విశ్వాసమంటే ఇదేనేమో!

27 Jan, 2017 16:00 IST|Sakshi
విశ్వాసమంటే ఇదేనేమో!
నర్సంపేట: విశ్వాసం చూపడంలో శునకానికి ఉన్న ప్రత్యేకత మరే జంతువుకు లేదు. అన్నం పెట్టిన యజమాని కోసం ఏ పనైనా చేయగలదు. ఇందుకు నిదర్శనమే వరంగల్‌ జిల్లా నర్సంపేటలో జరిగిన సంఘటన.. తనను పెంచుకున్న యజమాని కూతురికి గాయమైతే.. ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళ్లి, అక్కడున్న సిబ్బందికి విషయం చెప్పడానికి ప్రయత్నించింది. నర్సంపేటలోని పోశమ్మ వీధికి చెందిన ప్రసాద్‌ అనే వ్యక్తి గత కొన్నేళ్లుగా కుక్కను పెంచుకుంటున్నాడు. గురువారం ప్రసాద్‌ కుమార్తె అక్షిత (రేణుక) ఇంటి ముందు సైకిల్‌పై నుంచి పడిపోవడంతో పెదవికి తీవ్ర గాయమైంది. దీంతో అక్కడే ఉన్న శునకం పరుగు పరుగున సమీపంలో ఉండే ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళ్లింది.
 
ఆస్పత్రిలోకి వెళ్లి అటు ఇటు తిరగడం.. సిబ్బందికి సమాచారాన్ని చేరవేసే ప్రయత్నం చేసింది. ఇదంతా గమనించిన ఆస్పత్రి సిబ్బంది, ప్రజలు శునకం ప్రయత్నం అర్థంకాక చూస్తుండి పోయారు. అప్పుడే శునకం యజమాని ప్రసాద్‌ కూతురును తీసుకుని ఆస్పత్రికి వచ్చేసరికి అసలు విషయాన్ని అర్థం చేసుకున్నారు. చిన్నారికి గాయమైన విషయాన్ని చెప్పడానికి ఆస్పత్రికి వచ్చిన శనకాన్ని చూసి అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. చిన్నారిని ఆస్పత్రికి తీసుకువచ్చిన సమయంలో శునకం కంటతడి పెట్టుకోవడం అందరినీ విస్మయానికి గురిచేసింది. 
మరిన్ని వార్తలు