సారూ.. గుక్కెడు నీళ్లివ్వండి

24 Dec, 2013 03:38 IST|Sakshi
సారూ.. గుక్కెడు నీళ్లివ్వండి

= గోడు వెళ్లబోసుకున్న జనం
 = తూతూ మంత్రంగా సాగిన కరవు బృందం పర్యటన

 
కోలారు, న్యూస్‌లైన్ :గంపెడాశలు పెట్టుకున్న జనాన్ని కరువు బృందం పర్యటన నిరాశ పరిచింది. కోలారు జిల్లాలోని ముళబాగిలు, బంగారుపేట, శ్రీనివాసపురం తాలూకాలను కరువు ప్రాంతాలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో సోమవారం కేంద్ర అధ్యయన బృందం ఈ ప్రాంతాల్లో పర్యటించింది. ఉదయం 9 గంటలకు కోలారు చేరుకున్న కేంద్ర బృందానికి జిల్లా కలెక్టర్ డీకే రవి తన కార్యాలయంలో కరువు పరిస్థితుల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

అనంతరం బంగారుపేటకు చేరుకున్న అధ్యయన బృందం పట్టణంలోని గంగమ్మన పాళ్య కాలనీకి వెళ్లి పరిశీలించారు. కాలనీ వాసులు ఖాళీ బిందెలతో స్వాగతం పలికారు. ఏడాది కాలంగా తమ వార్డులో నీరు లేదని. ట్యాంకర్ల కోసమే వేచి ఉండాల్సి వస్తోందని తెలిపారు. బంగారుపేట ఎమ్మెల్యే నారాయణస్వామి కేంద్ర బృందానికి నీటి ఎద్దడి గురించి వివరించారు.

తాలూకాలో సకాలంలో వానలు రాకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. అనంతరం తాలూకాలోని బడమాకన హళ్లి గ్రామంలో కూడా మహిళలు ఖాళీ బిందెలతోనే కేంద్ర బృందానికి స్వాగతం పలికారు. గ్రామంలో మూడేళ్లుగా నీరు సక్రమంగా రావడంలేదని, మూడు  వేల జనాభా ఉన్న గ్రామంలో తాగునీటి కోసం అష్టకష్టాలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రంతా బిందె నీటి కోసం వేచి ఉండాల్సి వస్తోందని వాపోయారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ ఉపాధ్యక్షురాలు మంజుల వారికి పరిస్థితిని వివరించారు. అనంతరం టి గొల్లహళ్లి చెరువును పరిశీలించారు. అక్కడి నుంచి ముళబాగిలు తాలూకాలోని నత్త, బల్ల, కాశీపుర గ్రామాలలో పర్యటించారు. తాలూకాలోని ఊరుకుంట మిట్టూరు వద్ద వాటర్ రీచార్జి ప్లాంటును పరిశీలించారు.
 
తాగునీటికే ప్రాధాన్యం  
 
కరువు పరిస్థితులను అధ్యయనం చేయడానికి వచ్చిన కేంద్ర బృందం రైతుల పంట నష్టం తదితర అంశాలపై కాకుండా తాగునీటి సమస్యపైనే దృష్టి కేంద్రీకరించింది. ఆయా గ్రామాలలో మహిళల నుంచి తాగునీటి సమస్య గురించి విన్నారే కాని పంట పొలాలను పరిశీలించలేదు. రైతులను ప్రశ్నించలేదు. వారి కష్టాలను అడిగి తెలుసుకోలేదు. కేంద్ర బృందం పరిశీలించాల్సిన జాబితాలో ఐపల్లి చెరువు ఉన్నా.. కేవలం కారులో నుంచే చెరువును పరిశీలిస్తూ ముందుకు సాగారు.
 
రూ.318 కోట్ల ప్రస్తావన
 
జిల్లాలో కరువు పరిస్థితులను ఎదుర్కోడానికి జిల్లా కలెక్టర్ రవి రూ. 318.86 కోట్ల ప్రతిపాదనలను కేంద్ర బృందం ముందు ఉంచారు. పశు పెంపకానికి రూ. 15 కోట్లు, తాగునీటి సమస్య పరిష్కారానికి రూ. 59.64 కోట్లు, పంటనష్టానికి రూ. 257.72 కోట్లు ఇవ్వాలని విన్నవించారు.
 
అయితే వచ్చే ఐదేళ్లలో తాగునీటి సమస్యను ఎదుర్కోవడానికి అయ్యే ఖర్చుకు మాత్రమే ప్రతిపాదనలు ఇవ్వాలని కేంద్ర బృందం కలెక్టర్‌కు సూచించింది.
 
కాగా, జిల్లాలోని కరువు పరిస్థితులపై ఈ నెల 26 న రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శితో కలిసి చర్చిస్తామని, అనంతరం జనవరి 10న కేంద్రానికి నివేదిక సమర్పిస్తామని కేంద్ర బృందం వెల్లడించింది.  
 

మరిన్ని వార్తలు