ్లలో పలువురు అధికారులు రాజకీయ జోక్యంతోనే బదిలీలకు, క్రమశిక్షణ చర్యలకు గురయ్యారు. తాజాగా రెండో మంత్రిగా కళా వెంకట్రావు జిల్లాలో అడుగుపెట్టడం..అందులోనూ విద్యుత్‌ శాఖ  మంత్రి కావడంతో తొలి వేటు విద్యుత్‌ శాఖ ఉన్నతాధికారిపైనే పడింది. వాస్తవానికి ముక్కుసూటి ధోరణి, సున్నిత మనస్తత్వం ఉన్న తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ ఎస్‌ఈ దత్తి సత్యనారాయణ కేవలం ఏడాదిన్నర కాలమే విధుల్లో చేరారు. అయితే ఈయన్ను ఆకస్మికంగా బదిలీ చేస్తున్నట్లు సీఎండీ కార్యాలయం నుంచి వచ్చిన ఉత్తర్వులు వెనుక పెద్ద కథే నడిచిందనే ప్రచారం జరుగుతుంది.

విశ్వసనీయ సమాచారం మేరకు జిల్లాకు చెందిన విద్యుత్‌ శాఖ మంత్రి కళా వెంకటరావుకు, మరో మంత్రి అచ్చెన్నాయుడుకు మధ్య కొంత కాలంగా ఆధిపత్యపోరు సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరూ.. ఏ అవకాశమొచ్చినా..వెంటనే దాన్ని అమలు చేసేలా  పావులు కదుపుతున్నారు. జిల్లాలో అనుకూల నాయకులపైన, లేదంటే అనుకూలంగా పనిచేశారన్న నెపంతో ఉద్యోగులపై తమ ప్రతాపాలు చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ సత్యనారాయణపై బదిలీవేటు పడిందనే ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామంతో మరికొంతమంది అధికారులు, ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఎస్‌ఈ ఆకస్మిక బదిలీని అన్ని విద్యుత్‌ ఉద్యోగుల సంఘాల నేతలు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నాయి. మంత్రుల తీరుపై భగ్గుమంటున్నారు.

పైచేయి కోసం..!
జిల్లా నుంచి బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రిగా అచ్చెన్నాయుడు, విద్యుత్‌ శాఖామంత్రిగా, రాష్ట్ర టిడిపి అధ్యక్షుడిగా కళావెంకట్రావులు కొనసాగుతున్నారు. అయితే గతేడాది నుంచి వీరిద్దరి మధ్య ఆధిపత్యపోరు తారస్థాయికి వెళ్లిందని చెప్పవచ్చు. ఇటీవల మంత్రి అచ్చెన్న ప్రధాన అనుచరులైన జెడ్పీ చైర్‌పర్సన్‌ చౌదరి ధనలక్ష్మికి ముద్దాడ ఇసుకరీచ్‌ను పూర్తిగా రద్దు చేయించి, జిల్లాలో ఆధిపత్యపోరులో ఒక మెట్టు ఎక్కిన మంత్రి కళా.. మరోసారి ద్వితీయ విఘ్నం దాటేయ్యాలని భావించి, అచ్చెన్నకు అనుకూలంగా ఉన్నారన్న నెపంతో ఎస్‌ఈ సత్యనారాయణపై బదిలీ వేటు వేసినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి.

