ఆర్టీసీకి ‘చవితి’ ఆదాయం రూ. 6.5 కోట్లు

19 Sep, 2013 23:17 IST|Sakshi


 సాక్షి, ముంబై: నష్టాల్లో నడుస్తున్న మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎమ్మెమ్మార్టీసీ)పై వినాయకుడు చల్లని చూపు చూసినట్లు తెలుస్తోంది. గణేశ్ ఉత్సవాల సందర్భంగా అదనంగా నడిపిన బస్సుల వల్ల ఆర్టీసీకి ఏకంగా రూ.ఆరున్నర కోట్ల ఆదాయం వచ్చింది. గత ఏడాదితో పోలిస్తే ఇది రెట్టింపు అని ఆర్టీసీ వర్గాలు తెలిపాయి.
 
 ఏటా గణేశ్ ఉత్సవాల సమయంలో ముంబై, ఠాణే నుంచి లక్షలాది మంది కొంకణ్ వాసులు తమ స్వగ్రామాలకు తరలివెళతారు. పెరిగిన రద్దీని దష్టిలో ఉంచుకుని దాదాపు 12 రోజులపాటు కొంకణ్ రైల్వే విభాగం 60 ప్రత్యేక రైళ్లు నడపగా, ఆర్టీసీ అదనంగా రెండు వేల బస్సులు నడిపింది. అయినప్పటికీ ఇవి ఎటూ చాలలేదు. దీంతో ఠాణే, ముంబైలో ఉంటున్న కొంకణ్ వాసులు స్వగ్రామాలకు వెళ్లాలంటే ఉత్సవాల సమయంలో ప్రైవేటు బస్సులు, సుమోలు, కార్లు తదితర వాహనాలను ఆశ్రయించక తప్పలేదు.
 
 ప్రయాణికుల అవసరాల బట్టి ప్రై వేటు వాహన యజమానులు అడ్డగోలుగా చార్జీలు వసూలు చేయడంతో కొందరు నిలబడైనా సరే ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించడం మంచిదనుకున్నారు. దీంతో ఆర్టీసీ ఖజానాలోకి రూ.ఆరున్నర కోట్ల ఆదాయం వచ్చి చేరింది. ముంబై, ఠాణే నుంచి బయలుదేరిన బస్సుల ద్వారా రూ.నాలుగు కోట్లు, తిరుగు ప్రయాణంలో రూ. రెండున్నర కోట్లు వచ్చాయని ఆర్టీసీ రీజినల్ మేనేజరు రాహుల్ తోరో చెప్పారు.
 

మరిన్ని వార్తలు