నెట్‌వర్క్ బలోపేతానికి రూ. 488 కోట్లు

12 Feb, 2015 23:04 IST|Sakshi

గుర్గావ్: విద్యుత్ డిస్కం దక్షిణ హరియాణా విద్యుత్ పంపిణీ సంస్థ (డీహెచ్‌బీవీఎన్) తన నెట్‌వర్క్‌ను బలోపేతం చేసుకోవడానికి రూ. 488 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ విషయాన్ని సంబంధిత అధికారులు ఆదివారం వెల్లడించారు. ఇందులోభాగంగా ఎండాకాలంలో వచ్చే విద్యుత్ సంక్షోభాన్ని నివారించడానికి సుమారు 5,000 ట్రాన్స్‌ఫార్మర్లను మరమ్మతు చేయనుంది. ‘గుర్గావ్‌లో 1,980 కిలోమీటర్ల మేర హై టెన్షన్ లైన్లు, 2,460 కిలోమీటర్లు లో టెన్షన్ లైన్లు ఉన్నాయి. వీటన్నిటినీ కొనసాగించి, పాత కేబుల్స్ స్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తాం. నగరంలో 6,6 కిలోమీటర్లు 33 కేవీ లైన్లు ఉన్నాయి. వీటి సామర్థ్యాన్ని పరీక్షించి, అవసరమైనచోట కొత్తవాటిని విస్తరిస్తాం’ అని డిస్కం జనరల్ మేనేజర్ సంజీవ్ చోప్రా చెప్పారు. అంతేకాకుండా దాదాపు 4,973 పాత ట్రాన్స్‌ఫార్మర్లను పరీక్షించి, ట్రాన్స్‌మిషన్ నెట్‌వర్క్‌ను బలోపేతానికి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ‘మా ట్రాన్స్‌ఫార్మర్లు విద్యుత్ డిమాండ్ అధికంగా ఉన్నప్పుడు, తక్కువగా ఉన్నప్పుడు సమర్థంగా పనిచేస్తున్నాయి. ప్రస్తుత ఈ అవకాశాన్ని వినియోగించుకొని విద్యుత్ పరికరాలను పరీక్షించుకుంటాం. ఈ ప్రక్రియ అంతా ఈ ఏడాది ఏప్రిల్‌లోగా నిర్వహిస్తాం’ అని చోప్రా వివరించారు.
 

మరిన్ని వార్తలు