శుభకార్యాలు చేస్తున్నారా... బహుపరాక్!

17 Dec, 2014 21:55 IST|Sakshi
శుభకార్యాలు చేస్తున్నారా... బహుపరాక్!

చిన్నారుల పంపి బంగారు ఆభరణాలను మాయం చేస్తున్న ముఠా
సాక్షి, ముంబై: ఫంక్షన్ హాళ్లలో పెళ్లిళ్లు, నిశ్చితార్థాలు, ఇతర శుభకార్యాలు చేస్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. సందెట్లో సడేమీయా అన్నట్లు రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన ముఠా సభ్యులు శుభకార్యాలు జరుగుతున్న ఫంక్షన్ హాళ్లలోకి చొరబడి పథకం ప్రకారం చేతికందిన విలువైన వస్తువులు చోరీ చేస్తున్నారు. ఇలాంటి పనులకు చిన్నపిల్లలను వాడుకుంటుండడంతో ఎవరికీ అనుమానం కలగడం లేదు.

పెళ్లి హడావుడిలో ఇరువర్గాల వారు నిమగ్నమై ఉన్న సమయంలో బంధువులు సమర్పించిన కానుకలు, వధూవరుల బంగారు ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులను మాయం చేస్తున్నారు. ఇందుకోసం సదరు పిల్లలకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో అప్రమత్తంగా ఉండాలని, అనుమానితులు, గుర్తు తెలియని వ్యక్తులపై కన్నేసి ఉంచాలని వధూవరుల తరఫు బంధువులకు స్థానిక పోలీసులు సూచిస్తున్నారు.

గత పెళ్లిళ్ల సీజన్‌లో ఫంక్షన్ హాళ్ల నుంచి విలువైన వస్తువులు చోరీకి గురైనట్లు అనేక ఫిర్యాదులందాయి. దీంతో నేర నిరోధక శాఖ సిబ్బంది రంగంలోకి దిగారు. చోరీ ఘటనలు జరిగినచోట అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలను పరిశీలించారు. అందులో ఖరీదైన దుస్తులు ధరించిన కొందరు పిల్లలు అటే ఇటూపరుగులు తీయడం కనిపించింది.

ఇందులో ఓ పిల్లాడి కదలికలు అనుమానాస్పదంగా తోచాయి. పిల్లలతో కలిసిపోయి వేదికపైకి ఎక్కి ఏకంగా వధూవరులతో ఫొటోలు దిగాడు. అతడిపై ఎవరికి అనుమానం రాలేదు. ఆ తర్వాత అదను చూసుకుని బంధువులు సమర్పించిన కానుకల ప్యాకెట్లు తీసుకుని మెల్లిగా జారుకుంటున్న దృశ్యాలు కూడా సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి.

ఇదే తరహాలో రెండు, మూడు ఫంక్షన్ హాళ్లవద్ద పలువురు పిల్లలు చోరీ చేసినట్లు వీడియో దృశ్యాల్లో కనిపించింది. దీంతో పోలీసులు వేటలో పడ్డారు. ఇటీవల జరిగిన ఓ పెళ్లికి పోలీసులు మారువేషాల్లో హాజరయ్యారు. అక్కడ ఓ బాలుడి ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించింది. అతనిపై నిఘా వేయగా ఎప్పటిలాగే విలువైన వస్తువులు చోరీ చేసేందుకు యత్నించాడు.

రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు అతనిని ఆరా తీశారు. తన తల్లి ఫంక్షన్ హాలు బయట ప్రవేశద్వారం వద్ద బెలూన్‌లు విక్రయిస్తోందని చెప్పాడు. దీంతో వెంటనే అతని తల్లిని కూడా పట్టుకున్నారు. తరువాత పోలీసులు తమదైన శైలిలో విచారించగా నిజం బయటపడింది. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ నుంచి ఇక్కడికి వచ్చి, నేరాలకు పాల్పడుతున్నట్టు వారు అంగీకరించారు.

మరిన్ని వార్తలు