కొండంత కోదండరాముడు

2 Feb, 2019 12:00 IST|Sakshi
విగ్రహం తరలిస్తున్న వాహనం వద్ద భక్తజనం

64 అడుగుల ఎత్తైన విగ్రహం

తిరువణ్ణామలై నుంచి బెంగళూరు విజిపురకు తరలింపు  

హారతులు పట్టిన భక్తులు   

కర్ణాటక, హొసూరు: బెంగళూరు సమీపంలోని విజిపురంలో ప్రతిష్టించేందుకు 64 అడుగుల ఎత్తైన ఏకశిలా విశ్వరూప కోదండరామస్వామి విగ్రహాన్ని భారీ వాహనంలో తరలిస్తుండగా, దారిపొడుగునా భక్తులు హారతులెత్తుతున్నారు. విజిపురంలో ప్రతిష్టించే ఈ విగ్రహానికి తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా వందవాసి సమీపంలోని కెరకోటకొండపై భారీ ఏకశిలను విగ్రహంగా తొలచి తరలిస్తున్నారు. గత డిసెంబర్‌ 7వ తేదీ ఏకశిలా విగ్రహాన్ని 240 టైర్లుగల కార్గో ట్రైలర్‌పై ఉంచి తీసుకొస్తున్నారు. 64 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పు, 300 టన్నుల బరువున్న ఏకశిలను చాలా నెమ్మదిగా తరలిస్తున్నారు. ప్రమాదం వల్ల విగ్రహం ఏమాత్రం దెబ్బతిన్నా ప్రతిష్టించడానికి ఇక పనికిరాదు.  విగ్రహంపై ఎండ వర్షం వంటివి పడకుండా పూర్తిగా టార్పాలిన్‌తో కప్పి ఉంచడం వల్ల దర్శనభాగ్యం దొరకడం లేదు. 

తరలింపులో ఎన్నో ఇబ్బందులు   
తిరువణ్ణామలై రోడ్లపై ఇంత బరువు గల ట్రక్కులను తీసుకురావడం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రాఫిక్‌ సమస్య, ఇరుకైన రోడ్లు, టైర్లు పేలిపోవడం వంటి సంఘటనలతో కోదండరాముడు నెమ్మదిగా జిల్లా కేంద్రం క్రిష్ణగిరికి చేరుకొన్నాడు. ఏకశిలలో ఒదిగిన కోదండరామస్వామిని చూసేందుకు దారిపొడుగునా భక్తులు, మహిళలు బారులుతీరి హారతులు పడుతున్నారు. పూలు చల్లుతూ పూజలు నిర్వహించారు. నెలరోజులుగా ఇంజనీర్ల సాయంతో ఏకశిలా విగ్రహాన్ని విజీపురానికి తరలిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం లోపు సూళగిరికి చేరుకోనున్నట్లు తెలిపారు. 

మరిన్ని వార్తలు