పంచ తంత్రం!

17 Oct, 2016 17:50 IST|Sakshi

ఐదు నియోజకవర్గాల సమాహారంగా జిల్లా
రెండు నియోజకవర్గాలు పూర్తిగా.. మరో మూడు పాక్షికంగా..
ఇద్దరు ఎంపీలు, ఐదుగురు ఎమ్మెల్యేల ప్రాతినిథ్యం
గత ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు
వివిధ పార్టీలకు రాష్ట్ర, జాతీయ నాయకులను అందించిన జిల్లా
రాష్ట్రంలో ఏకైక స్వతంత్ర ఎమ్మెల్యేను గెలిపించిన నర్సంపేట
సాక్షి, హన్మకొండ :

జిల్లాల పునర్విభజనలో భాగంగా కొత్తగా ఆవిర్భవించిన వరంగల్‌ రూరల్‌ జిల్లా వ్యవసాయ రంగంలో ముందంజలో ఉండడంతో పాటు రాజకీయ చైతన్యం విషయంలోనూ ప్రత్యేకతను చాటుకుంటోంది. 15మండలాలతో 7,16,457 జనాభా ఉన్న వరంగల్‌ రూరల్‌ జిల్లా 2,175.43 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంది. ఈ జిల్లా నుంచి ఇద్దరు లోక్‌సభ సభ్యులు, ఐదుగురు శాసనసభ సభ్యులు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

రెండు లోక్‌సభ స్థానాలు
వరంగల్‌ రూరల్‌ జిల్లాలో చేరిన నర్సంపేట నియోజకవర్గం మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానం పరిధిలోకి వస్తోంది. ఈ ప్రాంతాలకు ఎంపీగా సీతారాంనాయక్‌ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇక పరకాల నియోజకవర్గంతో పాటు వర్ధన్నపేట నియోజకవర్గం పరిధిలోని పర్వతగిరి, వర్ధన్నపేట మండలాలు, పాలకుర్తి నియోజకవర్గంలోని రాయపర్తి మండలాలు వరంగల్‌ లోక్‌సభ పరిధిలో ఉండగా.. ఇక్కడ ఎంపీగా పసునూరి దయాకర్‌ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అదేవిధంగా శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించి నర్సంపేట నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా దొంతి మాధవరెడ్డి, పరకాల ఎమ్మెల్యేగా చల్లా ధర్మారెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యేగా అరూరి రమేష్, పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు, భూపాలపల్లి ఎమ్మెల్యేగా మధుసూదనాచారి కొనసాగుతున్నారు.

ఫలితం.. మారిన సమీకరణం
గత శాసనసభ ఎన్నికల్లో ఎన్నికల్లో ఈ ప్రాంతం నుంచి మిశ్రమ ఫలితాలు వచ్చాయి. అయితే తర్వాత కాలంలో పలు పరిణామాల కారణంగా సమీకరణాలు మారిపోయాయి. ఇప్పుడు పాత జిల్లా విభజన, నూతన జిల్లా ఏర్పాటుతో సరికొత్త రాజకీయాలకు అవకాశం ఏర్పడింది. రాష్ట్రంలోనే ఎక్కడా లేనివిధంగా నర్సంపేట నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన దొంతి మాధవరెడ్డి 18వేల ఓట్ల భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

 ఉమ్మడి జిల్లాలో డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న మాధవరెడ్డికి కాంగ్రెస్‌ నుంచి టిక్కెట్‌ దక్కకపోవడంతో స్వతంత్రంగా పోటీకి దిగి పార్టీ నుంచి సస్పెన్షన్కు గురయ్యారు. బలమైన ప్రత్యర్థి, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డిపై గెలిచిన మాధవరెడ్డి తిరిగి ఏఐసీసీ చైర్‌పర్సన్  సోనియాగాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరి కొనసాగుతున్నారు. అయితే ఇక్కడ టీడీపీ జాతీయ నాయకుడు రేవూరి ప్రకాశ్‌రెడ్డి సైతం బలమైన పోటీ ఇచ్చారు. టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి కేసీఆర్‌ వెంట ఉన్న పెద్ది సుదర్శన్ రెడ్డి రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్ గా ఇటీవలే నియమితులయ్యారు. నర్సంపేట నియోజకవర్గంలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, టీడీపీ అధిక ప్రాబల్యం కలిగి ఉన్నాయి.


టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌
పరకాల నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడ టీడీపీ తరఫున పోటీ చేసిన చల్లా ధర్మారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే, ఆ తర్వాత ఆయన అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. దీంతో టీఆర్‌ఎస్‌ పార్టీ హవా పెరిగింది. తెలంగాణ ఉద్యమంలో న్యాయవాద జేఏసీ నుంచి కీలక పాత్ర పోషించిన సహోదర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసి ఓటమి పాలమాయ్యరు. ఇక కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన ఇనుగాల వెంకట్రాంరెడ్డి, బీజేపీ నుంచి పోటీ చేసిన డాక్టర్‌ పెసరు విజయ్‌చందర్‌రెడ్డి కూడా నియోజకవర్గ కార్యక్రమాల్లో చురుకుగా ఉండడంతో కాంగ్రెస్, బీజేపీలు తమ ప్రాబల్యాన్ని నిలబెట్టుకుంటున్నాయి. ఇక వర్ధన్నపేట నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే అరూరి రమేష్‌ 87వేల భారీ మెజారిటీతో గెలుపొందడం విశేషం. దీంతో సహజంగానే ఇక్కడ టీఆర్‌ఎస్‌ అధిపత్యం ఎక్కువగా ఉంది.

 

కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ కూడా ప్రాబల్యం కలిగి ఉన్నాయి. జిల్లాలోకి వచ్చిన రాయపర్తి మండలం కలిగి ఉన్న పాలకుర్తి నుంచి టీడీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు తర్వాత టీఆర్‌ఎస్‌లోకి వెళ్లడంతో టీడీపీ బలం తగ్గింది. అలాగే, జిల్లాలోని శాయంపేట మండలం కలిగి ఉన్న భూపాలపల్లి నియోజకవర్గానికి స్పీకర్‌ మధుసూదనాచారి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. గతంలో నియోజకవర్గ కేంద్రంగా శాయంపేట ఉండడం గమనార్హం. స్థూలంగా జిల్లాలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీలు బలంగా ఉండగా, బీజేపీ, టీడీపీలు సైతం మంచి ప్రాబల్యం కలిగి ఉన్నాయి.

మరిన్ని వార్తలు