పాత నోట్లు.. కోట్లు కోట్లు

4 Apr, 2017 02:57 IST|Sakshi
పాత నోట్లు.. కోట్లు కోట్లు

రూ.9.10 కోట్ల పాత సొమ్ము పట్టివేత
శాసనమండలి మాజీ అధ్యక్షుని అల్లుడే సూత్రధారి!
కొత్త నోట్ల మార్పిడికి ప్రయత్నం
సీసీబీ పోలీసుల మెరుపు దాడి


సాక్షి, బెంగళూరు: పాత నోట్లకు కొత్త నోట్లు... దందా ఇంకా ఆగడం లేదు. కర్ణాటకలో సగటున వారానికి ఒక చోట ఏదో ఒకచోట ఈ అక్రమం వెలుగుచూ  స్తూనే ఉంది. తాజాగా ఆదివారం బెంగళూరులో రూ.500, రూ.1,000 నోట్లతో కూడిన రూ.9.10 కోట్ల విలువైన నగదు పోలీసు దాడుల్లో పట్టుబడింది. 14 మంది నిందితులను అరెస్టు చేశారు. ఇందులో అధికార కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, శాసనమండలి మాజీ అధ్యక్షుడు వీరణ్ణమత్తికట్టి అల్లుడు ప్రవీణ్‌కుమార్‌ ప్రధాన

ముద్దాయి కావడం గమనార్హం. సీసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం వివరాలు పాత నోట్లు తీసుకుని సొమ్ము మొత్తంలో 45 శాతం కొత్త నోట్లను తిరిగి ఇచ్చే దందా నడుస్తోందని సమాచారం అందింది. నగరంలోని జాన్సన్‌ టౌన్‌ ఒకటో క్రాస్‌ వద్ద ఉన్న ఇంటిపై అదనపు పోలీస్‌ కమిషనర్‌ రవి నేతృత్వంలో ఇన్‌స్పెక్టర్లు మహదేవప్ప, సుధాకర్, ఎం.సీ రవికుమార్, బీ.రాజు ఆర్‌. బానుప్రసాద్‌లు దాడి చేసి రూ.9.10 కోట్ల పాత నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదును ఇక్కడ నగదు నిల్వచేయడానికి సహకరించిన ఎడ్విన్, ఉమేష్, అన్‌బళగన్, ఎస్‌.కిషోర్‌ కుమార్, ప్రభు, మోహన్, నారాయణభట్, చంద్రశేఖర్, శ్రీనివాస్, అరుణ్, మహ్మద్‌ ఇమ్రాన్,  హ్యారిష్, శేఖర్‌లను అరెస్టు చేశారు. అంతేకాకుండా నిందితుల నుంచి 2 కార్లు, 2 ద్విచక్రవాహనాలు, వివిధ కంపెనీలకు చెందిన 15 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

వదిలేయాలని హోంమంత్రిపై ఒత్తిళ్లు?
ప్రవీణ్‌కుమార్‌కు సంబంధించిన ఇంట్లోనే సొమ్ము దొరికినట్లు తెలుస్తోంది. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటన బయటికి రాకుండా వీరణ్ణ మత్తికట్టి అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. తాము ఏమీ చేయలేమని చెప్పడంతో ఆయన హోంశాఖ మంత్రి పరమేశ్వర్‌కు కూడా ఫోన్‌చేసి విషయం బయటికి రాకుండా చూడాలని కోరినట్లు తెలుస్తోంది. వ్యవహారం అప్పటికే తన చెయ్యి దాటిపోయిందని పరమేశ్వర్‌ స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా సీసీబీ పోలీసులకు పట్టుబడ్డ ప్రవీణ్‌కుమార్‌ తన అల్లుడేనని వీరణ్ణమత్తికట్టే పేర్కొన్నారు. అయితే ఆరునెలల నుంచి అతనితో తనకు గాని, తన కుటుంబ సభ్యులకు కాని ఎటువంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.

బీజేపీ ఎంపీ శోభా ధ్వజం
నోట్ల రద్దు తర్వాత రాష్ట్రంలో నడుస్తున్న బ్లాక్‌ అండ్‌ వైట్‌ దందాలో కాంగ్రెస్‌పార్టీ నాయకులే ఉన్నారని బీజేపీ నాయకురాలు శోభాకరంద్లాజే పేర్కొన్నారు. ఇందుకు తాజా ఉదంతమే ప్రత్యేక్ష ఉదాహరణ అని తెలిపారు. ఈ విషయంలో నిందితులను కఠినంగా శిక్షించాలని నంజనుగూడులో మీడియా ప్రతినిధులతో పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు