రెండు రోడ్డు ప్రమాదాల్లో 15 మంది మృతి

7 Dec, 2013 23:18 IST|Sakshi

సాక్షి, ముంబై: కొత్త వాహనం కొన్నామన్న ఆనందంతో షిర్డీ బయలుదేరిన సాయిభక్తులను కాలం కాటేసింది. తమ ఇష్టదైవాన్ని దర్శించుకోకముందే వీరి వాహనం నాసిక్ జిల్లా మన్మాడ్ తాలూకాలో శనివారం ఉదయం ఘోరరోడ్డు ప్రమాదానికి గురయింది. స్కార్పియో వాహనం, కంటెయినర్ ఎదురు ఎదురుగా ఢీకొనడంతో ఎనిమిది మంది సాయిభక్తులు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయలయ్యాయి. మృతుల్లో ఓ బాలుడితోపాటు నలుగురు మహిళలున్నారు.  దర్యాప్తు అధికారి, చన్‌వాడ్ ఎస్‌ఐ ముండే ‘సాక్షి’కి అందించిన వివరాల మేరకు... శనివారం ఉదయం 11.45 గంటల ప్రాంతంలో మాన్మాడ్-మాలేగావ్ మార్గంపై కుందగావ్ శివార్లలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఠాకూర్ కుటుంబీకులు కొత్తగా స్కార్పియో వాహనం కొన్నారు. ఈ సందర్భంగా ఆ కుటుంబానికి చెందిన 10 మంది షిర్డీకి బయల్దేరారు. నాసిక్ జిల్లా కుందల్‌వాడ్‌లో ఉదయం 11.45 గంటల ప్రాంతంలో స్కార్పియోను కంటెయినర్ వేగంగా ఢీకొట్టింది. దీంతో స్పార్పియో వాహనంలోని ఎనిమిది మంది విగత జీవులయ్యారు. మరోవైపు స్కార్పియో ముందుభాగం కంటెయినర్ కింద ఇరుక్కుపోయి నుజ్జునుజ్జయింది. ఘటనాస్థలం రక్తంమడుగుగా మారింది. చుట్టుపక్కల వారు వీరిని కాపాడేందుకు ప్రయత్నించారు. బాధితుల్లో ఇద్దరు ప్రాణాలతో ఉన్నట్టు తెలుసుకుని వారిని మన్మాడ్‌లోని ఆస్పత్రికి తరలించారని ముండే వివరించారు.  
 
 విషాదంగా మారిన విహారయాత్ర
 షోలాపూర్, న్యూస్‌లైన్‌ః విహారయాత్రకు బయలుదేరిన కొల్హాపూర్ సాంగవడేలోని ఉన్నత పాఠశాల విద్యార్థుల మినీబస్సు శనివారం రోడ్డు ప్రమాదానికి గురయింది. తుల్జాపూర్‌కు బయలుదేరిన ఈ బస్సును 15 కిలోమీటర్ల దూరంలో మాలంబ్రా గ్రామం సమీపంలో వోల్వో బస్సు ఢీకొట్టింది. షోలాపూర్-తుల్జాపూర్ రహదారిపై జరిగిన ఈ ఘోర ప్రమాదంలో ఏడుగురు మరణించగా మరో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. మరణించినవారిలో ఆరుగురు విద్యార్థులున్నారు. గాయలైనవారిలోనూ నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. వివరాలిలా ఉన్నాయి. సాంగవడేలోని ఉన్నత పాఠశాల విద్యార్థులతో ఓ మినీబస్సు విహారయాత్రకు బయలుదేరింది. ముందుగా తుల్జాపూర్‌లో దేవీమాతను దర్శించుకుని ముందుకు సాగించాలని భావించారు. అక్కడికి చేరుకోకముందే మాలంబ్రా గ్రామంలోని ఓ మలుపు వద్ద ఉదయం ఏడు గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది.
 
  ఎదురుగా వేగంగా వస్తున్న ఓ వోల్వో బస్సు బస్సును ఢీ కొట్టింది. దీంతో బస్సు నుజ్జునుజ్జయింది. విద్యార్థుల మృతదేహాలు కూడా గుర్తుపట్టలేని విధంగా మారాయి.  మృతులను బస్సు డ్రైవర్ ప్రతాప్ సుర్వేతోపాటు గణేష్ కుంబార్, ఆకాశ్ శిర్కే, సూరజ్ పాటిల్, పంకజ్ కుంబార్ , అక్షయ్ పాటిల్, వల్లభ్ కాంబ్లేగా  గుర్తించారు. విద్యార్థులంతా 16 సంవత్సరాలలోపు వారేనని తెలిసింది గాయపడిన వారిని షోలాపూర్‌లోని అశ్వనీ ఆస్పత్రికి తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు డాక్టర్లు పేర్కొన్నారు. కేసు దర్యాప్తులో ఉంది.
 
 పరామార్శించిన మంత్రులు...
 ఈ దారుణం గురించి తెలుసుకున్న విద్యార్థుల కుటుంబీకులు ఘటనాస్థలికి చేరుకొని బోరున విలపించారు. రాష్ట్ర మంత్రులు మధుకర్ చవాన్, దిలీప్ సోపల్ ఘటనాస్థలానికి చేరుకోవడంతోపాటు ఆస్పత్రిలో క్షతగాత్రులు, వారి కుటుంబీకులను పరామర్శించారు.
 

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు