రెండు వారాల్లో 42 మంది రైతుల బలవన్మరణం

21 Jan, 2015 23:14 IST|Sakshi

సాక్షి, ముంబై: వరుసగా మూడేళ్ల నుంచి కరువు బారిన పడి విలవిలలాడుతున్న మరాఠ్వాడా రైతులకు కొత్త ప్రభుత్వం ఎటువంటి ఆసరా ఇవ్వలేకపోతోంది. దీంతో పంటల కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం లేక గత రెండు వారాల్లో ఏకంగా 42 మంది రైతులు ఈ ప్రాంతంలో బలవన్మరణానికి పాల్పడ్డారు. వీరిలో అత్యధికంగా బీడ్ జిల్లాలో 14 మంది రైతులు, ఆ తరువాత నాందేడ్ జిల్లాలో 12 మంది రైతులు తమ జీవితాలను అర్థాంతరంగా ముగించుకున్నారు.

మరాఠ్వాడ ప్రాంతంలో గత మూడు సంవత్సరాల నుంచి వరుసగా కరువు తాండవిస్తోంది. ప్రకృతి తమపై కరుణ చూపకపోవడంతో అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అప్పుడప్పుడు కురుస్తున్న అకాల వర్షాలు చేతికి వచ్చిన పంటను నాశనం చేస్తున్నాయి. దీంతో రైతులు బేజారెత్తుతున్నారు. వేసిన పంటలు చేతికి రాకపోగా చేసిన అప్పులు తడిసి మోపెడవుతున్నాయి.

గత సంవత్సరం 511 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వీరిలో ప్రభుత్వ సహాయం పొందేందుకు కేవలం 274 మంది రైతులను మాత్రమే అర్హులుగా గుర్తించారు. 155 మంది రైతుల కుటుంబాలను అనర్హులుగా పరిగణించడంతో వారు ఎలాంటి సాయానికి నోచుకోలేకుండా పోయారు. మిగిలిన కుటుంబాలపై విచారణ జరుగుతోంది.

ఈ సంవత్సరం మొదటి రెండు వారాల్లోనే 42 మంది ఆత్మహత్యలు చేసుకోవడం రైతుల కుటుంబాలు మరింత కలవరానికి గురైతున్నాయి. ఉదయం పొలానికి వెళ్లిన కుటుంబం పెద్ద దిక్కు తిరిగి సాయంత్రం ఇంటికి వస్తాడా..? అనే నమ్మకం లేకుండాపోయింది. ఎప్పుడు ఏ అఘాయిత్యానికి పాల్పడతారో తెలియని పరిస్థితి రైతు కుటుంబాల్లో నెలకొంది.
జిల్లాల వారిగా ఆత్మహత్య చేసుకున్న రైతుల వివరాలు
బీడ్-14, నాందేడ్-12, ఉస్మానాబాద్-4, ఔరంగాబాద్-3, లాతూర్-3, జాల్నా-3, హింగోలి-3.

మరిన్ని వార్తలు