కమల వికాసాన్ని ‘ఆప్’తుందా!?

9 Nov, 2013 00:31 IST|Sakshi
కమల వికాసాన్ని ‘ఆప్’తుందా!?

 సాక్షి, న్యూఢిల్లీ:
 పదిహేనేళ్లుగా దేశరాజధానిలో అధికార పీఠానికి దూరంగా ఉన్న బీజేపీ ఈమా రు గెలిచేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. ఎంసీడీల్లో బీజేపీ పట్టునిలుపుకుంటున్నా.. అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేప్పటికి ఢిల్లీవాసులు ఆ పార్టీకి మొండి ‘చెయ్యి’ చూపుతూనే ఉన్నారు. ఎలాగైనా ఈమా రు విజయాన్ని ఒడిసిపట్టుకోవాలని తహతహలాడుతున్న బీజేపీకి ఆమ్ ఆద్మీ పార్టీకి క్రమంగా పెరుగుతున్న మద్దతుతో బెంగపట్టుకుంది. అసంతృప్త నేతల ఇంటిపోరూ.. కొంపముంచేలా ఉంది. రెండు రోజుల క్రితం విధానసభ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల జాబితా విడుదల చేసిన తర్వాత అసంతృప్త నాయకులు నగరపార్టీ కార్యాలయంలో, నేతల ఇళ్ల ఎదుట నానాయాగీ చేసిన విషయం తెలి సిందే. ఇందం తా ఓవైపు ఉండగా, మరోవైపు చాపకిందనీరులా ఢిల్లీ అంతటా మద్దతు పెంచుకుంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ నాయకులకు నిద్రపట్టనివ్వడం లేదు. ఇన్నాళ్లు ఆ పార్టీని లైట్ తీసుకున్న బీజేపీ ఇప్పుడు ఆలోచనలో పడింది.
 
 కిం కర్తవ్యం?
 ఆమ్ ఆద్మీ పార్టీని అడ్డుకోవాలంటే ఏ ప్రణాళికలు రూపొందిస్తే బాగుంటుందా అన్న ఆలోచనలో ఉంది ఢి ల్లీ కమల దళం. అధికార కాంగ్రెస్‌ను పదిహేనేళ్ల పాలనలోని లోపాలు, ధరలు పెరుగుదల, కుంభకోణాలు వంటి అంశాలతో ఇరుకున పెడుతూ వస్తున్న బీజేపీ నాయకులకు ‘ఆప్’విషయానికి వచ్చేప్పటికి సరైన అస్త్రాలు దొరకడం లేదు.
 
 మొట్టమొదటిసారిగా ఎన్నికలబరిలో దిగుతుండడం, పార్టీ అభ్యర్థుల ఎంపికలోనూ ‘నిజాయతీ’గా వెళ్లడంతో ఆప్‌ను ఇరికిం చేందు బీజేపీకి అవకాశాలు అంతగా కనపడడం లేదు. కాంగ్రెస్ పార్టీపై, ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌పై వ్యతిరేకత కూడగట్టడంలో కొంత వరకు బీజేపీ నేతలు సఫలం అయ్యారు. ఈ సమయంలో ‘ఆప్’బలపడుతుండడం బీజేపీకి నష్టం చేసే అంశమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
 
 కొరకరాని కొయ్యగా మారిన కేజ్రీవాల్..
 మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ అటు కాంగ్రెస్‌పై, ఇటు బీజేపీపై అవినీతి అంశంతో ముప్పేట దాడి మొదలుపెట్టారు. నగరంలో 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎలా అయితే ప్రజావ్యతిరేక విధానాలకు, కుంభకోణాలకు పాల్పడిందో.. ఇన్నేళ్లుగా ఎంసీడీల్లో అధికారం చెలాయిస్తున్న బీజేపీ కూడా అదే పంథా లో వెళ్లిందంటూ రెండు పార్టీలను ఒకేగాటన కట్టేప్రయత్నం చేస్తున్నారు. అవినీతిరహిత పాలన  కావాలంటే రెండు పార్టీలకు అవకాశం ఇవ్వొద్దంటూ ముందుకెళ్తుతున్నారు. ఇటీవల సర్వేలన్నీ ఆప్‌కి అనుకూలంగా వస్తుండడంతో ఆయన మరింత ఉత్సాహంగా ఉన్నారు.
 
 కాంగ్రెస్ ఎత్తులు...
 రాజధానిలో జరిగే ఏ ఎన్నికల్లో అయినా కాంగ్రెస్ పార్టీ ఆచితూచి వెళ్లే ధోరణే అవలంబిస్తుంటుంది. ఈ మారు అదే తరహాలో వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు హస్తం నాయకులు. బీజేపీ అభ్యర్థులను ప్రకటించిన తర్వాతే కాంగ్రెస్ జాబితా విడుదల కావడం ఢిల్లీలో సంప్రదాయంగా వస్తోంది. ప్రత్యర్థి బలాబలాల ఆధారంగా అవసరమైతే పార్టీ అభ్యర్థులను మార్చే యోచనలో ఉంది. పనిలోపనిగా టికెట్లు రాకుండా ఉన్న బీజేపీ అసంతృప్త నాయకులకు గాలం వేయడంలో కాంగ్రెస్ నేతలు తలమునకలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా కొంత మేర బీజేపీ ఓట్లను చీల్చాలన్నది కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తోంది. ఒకటి రెండు రోజుల్లో కాంగ్రెస్ జాబితా విడుదలవనుంది. కాంగ్రెస్ అభ్యర్థులెవరో తెలిస్తే ఢిల్లీ రాజకీయాలు మరింత వేడెక్కడం ఖాయం.

మరిన్ని వార్తలు