ఆర్కేనగర్‌ రేసులో 62 మంది

28 Mar, 2017 03:12 IST|Sakshi
ఆర్కేనగర్‌ రేసులో 62 మంది

ఈవీఎంలతో ఓటింగ్‌
పది కంపెనీల పారా మిలటరీ
ఆర్కేనగర్‌లో  ప్రచార హోరు
పన్నీరు, దీప శ్రీకారం


ఆర్కేనగర్‌ ఉప ఎన్నికల బరిలో 62 మంది అభ్యర్థులు నిలిచారు. బహుముఖ సమరంగా సాగుతున్న ఈ ఎన్నికల్లో ఓటింగ్‌కు ఈవీఎంలను ఉపయోగించేందుకు ఎన్నికల యంత్రాంగం చర్యలు చేపట్టింది. భద్రత నిమిత్తం పది కంపెనీల పారా మిలటరీ రంగంలోకి దిగనుంది. ఓట్ల వేటలో అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తోన్నారు. మాజీ సీఎం పన్నీరు సెల్వం, జయలలిత మేన కోడలు దీప ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు.

 చెన్నై: జయలలిత మరణంతో ఖాళీగా ఉన్న ఆర్కేనగర్‌ నియోజకవర్గానికి ఏప్రిల్‌ 12న ఉప ఎన్నిక జరగనుంది. అన్నాదీఎంకేలో ఏర్పడ్డ చీలికల పుణ్యమా ఈ సారి ఆ పార్టీ గుర్తు రెండాకుల్ని ఎన్నికల యంత్రాంగం సీజ్‌ చేయక తప్పలేదు. అన్నాడీఎంకే గుర్తు లేని ఎన్నికలుగా సాగుతున్న సమరంలో గెలుపు కోసం తీవ్ర కుస్తీలు పట్టాల్సిన పరిస్థితి. ఎన్నికల బరిలో నిలబడేందుకు 127 మంది నామినేషన్లు దాఖలు చేయడంతో ఓటింగ్‌ బ్యాలెట్‌ ద్వారా జరపక తప్పదన్న ప్రశ్న బయల్దేరింది. అయితే,  పరిశీలన, ఉప సంహరణ పర్వాలతో సోమవారం నాటికి  చివరకు రేసులో 62 మంది నిలిచారు.

రేసులో ఉన్న అభ్యర్థులు తుది జాబితాను ఎన్నికల యంత్రాంగం ప్రకటించడంతో ప్రచారం మరింతగా ఊపందుకుంది.రేసులో 62 మంది:డీఎంకే అభ్యర్థిగా మరుదు గణేషన్, అన్నాడీఎంకే అమ్మ అభ్యర్థిగా టీటీవీ దినకరన్, అన్నాడీఎంకే పురట్చితలైవి అమ్మ అభ్యర్థిగా మధుసూదనన్, స్వతంత్ర అభ్యర్థిగా జయలలిత మేన కోడలు దీప, సీపీఎం అభ్యర్థిగా లోకనాథన్, బీజేపీ అభ్యర్థిగా గంగై అమరన్, డీఎండిడీకే అభ్యర్థిగా మదివానన్, నామ్‌ తమిళర్‌ కట్చి అభ్యర్థిగా కలైకోట్‌ ఉదయంలతో పాటుగా స్వతంత్ర అభ్యర్థులు బరిలో దిగారు. డీఎంకే అభ్యర్థి ఓట్లు చీల్చే దిశగా గణేష్‌ పేరు వచ్చే రీతిలో పలువురు నామినేషన్లు దాఖలు చేసినట్టు సమాచారం. తుది జాబితా ప్రకటనతో ఓటింగ్‌కు ఈవీఎంలను ఉపయోగించేందుకు ఎన్నికల యంత్రాంగం కసరత్తు చేపట్టింది. 63 మందికి పైగా అభ్యర్థులు రేసులో ఉంటే బ్యాలెట్‌ నిర్వహించాల్సి ఉంటుందని తొలుత నిర్ణయించారు.