గత నెలలో టెక్కలి నియోజకవర్గంలో విద్యుత్‌ శాఖాధికారులతో జిల్లా విద్యుత్‌ ఉన్నతాధికారుల సమక్షంలో మంత్రి అచ్చెన్న సమీక్ష చేయడమే మంత్రుల మధ్య మరింత వివాదానికి ఆజ్యం పోసిందని పలు ఉద్యోగ సంఘాల నేతలు చర్చించుకుంటున్నారు. ఈసమీక్షలో విద్యుత్‌ శాఖ చేయాల్సిన విధివిధానాలను అచ్చెన్న డిక్టేట్‌ చేయడంపై సంబంధిత శాఖ మంత్రి కళాకు ఆగ్రహం తెప్పించిందంటున్నారు. నిజానికి విద్యుత్‌ శాఖామంత్రి కళా నిర్ణయాన్ని కాదని, కేవలం అచ్చెన్న చెప్పిన పనులను చేయడం ఎస్‌ఈగా సత్యనారాయణకు పూర్తిగా అసాధ్యమే. అయినప్పటికీ కళాకు చెందిన ముఖ్య అనుచరుల ధ్వయం చేసిన ఓవర్‌ యాక్షన్‌తో మంత్రి కళా ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నట్లు తెలిసింది. ఇందుకోసం తన సహజశైలికి భిన్నంగా ఎస్‌ఈపై బదిలీకి సిఫారసు చేయించి నట్లు సమాచారం. అలాగే దీన్నే నెపంగా చూపుతూ అచ్చెన్నకు అనుకూలంగా ఉన్న అధికారులను జిల్లాలో వదిలిపెట్టేది లేదంటూ మంత్రి ‘కళా’ హెచ్చరికలు పంపినట్లుగా పలువురు భావిస్తున్నారు.

నిమ్మాడ...రాజాం మధ్యలో ఉద్యోగులు!
అటు నిమ్మాడ...ఇటు రాజాం...మధ్యలో ఉద్యోగులు..అన్నట్లుగా తయారయ్యింది జిల్లాలో ఉద్యోగుల పరిస్థితి. ఎవరికి కోపమొచ్చినా..ఏం జరుగుతుందో అనే ఆందోళన వీరిలో నెలకొంది. ఉద్యోగ నిబంధనల మేరకు రాష్ట్రంలో ప్రభుత్వం చెప్పినట్లు ప్రజాసేవ నిమిత్తం పనిచేయాల్సి ఉంటుంది. అయితే ఇందులో అధికార పార్టీ నేతలకు ప్రతిపక్షంలో ఉన్న నేతల కంటే అన్నింట్లోనూ అగ్రతాంబూలమే అని వేరే చెప్పనవసరం లేదు. అయితే ఇందుకోసం వివాదాలకు దూరంగా అధికారులు, ఉద్యోగులు అధికార పార్టీ నేతలకు సహజంగా అనుకూలంగా పనిచేస్తుంటారు. అయితే ఇక్కడ జిల్లాలో మాత్రం పరిస్థితి దారుణంగా, విచిత్రంగా తయారైంది. వివిధ ప్రాంతాల్లో పనులు, నిర్ణయాల విషయంలో ఇద్దరు మంత్రులకు అనుకూలంగా వెళ్లే పరిస్థితులు ఉద్యోగులకు లేవు. అలా అని ఒక మంత్రికి అనుకూలమైతే, రెండో మంత్రితో చర్యలు తప్పవనే సంకేతాలు ఇప్పటికే కొందరు అధికారులు రుచిచూశారు.

దీంతో అనుకూలతలో కూడా అప్రమత్తంగా ఉండేలా అధికారులు పావులు కదుపుతున్నారు. సుమారు ఓ ఏడాది పాటు కళ్లు మూసుకుంటే ఆ తర్వాత పరిస్థితులు మారవచ్చుననే సంకేతాలు ఉద్యోగ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. దీంతో తమ శాఖల్లో ఏ ప్రతిపాదనలు వచ్చినా జిల్లా కలెక్టర్‌ ధనంజయరెడ్డి కోర్టులో పడేసి కొందరు చేతులు దులుపుకుంటుంటే..మరికొందరు తమ ప్రాంతం ప్రతిపాదనలకు, పనులకు అనుకూలం కాదంటూ సర్టిఫై చేయించుకుంటూ కప్పదాటు ప్రయత్నాలకు తెరతీస్తున్నారు. ఏది ఏమైనా ఇద్దరి మంత్రుల మధ్య ఆధిపత్యపోరు ఇంకెంత మందిని బలితీసుకుంటుందో అని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

మరిన్ని వార్తలు