జల్లికట్టు రగడ

18 Jan, 2017 01:57 IST|Sakshi

► రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ
► అలంగానల్లూరులో ఉద్రిక్తత
► రాత్రంతా కొనసాగిన నిరసన
►  కదం తొక్కిన యువత
► ‘పెటా’ నిషేధం లక్ష్యంగా ఒత్తిడి


సాక్షి, చెన్నై: జల్లికట్టు వ్యవహారం రాష్ట్రంలో కల్లోలం సృష్టిస్తున్నది. అలంగానల్లూరులో రాత్రంతా నిరసనలు హోరెత్తాయి. మంగళవారం ఉదయం నిరసన కారులపై ఖాకీల జులుం రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠకు దారి తీసింది. విద్యార్థి, యువత కదం తొక్కుతూ నిరసనల్ని హోరెత్తిస్తుండడంతో ఉద్రిక్తత నెలకొంది. జల్లికట్టుకు అనుమతి, పెటాపై రాష్ట్రంలో నిషేధం లక్ష్యంగా పాలకులపై ఒత్తిడి తెచ్చే పనిలో యువజనం కదిలింది. తమిళుల సంప్రదాయ, సాహసక్రీడ జల్లికట్టుకు మద్దతుగా రాష్ట్రంలో నిరసనలు సాగుతూ వస్తున్న విషయం తెలిసిందే. సంక్రాంతి పర్వదినం, కనుమ, కానుం పొంగల్‌ పర్వదినాల్లో   నిషేధాజ్ఞల్ని ఉల్లంఘించి అనేక చోట్ల జల్లికట్టుకు ప్రయత్నాలు సాగాయి.

ఒక ఎద్దును వదలగానే, ఆగమేఘాలపై పోలీసులు ప్రత్యక్షమై లాఠీలు ఝుళిపిస్తుండడంతో పాల మేడు రణరంగం కాగా, జల్లికట్టుకు ప్రపంచ ప్రసిద్ధి చెందిన అలంగానల్లూరులో తీవ్ర ఉత్కంఠ నెలకొంటూ వచ్చింది. సోమవారం నిషేధం ఉల్లంఘించేందుకు యత్నించిన వారిపై లాఠీలు జులిపించడంతో ఆ గ్రామస్తులు రాత్రంతా వాడి వాసల్‌ వద్దే నిరసనలో మునిగారు. వీరికి ఆహారం అందించేందుకు యత్నించిన వారిని సైతం పోలీసులు అరెస్టు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. ఆ పరిసరాల్లో విద్యుత్‌ సరఫరాను సైతం పోలీసులు తీసి వేశారు. అయినా, ప్రజలు ఏ మాత్రం వెనక్కు తగ్గలేదు. మదురై జిల్లా కలెక్టర్‌ వీర రాఘవులు, ఎస్పీ విజయేంద్ర పితారీ బుజ్జగించే యత్నం చేసినా ఫలితం శూన్యం.

జల్లికట్టు కల్లోలం : మంగళవారం ఉదయాన్నే ఎస్పీ విజయేంద్ర పితారి, డీఎస్పీ వనిత, తహసీల్దార్‌ వీరభద్రన్  నేతృత్వంలోని బలగాలు తమ దూకుడును ప్రదర్శించాయి. 21 గంటల పాటునిరవధిక నిరసనలో ఉన్న రెండు వందల మందిని బలవంతంగా వాడి వాసల్‌ వద్ద నుంచి ఈడ్చుకెళ్లడం రాష్ట్రంలో కల్లోలం సృష్టించింది. మదురై జిల్లాల్లోని అంగానల్లూరు, పాలమేడు గ్రామాల్లో అయితే, హై అలర్ట్‌ ప్రకటించారు. ఇక, చెన్నై మెరీనా తీరంలో ఉదయం తొమ్మిదిన్నర గంటల సమయంలో పదుల సంఖ్యలో నిరసనలో దిగిన యువతకు మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో వేలాది మంది తోడయ్యారు.

జల్లికట్టుకు అనుమతి, పెటాకు నిషేధం నినాదంతో విద్యార్థి, యువ సమూహం మెరీనా తీరంలో నిరసన కొనసాగిస్తుండడంతో ఉత్కంఠ తప్పలేదు. సినీ హాస్యనటుడు మైల్‌ స్వామి యువతకు తన మద్దతు ప్రకటించి నిరసనలో కూర్చుకున్నారు. ఇక, నటుడు శింబు తండ్రి , ఎల్‌డీఎంకే నేత టీ రాజేందర్‌ అక్కడికి రాగానే, కొందరు వాటర్‌ ప్యాకెట్లను విసరడంతో ఉద్రిక్తత నెలకొంది. రాత్రి ఏడు గంటలైనా ఆందోళన కొనసాగడంతో, నిరసన కారుల్ని బలవంతంగా అరెస్టు చేయడానికి పోలీసులు చర్యల్లో మునిగారు. నిరసన విరమించుకోని పక్షంలో అర్ధరాత్రైనా సరే అరెస్టు చేసి తీరుతామని పోలీసులు హెచ్చరించడం గమనార్హం. విద్యార్థుల ఆందోళనలు ఓ వైపు సాగుతుంటే, మరో వైపు తాను సైతం అంటూ నటుడు, సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్‌ సేలం ఆత్తూరులో నిరసన దీక్ష నిర్వహించారు.

ఇక, అలంగానల్లూరులో పోలీసుల జులుంపై ప్రధాన ప్రతిపక్ష నేత, డీఎంకే నిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసనలో ఉన్న వాళ్ల మీద తమ ప్రతాపం చూపించడాన్ని తీవ్రంగా ఖండించారు. పీఎంకే అధినేత రాందాసు, సీపీఐ నేత ముత్తరసన్  పోలీసుల చర్యలపై తీవ్రంగా మండిపడ్డారు.

మరిన్ని వార్తలు