వెనక్కు తగ్గం

29 Oct, 2014 03:08 IST|Sakshi
వెనక్కు తగ్గం

కొనసాగిన  రాజీనామాల పర్వం
మొత్తం 4,500 మంది వైద్యుల రాజీనామా
మంత్రి యూటీ ఖాదర్‌తో    చర్చలు విఫలం
నేడు సీఎంతో వైద్యుల సంఘం నేతల భేటీ   
రోగులకు తప్పని తిప్పలు

 
రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సామూహిక రాజీనామాల పరంపర రెండోరోజూ కొనసాగింది. దీంతో ఆస్పత్రుల్లో వైద్యం అందక రోగులు ఇబ్బందులు పడ్డారు. డిమాండ్ల పరిష్కారంలో భాగంగా రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి యూటీ ఖాదర్‌తో రాష్ట్ర వైద్య ఉద్యోగుల సంఘం నేతలు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. మరోవైపు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో వైద్యుల సంఘం నేతల భేటీ బుధవారం సాయంత్రానికి వాయిదా పడింది. డిమాం డ్ల సాధనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘంలోని మూడు వేల మంది వైద్యులు సోమవారం సామూహిక రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే. మిగిలిన 1,500 మంది వైద్యులు మంగళవారం తమ ఉద్యోగాలకు రాజీనా మా చేశారు. దీంతో మొత్తం 4,500 మంది వైద్యులు రాజీనామా చేసినటై్లంది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడు వీరభద్రయ్య ధ్రువీకరించారు. రాజీనామాల సంఖ్య విషయమై మంత్రి యూటీ ఖాదర్ కానీ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శివశైలం కానీ నోరు విప్పడం లేదు.  

ఇదిలా ఉండగా డిమాండ్ల సాధనలో భాగంగా ఉద్యోగుల సంఘం నేతలు మంగళవారం ఉదయం మంత్రి యూటీ ఖాదర్‌తో చర్చలు జరిపారు. ఇందులో ఎటువంటి పురోగతి కనిపించలేదు. డిమాండ్లలో కొన్నింటికి ఆర్థిక శాఖ అనుమతి తప్పనిసరి కావడంతో తాను ఏమీ చేయలేనని మంత్రి చేతులు ఎత్తేశారు. దీంతో వైద్యుల సంఘం నేతలు చేసేదేమీ లేక ఆర్థిక శాఖను నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో చర్చించడానికి సిద్ధపడ్డారు. ఆయన పని ఒత్తిడిలో ఉండడం వల్ల   ముందుగా నిర్ణయించినట్లు మంగళవారం ఉదయం 11:30 గంటలకు కాకుండా చర్చలు బుధవారానికి వాయిదా పడ్డాయి. రాజీనామా చేసిన వారు తిరిగి విధుల్లో ఉంటున్నారని సంఘం నేతలు చెబుతున్నా రాష్ట్రంలో అక్కడక్కడ రోగులు సరైన వైద్యం అందక తీవ్ర ఇబ్బందులు పడ్డారు.  
 
వైద్యం అందక బాలిక మృతి


ఇక వైద్యులు రాజీనామాలు చేస్తూ విధులకు సరిగా హాజరుకాకపోవడంతో ఓ చిన్నారి మరణించింది. రామనగర జిల్లా గుడేమారనహళ్లి ప్రాంతానికి చెందిన రమ్య(10) తీవ్ర జ్వరంతో బాధపడుతుండడంతో తల్లిదండ్రులు ఆ చిన్నారిని సోమవారం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అక్కడ వైద్యులెవరూ అందుబాటులో లేకపోవడంతో ఆస్పత్రిలో ఉన్న నర్సుల వద్ద మాత్రలు తీసుకొని వెనక్కి వచ్చేశారు. కాగా మంగళవారం ఉదయం జ్వర తీవ్రత పెరిగి రమ్య మృతిచెందింది. తాము పేదవాళ్లం కావడంతో ప్రైవేటు ఆస్పత్రికి తమ కూతురిని తీసుకెళ్లలేక పోయామని, ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు అందుబాటులో ఉండి ఉంటే తమ చిన్నారి ప్రాణాలతో ఉండేదని తల్లిదండ్రులు బోరున విలపించడం అందరినీ కలచివేసింది.

రాజీనామాలు అంగీకరించలేదు : సీఎం

 వైద్యుల సామూహిక రాజీనామాలను ఇప్పటి వరకూ అంగీకరించలేదు. రోగుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వైద్యులు కూడా పట్టువిడుపులు ప్రదర్శించాలి. వెంటనే ఆసుపత్రులు వెళ్లి ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి అవసరమైన సేవలు అందించాలి. ఇందుకు విరుద్ధంగా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.
 

మరిన్ని వార్తలు