సీసాల్లో పెట్రోల్ అమ్మకాలపై నిషేధం

8 Dec, 2013 23:37 IST|Sakshi

 సాక్షి, ముంబై: ఎంతటి అత్యవసర సమయాల్లోనైనా సీసాల్లో పెట్రోల్, డీజిల్ విక్రయించకూడదని నగర పోలీసుశాఖ పెట్రోల్ బంకుల యజమానులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలని అన్ని పోలీసు స్టేషన్లకు సూచిం చారు. దీనిపై నగరవాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక నుంచి మార్గమధ్యలో ఎక్కడైనా వాహనంలో ఇంధనం అయిపోతే వాహనాలను పెట్రోల్‌బంకు వరకు తోసుకుంటూ వెళ్లాల్సిందే.
 
 కారు, లారీల వంటి వాహనాలను బంకు వరకు తోసుకురావడం అసాధ్యమనే సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో పోలీసుల వాదన వేరేలా ఉంది. పెట్రోల్, డీజిల్‌ను బాటిళ్లలో విక్రయించడం వల్ల అవి పెద్ద ఎత్తున దుర్వినియోగం అవుతున్నాయని చెబుతున్నారు. నిజానికి వాహనాలు బంకులకు వస్తేనే ఇంధనం నింపాలని, సీసాలు, క్యాన్లలో పోయకూడదనే నియమం ఎప్పటి నుంచో ఉంది. అయితే దీనిని సక్రమంగా అమలు చేయకపోవడంవల్ల ఈ నియమం గురించి ప్రజలకు అంతగా తెలి యదు. ఇదివరకు అనేకసార్లు రాజకీయ, మత ఘర్షణల్లో సంఘవిద్రోహులు పెట్రోల్ బాటిళ్లతో హింస కు దిగినట్టు తేలింది.
 
 కొన్ని నెలల కిందట కూడా ఆజాద్‌మైదాన్‌లో మైనారిటీలు నిర్వహించిన సభ హింసకు దారితీసిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా సీఎస్టీ వద్ద పోలీసు, ప్రైవేటు వాహనాలకు నిప్పు పెట్టడానికి ఆందోళనకారులు పెట్రోల్ బాటిళ్లను ముందుగానే సిద్ధంగా ఉంచుకున్నట్లు దర్యాప్తులో తేలింది. కొందరు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యలు చేసుకోవడం, మరికొన్ని ఘటనల్లో అత్తింటివాళ్లు కోడలిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఉదంతాలు కూడా పెరుగుతున్నాయని సీనియర్ అధికారి ఒకరు అన్నారు. ఇందుకు ప్రధాన కారణం ఇంధనాన్ని బంకుల నుంచి సీసాలు, క్యాన్లలో తీసుకురావడమే. అయితే ముంబై పోలీసు కమిషనరేట్ తీసుకున్న ఈ నిర్ణయంపై పెట్రోల్‌బంకుల యజమానులు, వాహన చోదకులు, స్థిరాస్తుల రంగంలోని బిల్డర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
 
 కొందరు చిల్లర దొంగలు అర్ధరాత్రి రోడ్డుపై పార్క్ చేసిన కార్లు, ద్విచక్ర వాహనాల నుంచి ఇంధనం తీసుకొని ఉడాయిస్తున్నారు. ఉదయం విధులకు వెళ్లే హడావిడిలో వాహనం స్టార్ట్ కాకపోతే పరిస్థితి ఏంటని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. ‘మార్గమధ్యలో వాహనం ఆగిపోతే సమీపంలో ఎక్కడా బంకు ఉండదు. వాహనాన్ని ఎంత దూరం వరకు తోసుకెళ్లాలి...? భవన నిర్మాణ పనులు చేపడుతున్న చోట భారీ క్రేన్లు, ప్రొక్లెయినర్లు, డ్రిల్లింగ్ యంత్రాలను పెట్రోల్ బంకు వరకు తీసుకువెళ్లడం సాధ్యమయ్యే పని కాదు. ఇలా అనేక సందర్భాలలో సీసాలు, క్యాన్లలో ఇంధనం తీసుకెళ్లడం తప్ప మరో ప్రత్యామ్నాయ మార్గం లేదు’ అని కుర్లావాసి ఒకరు అన్నారు. సీసాలు, క్యానతో వాళ్లు తమ గుర్తింపుకార్డు లేదా ఇతర రుజువులు చూపించాక ఇంధనం పోసే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలించాలని ముంబైకర్లు విజ్ఞప్తి చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు