హంగ్ కోరుకుంటున్నారు

25 Nov, 2013 23:29 IST|Sakshi

కొల్హాపూర్: వచ్చే లోక్‌సభ ఎన్నికల తర్వాత హంగ్ రావాలని ఎన్సీపీ అధ్యక్షుడు,  శరద్‌పవార్ కోరు కుంటున్నారని బీజేపీ అగ్ర నాయకుడు గోపీనాథ్ ముండే ఆరోపించారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ఏ పార్టీకిగానీ లేదా ఏ కూటమికిగానీ స్పష్టమైన మెజారిటీ రాకూడదని పవార్ అభిలషిస్తున్నారని విమర్శించారు. యూపీఏకిగానీ లేదా ఎన్డీయేకిగానీ మెజారిటీ రాకూడదనేదే ఆయన అభిమతమన్నారు. ఆ విధంగా జరిగితే ప్రధానమంత్రి పదవిని తాను చేపట్టొచ్చనేదే ఆయన అసలు ఉద్దేశమన్నారు. విజేతగా నిలిచే కూటమికి ఎనిమిది లేదా తొమ్మిది స్థానాలు తక్కువ రావాలని పవార్ కోరుకుంటున్నారన్నారు. అయితే ఆయన కలలు ఎన్నటికీ సాకారం కావన్నారు. అంతేకాకుండా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలంటూ సొంత పార్టీకి చెందిన నాయకులపై ఆయనఒత్తిడి చేస్తున్నారన్నారు. తద్వారా తన బంధువైన అజిత్‌పవార్‌కు రాజకీయ ప్రత్యర్థులు లేకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారన్నారు. ఈ సమావేశంలో ఆర్‌పీఐ అధ్యక్షుడు రాందాస్ అథవాలే కూడా పాల్గొన్నారు.
 

>
మరిన్ని వార్తలు