కాలువలోనే కడుక్కోవాలి!

9 Jan, 2018 10:22 IST|Sakshi

విద్యార్థుల ఆరోగ్యానికి భద్రత కరువు

పాఠశాలలో నీటి వసతి ఉన్నా మురుగు కాలువకు వెళ్లాల్సిన దుస్థితి

పట్టించుకోని ఉపాధ్యాయులు

గొట్టా గ్రామంలో వింత వైఖరి

హెచ్‌ఎం తీరుపై ఆర్‌వీఎం అధికారి ఆగ్రహం 

హిరమండలం: ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు, తాగునీరు కల్పించడంలో విఫలమవుతున్నారంటూ సుప్రీం కోర్టు పలుమార్లు మొట్టికాయలు వేస్తున్నా సర్కార్‌ తీరులో మార్పు రావడం లేదు. విద్యార్థులకు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నా స్పందించడం లేదు. ఇటీవల సర్కార్‌ బడుల్లో వరుసగా జరిగిన సంఘటనలే వీటిని తేటతెల్లం చేస్తున్నాయి. జి.సిగడాం కేజీబీవీలో కలుషిత ఆహారం తిని 20 మందికి పైగా విద్యార్థినులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటన జిల్లాలో విద్యావ్యవస్థపై ఆ శాఖ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు చేస్తున్న పర్యవేక్షణకు అద్దం పడుతుంది. చాలా వరకు ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు, తాగునీరు వంటి మౌలిక వసతులు లేవు. ఉన్నచోట వినియోగించడంలో ఉపాధ్యాయులు విఫలమవుతున్నారు.

 సర్కార్‌ విద్యకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు. హిరమండలం మండలంలోని గొట్టా గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రస్తుతం 110 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. పాఠశాలలో తాగునీటి సదుపాయం ఉన్నప్పటికీ కొందరు ఉపాధ్యాయుల తీరు వల్ల విద్యార్థులు పక్కనున్న మురుగు కాలువకు వెళుతున్నారు. రోజూ మధ్యాహ్న భోజనం అనంతరం విద్యార్థులు ప్లేట్లు పట్టుకొని పాఠశాల సమీపంలో ఉన్న ఎన్‌ఎమ్‌ రహదారి పక్కనున్న కాలువకు వెళుతున్నారు. కాలువలో దిగి ప్లేట్లు, చేతులు కడుక్కొని తిరిగి గెంతులేసుకుంటూ పాఠశాలకు వస్తున్నారు. రహదారి పక్కనున్న కాలువకు వెళుతుండడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో నని, కాలువలో నీటితో విద్యార్థులు చేతులు, ప్లేట్లు కడుక్కోవడంతో అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

 సోమవారం కూడా ఎప్పటిలాగే విద్యార్థులు పాఠశాలలో మధ్యాహ్న భోజనం అనంతరం ప్లేట్లును కాలువలో కడుగుతున్నారు. అయితే పక్క గ్రామంలో జరుగుతున్న జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతున్న ఆర్‌వీఎం అధికారి శ్రీనివాసరావు విద్యార్థులు పడుతున్న బాధను చూసి పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో మరుగుదొడ్లు, మురుగునీరు చెత్తతో కూడిన కుండీని చూసి, పరిసరాలు అధ్వానంగా ఉండటంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎన్‌.శ్రీనివాసరావు, విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులు మధ్యాహ్న భోజనం అనంతరం బయటకు వెళ్లడానికి గల కారణాలు అడిగితెలుసుకున్నారు.

ఇకపై విద్యార్థులు బయటకు వెళ్లకుండా రోజుకు ఒక ఉపాధ్యాయుడును పరిశీలనకు ఉంచాలన్నారు. ఇలా చెబుతున్న సమయంలో విద్యార్థుల తల్లిదండ్రులు అక్కడకు వచ్చి మాట్లాడుతూ పాఠశాలలో తాగునీటి వసతి ఉన్నా పిల్లలను ఇలా మురుగు కాలువకు పంపడం ఏమిటని  ప్రధానోపాధ్యాయులను పలుమార్లు ప్రశ్నించినా ఫలితం లేకపోయిందన్నారు. దీనిపై గ్రామస్తులకు, ప్రధానోపాధ్యాయుల మధ్య వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. దీంతో ఆర్‌వీఎం అధికారి కల్పించుకొని విద్యార్థుల తల్లిదండ్రులను, హెచ్‌ఎంను సముదాయించారు. పాఠశాలలో నీటి సౌకర్యం ఏర్పాటుచేసి విద్యార్థులకు భద్రత కల్పించాలన్నారు. ఇంకోసారి పిల్లలు బయటకు వెళ్లకుండా తాగునీటి వసతి కల్పించాలన్నారు. ఆయనతో పాటు సీఆర్‌పీ చంద్రరావు ఉన్నారు.

మరిన్ని వార్తలు