ఘనతంత్ర సంబరాలు

27 Jan, 2017 03:46 IST|Sakshi

► ‘పన్నీరు’ పతాకావిష్కరణ 
►వేడుకల్లో స్టాలిన్, డీఎంకే ఎమ్మెల్యేలు


గణతంత్ర సంబరాలు రాష్ట్రంలో మిన్నంటాయి. చెన్నై మెరీనా తీరంలో జరిగిన వేడుకల్లో ప్రప్రథమంగా  సీఎం పన్నీరు సెల్వం జాతీయ జెండాను ఎగురవేశారు. ఇందులో ప్రధాన ప్రతిపక్ష నేత, డీఎంకే నిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొనడం విశేషం.

సాక్షి, చెన్నై: 68వ గణతంత్ర దినోత్సవాలు చెన్నై మెరీనా తీరంలోని గాంధీ విగ్రహం వద్ద గురువారం ఉదయం ఘనంగా జరిగాయి. గాంధీ విగ్రహం పరిసరాలను వివిధ వర్ణాల పుష్పాలతో అధికార యంత్రాంగం సుందరంగా తీర్చిదిద్దింది. రాష్ట్రానికి శాశ్వత గవర్నర్‌ లేని దృష్ట్యా, ప్రప్రథమంగా సీఎం పన్నీరుసెల్వం గణతంత్ర వేడుకల్లో జాతీయ జెండాను ఎగుర వేయడానికి ఉదయం ఏడున్నర గంటల సమయంలో మెరీనా తీరానికి వచ్చారు. మోటార్‌ సైకిళ్లు ముందుకు దూసుకురాగా, పన్నీరు కాన్వాయ్‌ మెరీనా తీరం వైపుగా సాగుతూ అక్కడక్కడ ఆశీనులైన జనానికి సీఎం అభివాదం చేశారు. గాంధీ విగ్రహం వద్దకు చేరుకున్న సీఎంను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్, సలహాదారు షీలాబాలకృష్ణన్  ఆహ్వానించారు. అనంతరం త్రివిధ దళాల అధిపతుల్ని పరిచయం చేశారు. సరిగ్గా ఎనిమిది గంటల సమయంలో   జాతీయ పతాకాన్ని పన్నీరుసెల్వం ఎగురవేయగా,  భారత కోస్ట్‌గార్డ్‌ హెలికాప్టర్‌ ఆకాశం నుంచి పుష్ప జల్లులు కురిపించింది. జాతీయ పతాకానికి మెరీనా తీరంలో గుమికూడిన ప్రతి ఒక్కరూ గౌరవ వందనం సమర్పించారు. తదుపరి త్రివిధ దళాల కవాతు, సీఆర్‌పీఎఫ్, సీఐఎస్‌ఎఫ్‌ , మహిళా కమాండో బలగాలు విన్యాసాలు, అశ్వదళాల మార్చ్‌ ఫాస్ట్‌ సాగాయి.

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు:  తమిళనాడు చరిత్ర ను, సంప్రదాయాన్ని, గ్రామీణ కళల్ని, దేశ ఔన్నత్యాన్ని, వివిధ రాష్ట్రాల సంస్కృతుల్ని  చాటి చెప్పే రీతిలో విద్యార్థినునులు ప్రదర్శించిన నతృత్య రూపకం ఆకట్టుకుంది. ప్రత్యేకంగా ఆయా రాష్ట్రాలకు చెందిన  సంప్రదాయ నృత్యరూపకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.  అలాగే, ప్రభుత్వ ప్రగతిని చాటే రీతిలో ఆయా విభాగాల శకటాల ప్రదర్శన ప్రతి ఒక్కర్నీ ఆలోచింప చేశాయి. అమ్మ జయలలిత పథకాలను, సేవల్ని గుర్తు చేస్తూ, శకటాల ప్రదర్శన సాగాయి.

