లోకల్ రైళ్లలో పైలట్ ప్రాజెక్టుగా సీసీ కెమెరాలు

1 Mar, 2015 01:36 IST|Sakshi

ఫలితాలను బట్టిసబర్బన్ రైళ్లలోనూ ఏర్పాటు
బోగీకి ఆరు కెమెరాలు...?    

 
ముంబై: మహిళల రక్షణ కోసం సబర్బన్, దూరప్రాంత రైళ్లలో సీసీ టీవీలను ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ప్రకటించడంతో పైలట్ ప్రాజెక్టుగా లోకల్ రైళ్లలో సీసీ టీవీలు ఏర్పాటు చేయనున్నారు. లోకల్‌రైళ్లలో సీసీ టీవీలను పైలట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేసి, వాటి ఫలితాల ఆధారంగా అన్ని సబర్బన్ రైళ్లలో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యంగా ఎంచుకున్న బోగీలలో మాత్రమే వాటిని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు.

అయితే రైలు కదిలే సమయంలో సీసీ టీవీల్లో దృశ్యాలు సక్రమంగా నమోదు కావడం ప్రధాన సమస్యగా మారిందని, పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని ఓ సీనియర్ అధికారి తెలిపారు. లోకల్ రైళ్లలోని మహిళా బోగీల్లో కనీసం ఆరు కెమెరాలను అమర్చాలని ప్రతిపాదించామని, అయితే ఎన్ని అవసరమవుతాయో బోగీ పొడవుపై ఆధారపడి ఉంటుందని ఆయన తెలిపారు. ఒక్క బోగీలో కెమెరా అమర్చేందుకు రూ.2 లక్షల వరకు ఖర్చు అవుతుందని, ఏజెన్సీ నిర్ణయం తర్వాత టెండర్ల ప్రక్రియ కొనసాగుతుందని ఆయన చెప్పారు. వాటిని ఎక్కడ, ఏ దిశలో అమర్చాలి అనే అంశాలపై ఇంకా ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదని చెప్పారు. మెట్రో రైళ్లలో సీసీటీవీలను ఏర్పాటు చేయనున్న ఏజన్సీనే సబర్బన్ రైళ్లలో కూడా సర్వే నిర్వహించనుందని ఆయన వెల్లడించారు. సెంట్రల్, వెస్టర్న్ రైల్వేల్లో నడుస్తున్న 215 రైళ్లను పర్యవేక్షించడం కష్టంగా మారనుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ముంబై-ఢిల్లీ మధ్య నడిచే రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో పెలైట్ ప్రాజెక్టుగా వీటిని ఏర్పాటు చేశారు. ప్రవేశ, నిష్ర్కమణ ద్వారాల చెరో సీసీ కెమెరాను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు.

మరిన్ని వార్తలు