రాష్ట్రంలో 5.79 కోట్ల ఓటర్లు

21 Jan, 2016 03:20 IST|Sakshi

 తమిళనాడు చట్టసభ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల కమిషన్ బుధవారం విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 5.79 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లుగా ఈ  జాబితాలో పేర్కొన్నారు.
 
 చెన్నై, సాక్షి ప్రతినిధి:  తమిళనాడు చట్టసభ గడువు మే 22వ తేదీతో ముగియనుంది. గడువు ముగిసిపోక ముందే చట్టసభకు ఎన్నికలను నిర్వహించి కొత్త ప్రభుత్వాన్ని కూర్చొబెట్టాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పై ఉంది. మార్చి మొదటి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. తేదీ నిర్ణయం కోసం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) బృందం ఢిల్లీ నుంచి త్వరలో చెన్నై చేరుకోనుంది. అన్నిపార్టీల నేతలతో సీఈసీ సమావేశమై అభిప్రాయాలను సేకరించనుంది. ఎన్నికల  ఏర్పాట్లను ముమ్మరం చేయడంలో భాగంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాజేష్ లఖానీ జిల్లా కలెక్టర్లు, పోలీస్ ఉన్నతాధికారులతో తరచూ సమావేశం అవుతున్నారు. ఈ సమావేశాలు ఈనెలాఖరు వరకు సాగుతాయి. ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా ఓటర్ల జాబితాను ఈసీ విడుదల చేసింది.    
 
    ఈనెల 1వ తేదీ నాటికి 18 ఏళ్లు పూర్తయిన వారు ఓటరు గుర్తింపుకార్డు కోసం తమ పేర్లను నమోదుచేసుకోవచ్చని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఇంతవరకు నమోదు చేసుకోనివారు,పేర్ల తొలగింపు, చిరునామా తదితర మార్పులకు గత ఏడాది అక్టోబరు వరకు అవకాశం ఇచ్చారు. ఈ లెక్కన రాష్ట్రవ్యాప్తంగా 21 లక్షల మంది కొత్తగా పేర్లను నమోదుకు, తొలగింపుకు దరఖాస్తు చేసుకున్నారు. కొత్త ఓటర్లతో కూడిన జాబితాను జనవరి 5వ తేదీన ప్రకటిస్తామని గతంలో ఈసీ ప్రకటించింది.
 
 అయితే చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, కడలూరు జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా ఓటర్ల జాబితా విడుదల వాయిదా పడింది. జనవరి 20వ తేదీన ప్రకటిస్తామని ఎన్నికల కమిషనర్ రాజేష్ లఖానీ ప్రకటించిన మేరకు బుధవారం ఓటర్ల జాబితా విడుదల చేశారు. తమిళనాడులో 5 కోట్ల, 79 లక్షల, 72 వేల, 690 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇందులో పురుష ఓటర్లు 2 కోట్ల 88 లక్షలా 60వేలా 889 మంది, స్త్రీ ఓటర్లు 2 కోట్ల 91లక్షలా 7వేలా 418 మంది ఉన్నారు. హిజ్రాలు 4,383 మంది ఉన్నట్టు గుర్తించారు. 12.33 లక్షల మంది ఓటర్ల జాబితాలో కొత్తగా చేరారు. కొత్త ఓటర్లకు ఫోటో గుర్తింపుకార్డులు ముద్రణ దశలో ఉన్నాయి. పోలింగ్ బూత్‌ల ద్వారా వచ్చేనెల 10వ తేదీన అందజేస్తారు.
 
 చెన్నైలో 39 లక్షల ఓటర్లు:         ఇదిలా ఉండగా, చెన్నైలో 39 లక్షలా 47వేలా 16 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 19 లక్షలా 62 వేలా 414 మంది పురుష ఓటర్లు, 19 లక్షలా 83వేలా 766 మంది స్త్రీ ఓటర్లు, 836 మంది హిజ్రా ఓటర్లు ఉన్నట్లుగా ప్రకటించారు. అలాగే కాంచీపురంలో 35 లక్షలా 80వేలా 967 మంది, తిరువళ్లూరులో 31 లక్షలా 60వేలా 562 మంది ఓటర్లు ఉన్నారు.
 
 షోళింగనల్లూరులో అత్యధిక ఓటర్లు: తమిళనాడులోని అన్ని నియోజకవర్గాల్లోకి కాంచీపురం జిల్లా షోళింగనల్లూరు నియోజకవర్గం అత్యధిక ఓటర్లతో రికార్డు సృష్టించింది. ఈ నియోజకవర్గంలో మొత్తం 5 లక్షలా 75వేలా 773 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 2 లక్షలా 91వేల 909 మంది, స్త్రీ ఓటర్లు 2 లక్షలా 83 వేలా 819 మంది, హిజ్రాలు 45 మంది ఉన్నారు. అలాగే 18-19 మధ్య వయస్సులోని యువ ఓటర్లు సైతం ఇదే నియోజకవర్గంలో అధికంగా ఉన్నారు. షోళింగనల్లూరు నియోజకవర్గంలో మొత్తం యువ ఓటర్లు 12,797 కాగా, వీరిలో పురుషులు 7294, స్త్రీ ఓటర్లు 5583 ఉన్నారు.
 
  అతి తక్కువ ఓటర్లున్న నియోజకవర్గంగా నాగపట్టినం జిల్లాలోని కీళ్ వేలూరును గుర్తింపు పొందింది. ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు  ఒక లక్షా 63వేలా 189 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 81వేల 38 మంది, స్త్రీ ఓటర్లు 82 వేల 151 మంది ఉన్నారు.ప్రత్యేక శిబిరాలు:  ఓటర్ల సౌలభ్యం కోసం ప్రత్యేక శిబిరాలను నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది. కొత్తగా పేర్ల నమోదు, తొలగింపు వంటి సేవల కోసం అన్ని మండల కార్యాలయాల్లో దరఖాస్తులు లభ్యం అవుతాయని ఈసీ రాజేష్ లఖానీ తెలిపారు. అలాగే  ఈనెల 30వ తేదీ, వచ్చేనెల 6వ తేదీల్లో ప్రత్యేక ఓటర్ల శిబిరాలను నిర్వహిస్తున్నామని అన్నారు.
 

మరిన్ని వార్తలు