నేను..నాతోపాటు మరో పదిమంది

2 Jan, 2015 22:22 IST|Sakshi
నేను..నాతోపాటు మరో పదిమంది

విరాళాల సేకరణ కోసం ఆప్ సరికొత్త కార్యక్రమం
సాక్షి, న్యూఢిల్లీ : త్వరలో  జరగనున్న విధానసభ ఎన్నికల కోసం పెద్దఎత్తున విరాళాల సేకరణకు ప్రయత్నిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ కొత్త క్యాంపెయిన్‌ను ప్రారంభించింది.  ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించిన క్లీన్ ఇండియా తరహాలో ఆమ్ ఆద్మీ పార్టీ ‘ఐ ఫండ్  ఫర్ హానెస్ట్ పార్టీ’  పేరిట విరాళాల వసూలు కార్యక్రమాన్ని ప్రారంభించింది. పార్టీ నేత, మాజీ ముఖ్యమంత్రి  అర్వింద్ కేజ్రీవాల్  పది వేల చందా ప్రకటించడంతోపాటు మరో పది మంది పేర్లను దాతల పేర్లను వెల్లడించడం ద్వారా ఈ కార్యక్రమాన్ని శుక్రవారం  ప్రారంభించారు. కేజ్రీవాల్ మాదిరిగానే వీరు కూడా మరో పది మంది పేర్లను ప్రకటించాల్సి ఉంటుంది.

పార్టీకి విరాళాల కోసం తాము అందరి ఎదుట ఈ సవాలు ఉంచుతున్నామని, తాను మొట్టమొదటి సవాలును స్వీకరించి పది వేల రూపాయలను ఇస్తున్నట్లు  కేజ్రీవాల్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా వేలాదిమంది ఈ సవాలును స్వీకరిస్తారని  ఆయన చెప్పారు. దీంతోపాటు చందా ఇచ్చే సవాలు స్వీకరించడం కోసం ఆయన మరో పది మంది పేర్లను ప్రతిపాదించారు. వారిలో  కేజ్రీవాల్ సోదరి, సోదరుడితో పాటు అమెరికాలో నివసించే భారతీయుడు డా. మనీష్, సినీనటి గుల్ పనాగ్ కూడా ఇందులోఉన్నారు.
 
కేజ్రీవాల్‌కు గొంతునొప్పి.. ప్రచారానికి విరామం
న్యూఢిల్లీ: చల్లటి వాతావరణం కారణంగా గొంతునొప్పితో బాధపడుతున్న ఆమ్‌ఆద్మీపార్టీ అధినేత కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారానికి విరామం ప్రకటించారు. మాజీ ముఖ్యమంత్రి అయిన కేజ్రీవాల్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు తీవ్రంగా కృషిచేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతిరోజూ కనీసం రెండు బహిరంగ ర్యాలీల్లో పాల్గొంటూ ప్రజలతో మమేకం అవుతున్నారు. కాగా, కొంతకాలంగా కేజ్రీవాల్‌ను గొంతు నొప్పి పీడిస్తున్నా ఏమాత్రం పట్టించుకోకుండా ర్యాలీల్లో పాల్గొంటున్నారు. అయితే సమస్య మరింత తీవ్రరూపం దాల్చడంతో వైద్యుల సలహా మేరకు ఆయన కొంత విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. గొంతునొప్పి తగ్గిన వెంటనే తమ పార్టీ అధినేత కేజ్రీవాల్ తిరిగి ప్రచార కార్యక్రమాలను ఉధృతం చేస్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

ఇదిలా ఉండగా, నగరంలో శీతలగాలుల ప్రభావం ఆప్ జనసభలపై పడుతోంది. చలితోపాటు మంచు పడుతుండటంతో ర్యాలీలకు ప్రజలు తగిన సంఖ్యలో హాజరు కావడంలేదని ఆప్ భావిస్తోంది. అలాగే నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలోనూ ప్రజలతోపాటు తమ పార్టీ కార్యకర్తలు చాలామంది ర్యాలీలకు అధికసంఖ్యలో హాజరు కాకపోవచ్చనే భావనతో ప్రచార ర్యాలీలకు మూడు, నాలుగు రోజుల విరామం ప్రకటించినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కేజ్రీవాల్ చివరిసారిగా డిసెంబర్ 30వ తేదీన రెండు ర్యాలీల్లో పాల్గొన్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక విడత ర్యాలీలు నిర్వహించామని పార్టీ నాయకులు తెలిపారు.
 
కాగా, పార్టీ అధినేత కేజ్రీవాల్ గొంతునొప్పి వల్ల ర్యాలీలకు విరామం ప్రకటించిన నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో శని, ఆదివారాల్లో ఎటువంటి ర్యాలీలు నిర్వహించకూడదని పార్టీ అభ్యర్థులు నిర్ణయించారు. ఇదిలా ఉండగా, ఇకపై ఢిల్లీ గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గాలపై దృష్టిపెట్టేందుకు ఆప్ నాయకులు యోచిస్తున్నారు. ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉన్న ఛతర్‌పూర్ నియోజకవర్గంతోపాటు గ్రేటర్ కైలాష్,మెహ్రోలీ,ఆర్కేపురం, కస్తూర్బానగర్ తదితర నియోజకవర్గాల్లో తమ అధినేత పర్యటి స్తారని ఆప్ నాయకులు తెలిపారు.

మరిన్ని వార్తలు