రాష్ట్రంలో ఓటర్లు 5.62 కోట్లు

6 Jan, 2015 02:45 IST|Sakshi
రాష్ట్రంలో ఓటర్లు 5.62 కోట్లు

చెన్నై, సాక్షి ప్రతినిధి:రాష్ట్ర ఎన్నికల కమిషనర్, చెన్నై ఎన్నికల అధికారి సోమవారం వేర్వేరుగా ఓటర్ల తుదిజాబితాను విడుదల చేశారు.  ఆ జాబితాల ప్రకారం రాష్ట్రంలో 5.62 కోట్ల మంది, చెన్నై నగరంలో 38 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. సుమారు ఏడాది కాలం గా కొత్త ఓటర్ల నమోదు పనులు సాగుతున్నాయి. గత ఏడాది అక్టోబరు 15 నుంచి నవంబరు 15 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక శిబిరాలు నిర్వహించారు. 56,947 మంది పురుషులు, 56,061 మంది మహిళలు, 68 మంది ఇతర ఓటర్లు మొత్తం 1.13 లక్షల మంది ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 1,30,394 దరఖాస్తులు ఆమోదం పొందాయి. 18 ఏళ్లు పూర్తి చేసుకున్న 25,407 మందికి ఓటు హక్కు కల్పించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సందీప్ సక్సేనా రాష్ట్ర జాబితాను సచివాలయంలో విడుదల చేశారు.
 
 అలాగే చెన్నై కార్పొరేషన్ కమిషనర్, ఎన్నికల అధికారి విక్రమ్ కపూర్ చెన్నై కార్పొరేషన్ పరిధిలోని ఓటర్ల జాబితాను రిప్పన్ బిల్డింగ్‌లో ఆవిష్కరించారు. 2014 జనవరి 1 నాటికి రాష్ట్రంలో 5.45 కోట్ల ఓటర్లుండగా, ఈ ఏడాది జాబితా 5.62 కోట్లకు పెరిగింది. రాష్ట్రం మొత్తం మీద 16 లక్షలు, చెన్నైలో 58 వేల మంది కొత్త ఓటర్లుగా నమోదయ్యూరు. రాష్ట్రం మొత్తం మీద 2,87,598 మంది, చెన్నైలో 15,736 మంది దొంగ ఓటర్లను గుర్తించి ఓటు హక్కును రద్దుచేశారు. కొత్తగా ఓటర్లు చేరదలుచుకుంటే సోమవారం నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని, ఈనెల 25న జాతీయ ఓటర్ల దినంగా పరిగణిస్తున్నామని ఎన్నికల అధికారులు తెలిపారు. కొత్త ఓటర్ల దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైనట్లు చెప్పారు.  
 

మరిన్ని వార్తలు