దత్తతతో అద్భుత ఫలితాలు

14 Jan, 2014 00:36 IST|Sakshi

 వాషింగ్టన్: ఢిల్లీ శాసనసభకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అనూహ్య విజయంతో అందులో ప్రవాస భారతీయులు పోషించిన కీలకపాత్ర తెరపైకి వచ్చింది. ‘అడాప్ట్ ఏ కాన్‌స్టిట్యుయెన్సీ’ (ఏఏసీ) పేరిట ఢిల్లీలోని ఓ నియోజకవర్గాన్ని స్థానిక నాయకులతోపాటు ప్రవాస భారతీయులు కూడా దత్తత తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆప్ గ్లోబల్ సపోర్టర్స్ విభాగం అధికార ప్రతినిధి శాలినీగుప్తా సోమవారం వెల్లడించారు. ఇలా ఎన్‌ఆర్‌ఐ బృందాలు ఢిల్లీ శాసనసభ పరి ధిలోని మొత్తం 16 నియోజకవర్గాలను దత్తత తీసుకున్నారు. ఇలా దత్తత తీసుకున్న 12 నియోజకవర్గాల్లో ఆప్ అభ్యర్థులే విజయం సాధించారు. ఇలా విజయం సాధించిన వారిలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తోపాటు మనీష్ సిసోడియా, సోమనాథ్ భారతి, రాఖీ బిర్లా తదితరులు ఉన్నారు. ‘ ఓ నియోజకవర్గాన్ని దత్తత తీసుకున్నప్పు డు దాని అభివృద్ధికి అవసరమైన నిధులను సేకరించడమే మా ప్రధాన లక్ష్యం. ఆ తర్వాత లాప్‌టాప్‌లు, కార్యాలయ సామగ్రి తదితరాలను కొనుగోలు చేస్తాం.
 
  ఉదాహరణకు ఆప్ ఆస్ట్రేలియా విభాగం న్యూఢిల్లీ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంది. ఆ నియోజకవర్గంనుంచి మా పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేసి గెలుపొందారు. ఇక ఆప్ బే ఏరియా (సిలికాన్ వ్యాలీ) పత్పర్‌గంజ్ నియోజకవర్గాన్ని ఎంచుకుంది. అక్కడి నుంచి మనీష్ సిసోడియా పోటీ చేసి విజయం సాధించారు. ఆప్ చికాగో విభాగం ఢిల్లీ కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని ఎంచుకుంది. అక్కడినుంచి బరిలోకి దిగిన సురేందర్ సింగ్ గెలిచారు. ఆప్ హోస్టన్, ఆప్ అట్లాంటా విభాగాలు మాలవీ యనగర్‌ను దత్తత తీసుకోగా అక్కడినుంచి సోమ్‌నాథ్ భారతి గెలుపొందారు. ఇక ఆప్ సౌత్ కొరియా విభాగం. ఆప్ యూఏఈలు దత్తత తీసుకున్న మంగోల్‌పురి నుంచి మంత్రి రాఖీ బిర్లా గెలుపొందారు. ఇక ఆప్ జర్మనీ విభాగం బురారిని, ఆప్ మిచిగాన్ విభాగం మెహ్రౌలిని, ఆప్ న్యూజెర్సీ న రేలాను, ఆప్ డల్లాస్ సంగం విహార్‌ను, ఆప్ యూకే సీమాపురిని, ఆప్ దక్షిణ కొరియా షాలిమార్‌బాగ్, ఆప్ సింగపూర్ త్రిలోక్‌పురిని దత్తత తీసుకున్నాయి.   
 

మరిన్ని వార్తలు