నలుగురు ఘరానా దొంగల అరెస్టు

2 May, 2014 23:39 IST|Sakshi
నలుగురు ఘరానా దొంగల అరెస్టు

- నిందితుల్లో ఇద్దరు పోలీసులు, ఓ రైల్వే కాంట్రాక్టర్
 న్యూఢిల్లీ: డెలివరీ బాయ్‌ను అపహరించి, అతనివద్ద నుంచి రూ. 50 లక్షల పార్సిల్‌తోపాటు మొబైల్ ఫోన్లను దోచుకున్న నలుగురిని ఢిల్లీ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. జాయింట్ కమిషనర్ రవీంద్ర యాదవ్ అందించిన వివరాల ప్రకారం... సెంట్రల్ ఢిల్లీకి చెందిన ఓ డెలివరీ బాయ్‌ను కిడ్నాప్ చేసి, అతనివద్దగల నగదు, మొబైల్ ఫోన్లను దోచుకొని, బాధితుడ్ని పూడ్చిపెట్టిన కేసులో రాజ్ బహదూర్ అలియాస్ రాజు(ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్), సురేందర్‌కుమార్ వర్మ(హర్యానా పోలీస్ కానిస్టేబుల్), సంజయ్ అలియాస్ ధరమ్‌వీర్, వాసుదేవ ప్రసాద్(రైల్వే కాంట్రాక్టర్లు) లను గురువారం పోలీసులు అరెస్టు చేశారు.
 
  వీరికి సహకరించిన మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. పట్టుబడ్డవారి నుంచి రూ. 12 లక్షల నగదు, రూ. 1.5 లక్షల విలువచేసే గృహోపకరణాలు, మొబైల్ ఫోన్లతోపాటు టొయోటా, వ్యాగన్ ఆర్ కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే పార్సిల్‌లో రూ. 50 లక్షలు ఉన్నాయని బాధితులు ఫిర్యాదు చేయగా పట్టుబడినవారు మాత్రం అందులో రూ. 43 లక్షలు మాత్రమే ఉన్నాయని పోలీసు విచారణలో వెల్లడించారు.

 

అంతపెద్దమొత్తంలో సొమ్ము రైల్వే పార్సిల్‌లోకి ఎలా వచ్చిందనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయమై రైల్వే అధికారులకు ఢిల్లీ పోలీసులు లేఖ రాయనున్నారు. ఇక వివరాల్లోకెళ్తే... అలహాబాద్ కార్గో క్యారియర్ కంపెనీలో పనిచేస్తున్న రిషి చంద్ ఏప్రిల్ 22న పోలీసులను సంప్రదించాడు. ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్ ట్రెయిన్ ద్వారా అలహాబాద్‌కు పంపేందుకు ఏప్రిల్ 13న తాను న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి ఓ పార్సిల్‌ను తీసుకున్నానని, ఆ పార్సిల్‌లోని కార్టన్‌లో మొబైల్ ఫోన్లతోపాటు రూ. 50 లక్షల నగదు ఉన్నాయని చెప్పాడు.
 
 సదరు పార్సిల్‌ను తీసుకొని రిక్షాలో పహాడ్‌గంజ్‌వైపు వెళ్తుండగా నలుగురైదుగురు వ్యక్తులు తనను అడ్డగించారని, అందులో ఇద్దరు పోలీసు డ్రెస్‌లో ఉన్నారని తెలిపాడు. ఆ తర్వాత వారు తనను బల వంతంగా ఓ నల్లని కారులో ఫరీదాబాద్‌కు తీసుకెళ్లారని, తన వద్ద ఉన్న పార్సిల్‌ను లాక్కొని తనను సూరజ్‌కుంద్ ప్రాంతంలో పూడ్చిపెట్టారని పోలీసులకు తెలిపాడు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ హెచ్చరించారన్నాడు. ముందు భయపడినా అక్కడి నుంచి ఎలాగోలా బయటపడిన చంద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురిని అరెస్టు చేశారు.

మరిన్ని వార్తలు