రక్తమోడిన రోడ్లు

22 Nov, 2013 06:51 IST|Sakshi

నాసిక్: రాష్ర్టంలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 54 మంది గాయపడ్డారు. నాసిక్‌లోని చంద్వాడ్ తాలూకా సమీపంలో ముంబై-అగ్రా జాతీయ రహదారిపై ట్యాంకర్‌ను బుధవారం రాత్రి బస్సు ఢీకొంది. ఈ ఘటనలో 46 మంది హోంగార్డులు గాయపడ్డారు. వచ్చే వారం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్‌లో విధులు నిర్వహించేందుకు వీరంతా ఓ ప్రైవేట్ బస్సులో వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను చంద్వాడ్‌లోని గ్రామీణ ఆస్పత్రిలో చేర్పించామని వివరించారు. అలాగే పుణేలో మద్యం సేవించిన ఓ వ్యక్తి నడిపిన కారు అదుపుతప్పింది. రద్దీగా ఉండే జంగ్లీ మహారాజ్ రోడ్డు పక్కనున్న దుకాణాలు, పలు వాహనాలపైకి దూసుకెళ్లింది.
 
 ఈ ఘటనలో ఎనిమిది మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. పార్క్ చేసిన ఆటోలు, జ్యూస్ స్టాల్‌పైకి కారును తీసుకెళ్లిన మహేశ్ సర్దేశాయ్ సిటీ ట్రాన్స్‌పోర్టు బస్సు టెర్మినస్ సమీపంలోని ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడని చెప్పారు. ఈ అలజడితో ఒక్కసారిగా స్థానికులు రోడ్ల వెంట పరుగులు తీశారన్నారు. కొందరు మహేశ్‌ను పట్టుకొని చితకబాది తమకు అప్పగించారని తెలిపారు. బ్రెత్ అనలైజర్ టెస్టు ద్వారా మహేశ్ మద్యం సేవించాడని నిర్ధారణ అయ్యిందన్నారు. కాగా, 2012లో ఆర్టీసీ డ్రైవర్ సంతోష్ మానే నిర్లక్ష్య డ్రైవింగ్‌తో  స్వర్‌గేట్‌లో తొమ్మిది మరణించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు