ఊపందుకున్న ‘ గోసీఖుర్ద్ ’ పనులు

29 Apr, 2014 22:57 IST|Sakshi

నాగపూర్: విదర్భ ప్రాంతంలో  సుమారు 2.5 లక్షల హెక్టార్ల పంటభూములకు సాగునీటి సరఫరా లక్ష్యంగా ప్రారంభించిన గోసీఖుర్ద్ నీటిపారుదల ప్రాజెక్టు పనులు ఇప్పటికి ఊపందుకున్నాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణానికిగాను నాగపూర్ జిల్లా నుంచి 51 గ్రామాలు, విదర్భకు చెందిన 13 గ్రామాల ప్రజలను తరలించాల్సి వచ్చింది. బాలాఘాట్(ఎంపీ) నుంచి ప్రాణహితా నది(గడ్చిరోలీ) వరకు ప్రవహించే వైన్‌గంగా నదిపై ఈ ప్రాజెక్టును నిర్మించేందుకు 1983లో ప్రతిపాదనలు వచ్చాయి. చివరకు 1988 ఏప్రిల్ 22న అప్పటి చిమూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని భండారాలో ఉన్న గోసీఖుర్ద్ గ్రామంలో అప్పటి భారత ప్రధాని రాజీవ్‌గాంధీ దీనికి శంకుస్థాపన చేశారు.

 దీనిద్వారా విదర్భ ప్రాంతంలోని నాగపూర్, భండారా, చంద్రపూర్ జిల్లాల్లో సుమారు 2,50,800 హెక్టార్ల భూములకు సాగునీరందించేందుకు నిర్ణయించారు. అయితే ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ద్వారా కేవలం 36,894 హెక్టార్లకే నీరందించగలుగుతున్నారు. 26 యేళ్లపాటు నత్తనడకన సాగిన పనులు ప్రస్తుతం ఊపందుకున్నాయి. వచ్చే వర్షాకాలానికల్లా ప్రాజెక్టును పూర్తిచేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ నిర్మాణం వల్ల నష్టపోయేవారి సంక్షేమం కోసం ఏడాది కిందట ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ రూ.1,199 కోట్ల ప్యాకేజీని ప్రకటించారు. ఈ మేరకు గత ఏడాది మేలో రూ.684.18 కోట్లు విడుదల చేశారు. అందులో రూ. 324.92 కోట్లను నాగపూర్, భాంద్రా జిల్లాల్లో బాధిత కుటుంబాలకు చెందిన బ్యాంక్ అకౌంట్లలో జమ అయ్యాయి. ఇదిలా ఉండగా, ఇప్పటికే నాగపూర్ జిల్లా లో 51 గ్రామాలు, భాంద్రా జిల్లాలో 13 గ్రామాలకు చెందిన ముంపు గ్రామాల ప్రజలను ఇతర ప్రాంతాలకు తరలించారు.

 కాగా, జీవన్‌పూర్, సిర్సి, ఖర్దా,పంజ్రేపార్ గ్రామాలకు చెందిన అనేక కుటుంబాలను కొత్త ప్రాంతాలకు తరలించామని డివిజనల్ కమిషనర్ అనూప్‌కుమార్ తెలిపారు. గతవారం ఆయన ప్రాజెక్టు కింది ముంపు గ్రామాల పునరావాస కేంద్రాల ప్యాకేజీపై సమీక్ష నిర్వహించారు. ఇదిలా ఉండగా, మొదటి విడతలో, భాంద్రా జిల్లాలోని ఐదు గ్రామాల్లోని మూడు గ్రామాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఆయా గ్రామాల్లో ఉన్న 14,948 గ్రామీణ కుటుంబాల్లో 5,715 కుటుంబాలకు సురక్షితమైన ఆవాసాలను ఏర్పాటుచేసినట్లు నాగపూర్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్(పునరావాసం) రాజ్‌లక్ష్మి షా తెలిపారు. భండారా జిల్లా మీదుగా ప్రవహించే వైన్‌గంగా నదిపై నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు పూర్తయితే నాగపూర్, భండారా, చంద్రపూర్ జిల్లాల రైతులకు సాగునీటి సమస్య తీరినట్లే..

మరిన్ని వార్తలు