‘ఆపరేషన్ స్మైల్’ సక్సెస్

2 Feb, 2015 22:19 IST|Sakshi

326 మంది పిల్లలను రక్షించిన పోలీసులు
 ఘజియాబాద్: తప్పిపోయిన పిల్లలను తిరిగి తల్లిదండ్రుల ఒడికి చేర్చడానికి జిల్లా పోలీసులు చేపట్టిన ‘ఆపరేషన్ స్మైల్’ విజయవంతమైంది. ఇందులో భాగంగా రెండో దశలో జనవరి 31 నాటికి మరో 326 మందిని రక్షించారు. వారిలో 302 మంది పిల్లలను తల్లిదండ్రులకు చెంతకు చేర్చారు. గతేడాది నవంబర్‌లో ప్రారంభించిన ‘ఆపరేషన్ స్మెల్’ మొదటి దశలో 227 మంది పిల్లలను రక్షించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆపరేషన్ స్మైల్ నోడల్ అధికారి డిప్యూటీ ఎస్పీ విజయ్‌సింగ్ మాట్లాడుతూ రెండో దశలో రక్షించిన 326 మందిలో 302 మంది పిల్లలను తల్లిదండ్రులకు అప్పగించామన్నారు. మరో 21 మందికి సంబంధించి వారి తల్లిదండ్రులకు సమాచారం అందించామన్నారు.
 
 అయితే ముగ్గురి తల్లిదండ్రులను గుర్తించలేకపోయామని, వారి కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ ఆపరేషన్‌లో ప్రత్యేక శిక్షణ పొందిన 100 మందితో కూడిన పోలీసు బృందాలు పాల్గొన్నాయన్నారు. ఆగ్రా, ఢిల్లీ, జైపూర్, హరిద్వార్ నగరాల్లో తనిఖీలు చేపట్టి వీరిని రక్షించామన్నారు. వీరిలో ఎక్కువ మంది రెస్టారెంట్లలో పనిచేస్తూ, ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద బిచ్చమెత్తుతూ, చెత్త ఏరుకుంటూ రోడ్ల పక్కన జీవిస్తున్నారని చెప్పారు. పిల్లలు ఇళ్ల నుంచి ఎందుకు పారిపోయారనే అంశంపై క్షుణ్ణంగా పరిశోధిస్తున్నట్లు తెలిపారు. జిల్లా పోలీసులు చేపట్టిన రెండు దశలు కూడా విజయవంతం కావడంతో ఈ విధానాన్ని మిగిలిన రాష్ట్రాలు కూడా అవలంబించాలని హోం మంత్రిత్వ శాఖ కోరింది.
 

మరిన్ని వార్తలు