పతకాలతో సత్కారం: గణతంత్ర దినోత్సవ వేడుకల్లో సాహస వీరులకు పతకాలను ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం ప్రదానం చేశారు. ప్రమాదాలు సంభవించినప్పుడు వీరోచితంగా శ్రమించిన వారికి  ఇచ్చే అన్నా పతకాన్ని వేలూరు జిల్లా పేర్నంబట్టుకు చెందిన దుర్గాదేవికి అందజేశారు. కోట్టై అమీర్‌ మత సామరస్య అవార్డును వేలూరుకు చెందిన డాక్టర్‌ విక్రంకు ప్రదానం చేశారు.  సారాను, నకిలీ మద్యాన్ని అరికట్టడంలో విశేష కృషిచేసిన ఎక్సైజ్‌ ఏఎస్పీ తంగమలై(నాగపట్నం), సెంట్రల్‌క్రైం ఏఎస్పీ జీవానందం, అడయార్‌ ఎక్సైజ్‌ ఇన్ స్పెక్టర్‌ వేలు, నాగపట్నం సెంట్రల్‌ సబ్‌ ఇన్ స్పెక్టర్‌ రమేష్‌కుమార్, ధర్మపురి తోప్పురు ప్రత్యేక సబ్‌ ఇన్ స్పెక్టర్‌ మాధప్పన్ లకు గాంధీ అడిగలార్‌ బిరుదు, రూ. 20 వేలు చొప్పున చెక్కుల్ని అందజేశారు.వరి సాగులో ఆధునిక పోకడలకు సంబంధించిన వ్యవసాయ శాఖ ప్రత్యేక అవార్డు, రూ.ఐదు లక్ష నగదు చెక్కును తిరునల్వేలి జిల్లా పులియంగుడికి చెందిన శంకరనారాయణకు అందజేశారు.

స్టాలిన్  హాజరు : ఈ ఏడాది గణతంత్ర వేడుకల్లో ప్రప్రథమంగా సీఎం పన్నీరు సెల్వం పతాకాన్ని ఆవిష్కరించగా, ఈ వేడుకకు ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్  సైతం హాజరు కావడం ఆహ్వానించ దగ్గ విషయం. ఇన్నాళ్లు ప్రతి పక్ష సభ్యులు ప్రభుత్వ వేడుకలకు దూరం అన్న విషయం తెలిసిందే. తాజా, వేడుకకు డీఎంకే ఎమ్మెల్యేలు దురైమురుగన్, సుబ్రమణియన్, శేఖర్‌బాబు, రంగనాథన్, మాధవరం సుదర్శనం, సెల్వం, కేపీపీస్వామి గాంధీ విగ్రహం వద్దకు చేరుకున్నారు. వీరిని ఆహ్వానించిన అధికారులు స్టాలిన్ కు మాత్రం మంత్రుల వరుసలో సీటు కేటాయించారు. ఎమ్మెల్యేలకు వీపీఐల వరుసలో సీట్లను కేటాయించారు. ఇక, గతంతో పోల్చితే ఈ సారి వేడుకలకు జనం దూరంగా ఉండడం గమనార్హం. మెరీనా పరిసరాల్లోని జాలర్ల కుటుంబాలు పెద్ద ఎత్తున వేడుకలకు తరలి రావడం జరిగేది.

అయితే, జల్లికట్టు నిరసనల సమయంలో జాలర్ల మీద పోలీసులు తీవ్ర ప్రతాపాన్ని చూపించారు. దీంతో జాలర్లు వేడుకకు దూరంగా ఉన్నారని చెప్పవచ్చు. ఇక, మునుపెన్నడూ లేని విధంగా పోలీసు యంత్రాంగం భద్రతను కట్టుదిట్టం చేయడంతో జనంలో స్పందన కరువైంది. పలువురు నల్ల టీ షర్టులు, చొక్కాలతో సాధారణంగా వేడుక నిమిత్తం వచ్చినా, వారిని పోలీసులు అ డ్డుకోవడం గమనార్హం. ఇక, ఇన్ చార్జ్‌ గవర్నర్‌ విద్యాసాగర్‌రావు మహారాష్ట్రలో జరిగిన వేడుకకు పరిమితం కావడంతో చెన్నై రాజ్‌ భవన్ లో జరగాల్సిన తేనీటి విందు రద్దు అయింది. ఇక, రాష్ట్ర ప్రజలకు రేడియో ద్వారా తన సందేశాన్ని విద్యాసాగర్‌ రావు వినిపించారు. మెరీనా తీరంలో వేడుకల అనంతరం వార్‌ మెమోరియల్‌ స్మారక స్థూపం వద్ద సిఎం పన్నీరు సెల్వం నివాళులు అర్పించారు. ఆయనకు ఆర్మీ అధికారులు ఆహ్వానం పలికారు.

మరిన్ని వార్తలు