నగర మహిళపై పెరిగిన నేరాల సంఖ్య

2 Jan, 2015 22:16 IST|Sakshi

న్యూఢిల్లీ: నగర మహిళలపై జరుగుతున్న నేరాల సంఖ్య ఏయేటికాయేడు పెరుగుతోంది. పోలీసులందించిన వివరాల ప్రకారం 2013తో పోలిస్తే 2014లో 31.6 శాతం మేర పెరిగాయి. 2013లో 12,410 కేసులు నమోదు కాగా 2014, డిసెంబర్ 15నాటికి ఈ సంఖ్య 14,687కి చేరుకుంది. 2013లో నమోదైన అత్యాచారాల సంఖ్య 1,571 కాగా మరుసటి సంవత్సరం అది 2,069కి చేరుకుంది. అత్యాచార కేసు నిందితుల్లో 420 మంది బాధితురాలి ఇరుగుపొరుగువారే. మరో 920 మంది స్నేహితులు, 283 మంది బంధువులు, 66 మంది సహోద్యోగులు ఉన్నారు. కొత్త వాళ్లు 84 మంది మాత్రమే. 586 అత్యాచార కేసులకు సంబంధించి నిందితులందరికీ బాధిత మహిళలతో సంబంధాలు ఉన్నాయి. ఇదిలాఉంచితే 2013లో 879 లైంగిక వేధింపు కేసులు నమోదు కాగా 2014కు వచ్చేసరికి ఆ సంఖ్య 1,282కు చేరుకుంది. ఇక వరకట్న వేధింపు కేసులు 2013లో 137 కాగా మరుసటి సంవత్సరం ఇది 147కు చేరుకుంది.
 
పెట్రోలింగ్ వాహనాలను రంగంలోకి దించాం
నగరంలో మహిళలపై నేరాల సంఖ్య నానాటికీ పెరిగిపోతున్న నేపథ్యంలో కమిషనర్  భీంసేన్ బస్సిని మీడియా ప్రశ్నించగా ‘859 పెట్రోలింగ్ వాహనాలను రంగంలోకి దించాం. విధులు ముగించుకుని రాత్రిపూట ఆలస్యంగా ఇంటికి చేరుకునే మహిళల కోసం పెట్రోలింగ్ విధులను నిర్వర్తించే సిబ్బందికి తగు సూచనలు, సలహాలు ఇచ్చాం. ద్విచక్ర వాహనాలపై గస్తీని పెంచడంతోపాటు అత్యవసర స్పందన బృందాన్ని కూడా రంగంలోకి దించాం. ఉదయం, సాయంత్రం సమయాల్లో బాలికల పాఠశాలలు, కళాశాలల వద్ద పోలీసు సిబ్బందిని మోహరిస్తున్నాం. దీంతోపాటు నగర మహిళల్లో ఆసక్తిఉన్నవారికి ఆత్మరక్షణ విద్యల్లో శిక్షణ ఇప్పిస్తున్నాం. గత ఏడాది మొత్తం 15,583 మందికి ఈ తరహా శిక్షణ ఇచ్చాం’అని అన్నారు.

మరిన్ని వార్తలు