అయితే, సంఖ్య ప్రస్తుతం 62కు పరిమితం కావడం, నోటా చిహ్నం ఒకటిని కలుపుకుంటూ, ఒక్కో పోలింగ్‌ బూత్‌కు నాలుగు ఈవీఎంలను ఉపయోగించేందుకు తగ్గ చర్యల్లో అధికార వర్గాలు ఉన్నాయి. నియోజకవర్గంలో నగదు బట్వాడా అడ్డుకట్ట, మద్యం తదితర తాయిలాల పంపిణీని అడ్డుకునే విధంగా తనిఖీల ముమ్మరం అయ్యాయి. పది కంపెనీలకు చెందిన పారా మిలటరీ బలగాలు ఒకటి రెండు రోజుల్లో చెన్నైకు రానున్నాయి. తనకు వయసు లేదన్న కారణంతో నామినేషన్‌ తిరస్కరించినట్టు ఎన్నికల యంత్రాంగంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ యువతి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన వయసు 23 సంవత్సరాలు అని, అయితే, తనకు 25 సంవత్సరాలు రాలేదన్న ఒక్క కారణంతో నామినేషన్‌ తిరస్కరించారని స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగేందుకు సిద్ధమైన ఆర్కేనగర్‌కు చెందిన సౌమ్య పిటిషన్‌లో వివరించారు. ఓటు హక్కు వయసు 18 సంవత్సరాలుగా నిర్ణయించినప్పుడు, అదే ఎన్నికల్లో నిలబడేందుకు వయస్సు 25గా నిర్ణయించడం ఏమిటోనని ప్రశ్నించారు. 18 సంవత్సరాలు నిండిన తమకు అన్ని హక్కులు ఉన్నప్పుడు, ఎన్నికల్లో మాత్రం నిలబడే హక్కు ఎందు లేదని సౌమ్య ప్రశ్నించడం గమనార్హం.

ప్రచారంలో నేతలు: మధుసూదనన్‌కు మద్దతుగా మాజీ సీఎం పన్నీరు సెల్వం ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఓపెన్‌ టాప్‌ వాహనంలో ఆయన సుడిగాలి పర్యటనతో ఓటర్లను ఆకర్షించే యత్నం చేశారు. టీటీవీ దినకరన్‌ సైతం ప్రచారంలో ఉరకలు తీశారు. సీఎం ఎడపాడి పళనిస్వామి, మంత్రులతో కలిసి ఏకంగా ఆర్కేనగర్‌కు ఓ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. తనకు మద్దతుగా ఓట్లు వేసి గెలిపించాలని కోరుతూ జయలలిత మేనకోడలు దీప ప్రచారానికి శ్రీకారం చుట్టారు.

తమ అభ్యర్థికి మద్దతుగా డీఎండీకే అధినేత విజయకాంత్‌ ప్రచారం రద్దు కాగా, ఆయన స్థానంలో ప్రేమలత విజయకాంత్‌ ఓటర్ల వద్దకు బయల్దేరారు. బీజేపీ అభ్యర్థి గంగై అమరన్‌కు మద్దతుగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్‌ ప్రచారం నిర్వహించారు. డీఎంకే అభ్యర్థి మరుదు గణేషన్‌ ప్రచారంలో దూసుకెళ్తుండగా, ఆయనకు మద్దతుగా మంగళవారం ఆ పార్టీ నిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, టీఎన్‌సీసీ అధ్యక్షుడు తిరునావుక్కరసర్‌ ప్రచారం చేపట్టనున్నారు.

దీపకు పడవ: ఎంజీయార్, అమ్మ, దీప పేరవై అభ్యర్థి, జయలలిత మేన కోడలు దీపకు ఎన్నికల యంత్రాంగం పడవ చిహ్నంగా కేటాయించింది. ఆర్కేనగర్‌ రేసులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న దీప ప్రచార పయనానికి శ్రీకారం చుట్టారు. ఆమెకు పడవ చిహ్నం రావడంతో అందుకు తగ్గ ప్లకార్డులను చేత బట్టి మద్దతుదారులు ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు.

మరిన్ని వార్తలు