వా‘నరమేధం’

17 Apr, 2017 08:23 IST|Sakshi
వా‘నరమేధం’

► పాండవపుర వద్ద 30 కోతుల హత్య

మండ్య: అమాయకత్వం, అల్లరి కలగలిపిన చేష్టలతో మనుషులకు ఆనందాన్ని పంచే కోతులపై మృగం లాంటి మనుషులెవరో మారణహోమానికి పాల్పడ్డారు. గుర్తు తెలియని దుండగులు వాటిని చంపి పడేసిన ఘటన ఆదివారం మండ్య జిల్లాలోని పాండవపుర తాలూకాలో జరిగింది. తాలూకాలోని పట్టణగిరి గ్రామ శివార్లలోనున్న కణవే బోరప్ప దేవాలయంలో ఆదివారం గ్రామస్థులు కొంతమంది పూజలు నిర్వహించడానికి వెళ్లగా, దేవాలయ పక్కనున్న ఖాళీ ప్రదేశంలో సుమారు 30 కోతులు విగతజీవులుగా పడి ఉండడాన్ని గమనించారు.

వెంటనే అటవీశాఖాధికారులకు సమాచారం అందించగా అక్కడికి చేరుకున్న అటవీశాఖాధికారులు కోతులను ఎవరు హత్య చేశారో, ఎందుకు చేశారో విచారణ చేస్తామంటూ అక్కడి నుంచి వెనుదిరిగినట్లు గ్రామస్థులు తెలిపారు. దీంతో కోతులను అలాగే వదిలివెళ్లడానికి మనసొప్పని గ్రామస్థులు గుడి ఎదురుగా గొయ్యిని తవ్వి శాస్త్రోక్తంగా కోతులకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. పంటల మీద, ఇళ్ల మీద దాడిచేస్తున్నాయని ఎవరైనా తిండిలో పురుగుల మందు పెట్టి చంపి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. బాధ్యులను గుర్తించి శిక్షించాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు