కేబినెట్‌కు కొత్తకళ

20 Jun, 2016 01:30 IST|Sakshi
కేబినెట్‌కు కొత్తకళ

యువతకు పెద్దపీట
రాజ్‌భవన్‌లో అట్టహాసంగా వేడుక
మంత్రులుగా 13 మంది ప్రమాణం స్వీకారం
ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్
9 మందికి క్యాబినెట్ హోదా

 

బెంగళూరు : రాష్ట్ర మంత్రి మండలి పునర్ వ్యవస్థీకరణలో భాగంగా ఆదివారం 13 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో తొమ్మిది మందికి క్యాబినెట్ ర్యాంకు హోదా కల్పించారు. చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న మంత్రి మండలి పునర్ వ్యవస్థీకరణకు అధిష్టానం శనివారం మధ్యాహ్నం గ్రీన్ సిగ్నల్ పడిన విషయం తెల్సిందే. దీంతో మంత్రి మండలిలోకి తీసుకునే వారికి ఢిల్లీ నుంచే సమాచారం అందించారు. సీఎం సిద్ధరామయ్య సూచన మేరకు ఆదివారం ఉదయమే బెంగళూరు చేరుకున్న వారంతా సాయంత్రం మూడున్నరలోపు తమ కుటంబ సభ్యులు, అనుచరులతో రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. అనంతరం సరిగ్గా నాలుగు గంటలకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, గవర్నర్ వ జుభాయ్‌రుడాభావ్‌వాలాలు రాజ్‌భవన్‌లోని గ్లాస్‌హౌస్ వేదిక పైకి చేరుకున్నారు. అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరవింద్  జాదవ్ గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలా అనుమతి పొంది మంత్రుల ప్రమాణ స్వీకారాన్ని లాంఛనంగా ప్రారంభించారు.


గవ ర్నర్ వజుభాయ్ రుడాభాయివాలా క్యాబినెట్ స్థాయి మంత్రి పదవులు దక్కించుకున్న తొమ్మిది మందిలో మొదట కాగోడు తిమ్మప్ప, రమేష్‌కుమార్, బసవరాజరాయరెడ్డి, తన్వీర్‌సేఠ్, హెచ్.వై మేటితో మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం ఎస్.ఎస్ మల్లికార్జున, శాసనమండలి సభ్యుడు ఎం.ఆర్ సీతారాం, సంతోష్‌లాడ్, రమేష్‌జారకిహోళిల మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. చివరిగా  ప్రియాంక్‌ఖర్గే, రుద్రప్పలమాణి, ప్రమోద్ మద్వరాజ్, ఈశ్వర్‌ఖండ్రేలు మంత్రులుగా దేవుడి పేరుమీద ప్రమాణ చేశారు. మొత్తం అరగంటలోపు ముగిసిన ఈ ప్రమాణస్వీకారానికి దాదాపు వెయ్యిమంది హాజరయ్యారు. రాజ్‌భవన్ బయట కూడా భారీ ఎల్‌ఈడీ స్క్రీన్‌ను ఏర్పాటు చేసి ప్రమాణ స్వీకారోత్సవాన్ని ప్రసారం చేశారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన  జ్వాలలు రగలడంతో రాష్ట్ర హోంశాఖ భారీ భద్రత ఏర్పాట్లు చేసింది. కాగా, నూతన మంత్రుల ప్రమాణస్వీకారం అనంతరం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన విధానసౌధలో మంత్రి మండలి సమావేశం జరిగింది. ఇందులో మంత్రి మండలిలో స్థానం పొం దిన 13 మందితో పాటు మిగిలిన మంత్రులు కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో కష్టపడి పనిచేసి పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని నూతనంగా అమాత్య పదవులు దక్కించుకున్నవారికి దిశా నిర్దేశం చేశారు. అంతేకాకుండా వచ్చేనెల 4 నుంచి ప్రారంభం కానున్న శాసనసభ సమావేశాల్లో నూతన మంత్రులకు సహకారం అందించాలని మిగిలిన మంత్రులకు సిద్ధరామయ్య సూచించారు.

