నిరంతర విద్యుత్ సరఫరాకు ప్రభుత్వం ఆదేశాలు

2 Apr, 2015 23:06 IST|Sakshi

కుంటి సాకులు చెప్పొద్దని
డిస్కంలకు ఆప్ ప్రభుత్వం హుకుం
లోడ్‌షెడ్డింగ్ సమయంలో
ప్రత్యమ్నాయం చూడాలని సూచన

 
న్యూఢిల్లీ : రాష్ట్రానికి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని డిస్కంలను ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభుత్వం ఆదేశించింది. లోడ్ షెడ్డింగ్ పేరుతో కుంటి సాకులు చెప్పొద్దని హెచ్చరించింది. ననగరంలోని వివిధ ప్రాంతాల్లో లోడ్ షెడ్డింగ్ వల్ల విధిస్తోన్న కరెంటు కోతల వివరాలతో కూడిన నివేదికను డిస్కంలు ప్రభుత్వానికి అందించాయి. నివేదికను పరిశీలించిన అనంతరం ప్రభుత్వం పై ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర పరిధిలో టాటా పవర్ ఢిల్లీ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్(టీపీడీడీఎల్), బీఎస్‌ఈఎస్ రాజధాని, బీఎస్‌ఈఎస్ యమునా డిస్కంలు ఉన్నాయి.

దీంతో గురువారం విద్యుత్ శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ పేరుతో విద్యుత్ విభాగం లేఖ రాసింది. నగర వ్యాప్తంగా నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని ఆదేశించింది. అలాగే విద్యుత్ సమస్యలనెదుర్కొనే వినియోగదారుల సౌలభ్యం కోసం హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలని సూచించింది. అవి నిరంతరం పనిచేసేలా ఏర్పాట్లు చేసుకోవాలని పేర్కొంది.

విద్యుత్ కొరత వల్ల లోడ్ షెడ్డింగ్ చేయాల్సి వచ్చినా కూడా గంటకు మించి కోతలు విధించవద్దని చెప్పింది. రొటేషన్ పద్ధతిలో లోడ్ షెడ్డింగ్ నిర్వహించాలని ఆదేశించింది. మురికివాడల్లో, జేజే క్లస్టర్లలో మాత్రమే కరెంటు కోతలు విధించవద్దని సూచించింది. లోడ్ షెడ్డింగ్, ఇతర సమస్యలతో విద్యుత్ సరఫరాలో ఆటంకాలు ఏర్పడితే మీడియా ద్వారా ప్రజలకు సమాచారం ఇవ్వాలని పేర్కొంది.

మరిన్ని వార్తలు