 
యువతకు పెద్దపీట..

ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంత్రి మండలి పునర్ వ్యవస్థీకరణలో యువతకు పెద్దపీట వేశారు. నూతనంగా తమ మంత్రిమండలిలోకి తీసుకున్న 13 మందిలో ఆరుగురు నలభై నుంచి యాభై ఏళ్ల మధ్య ఉన్నవారే. వీరిలో అత్యంత పిన్నవయస్కుడు ఎమ్మెల్యే సంతోష్‌లాడ్ కాగా కురువృద్ధుడు కాగోడు తిమ్మప్పకు ప్రస్తుతం 82 ఏళ్లు. ఇదిలా ఉండగా నూతనంగా మంత్రి మండలిలోకి తీసుకున్న వారిలో ఐదుగురు గతంలో వివిధ మంత్రి పదవులు పొందగా మొదటిసారి మంత్రి పదవులు లభించిన వారు ఎనిమిది మంది. మొదటిసారి మంత్రి పదవులు దక్కించుకున్నవారిలో అత్యంత సీనియర్ కాంగ్రెస్ నాయకుడైన కే.ఆర్ రమేశ్‌కుమార్‌తో పాటు మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ప్రియాంక ఖర్గే, ప్రమోద్ మధ్వరాజ్‌లు కూడా ఉన్నారు.

 
14 మందిని తొలగించడానికి గవర్నర్ అనుమతి

మంత్రి మండలి పునర్ వ్యవస్థీకరణలో భాగంగా ప్రస్తుత మంత్రిమండలి నుంచి 14 మందిని తొలగించడానికి వీలుగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సూచించిన పేర్లకు గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలా ఆదివారం మధ్యాహ్నం పచ్చజండా ఊపారు. దీంతో శ్యామనూరు శివశంకరప్ప (ఉద్యానశాఖ), వీ.శ్రీనివాసప్రసాద్ (రెవెన్యూశాఖ), వినయ్‌కుమార్ సూరకే (పట్టణాభివృద్ధిశాఖ), సతీష్‌జారకి హోళి (లఘుపరిశ్రమలశాఖ), బాబురావ్‌చించనసూర్(జౌళిశాఖ),శివకుమార్‌తంగడి(చిన్ననీటిపారుదళశాఖ), ఎస్.ఆర్ పాటిల్ (ఐటీ,బీటీ శాఖ), మనోహర్ తాహశీల్దార్ (అబ్కారీశాఖ), అభయ్‌చంద్రజైన్ (యువజన,క్రీడలశాఖ), దినేష్ గుండూరావ్ (పౌరసరఫరాలశాఖ), ఖమరుల్ ఇస్లాం (మైనారిటీసంక్షేమ), కిమ్మెన రత్నాకర్ (ప్రాథమిక విద్యాశాఖ),పరమేశ్వర్‌న ాయక్ (కార్మికశాఖ), అంబరీష్ (గృహ నిర్మాణ శాఖ)లు మంత్రి మండలి నుంచి స్థానాలు కోల్పోయారు. ఇందులో అంబరీష్ పేరు చివరి క్షణంలో చేర్చినట్లు సమాచారం. 

 

ఈ జిల్లాలకు మంత్రి భాగ్య లేదు
మంత్రి మండలి పున ర్‌వ్యవస్థీకరణ తర్వాత ఎనిమిది జిల్లాలకు చెందిన శాసనసభ్యులకు మంత్రి మండలిలో స్థానం దక్కలేదు.  మంత్రి భాగ్యం దొరకని జిల్లాల జాబితాలో రాయచూరు, చిక్కబళ్లాపుర, చిక్కమగళూరు, కొడగు, బళ్లారి, బెంగళూరు      గ్రామాంతర, మండ్య, యాదగిరిలు చేరాయి.

 

మరిన్ని వార్తలు