అన్నాడీఎంకేకు ఇక్కట్లు

20 Apr, 2014 03:18 IST|Sakshi

చెన్నై, సాక్షి ప్రతినిధి: ఎన్నికల ప్రచారం ముగుస్తున్న వేళ అధికార అన్నాడీఎంకే అభ్యర్థులకు ఇక్కట్లు ఎదురవుతు న్నాయి. వారిని అనేక సమస్యలు, ఆరోపణలు చుట్టుముట్టాయి. రాష్ట్రంలోని పలుచోట్ల ఒకేసారి అనేక సంఘటనలు జరగడం విచిత్రం. ఇందుకు మంత్రి పన్నీర్ సెల్వం కూడా అతీతులు కాలేకపోయారు. రాష్ట్ర క్యాబినెట్‌లో సీఎం జయలలిత తరువాతి స్థానం రెవెన్యూ మంత్రి పన్నీర్ సెల్వందేనని చెప్పవచ్చు. తేని నియోజవర్గ అభ్యర్థి పార్థిబన్ ప్రచార బాధ్యతలను మంత్రి కుమారుడు రవీంద్రకుమార్ నిర్వరిస్తున్నారు. తేనిలోని మంత్రి ఫామ్‌హౌస్ వద్ద శనివారం అన్నాడీఎంకే కార్యకర్తలు గుంపుగా ఉండగా, అక్కడ నగదు పంపిణీ జరుగుతోందని డీఎంకే అభ్యర్థి పొన్ ముత్తరామలింగం ఫిర్యాదు చేశారు. దీంతో మధ్యాహ్నం 12 గంటల సమయంలో హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఎన్నికల అధికారులు, పోలీసులు తనిఖీలు జరిపారు. ఫామ్‌హౌస్ సమీపంలోని పార్టీ వాహనాలను పరిశీలించారు. అయితే వారికి ఏమీ దొరకలేదు.
 
 కౌన్సిలర్ ఇంట్లో చీరల పంపిణీ
 చెన్నై కార్పొరేషన్ ఐనవరంలోని అన్నాడీఎంకే కౌన్సిలర్ సుబ్బులక్ష్మి ఓటర్లకు చీరలు పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. శుక్రవారం అర్ధరాత్రి ఆమె ఇంటి వద్ద మహిళలు గుంపులుగా చేరడాన్ని గమనించిన డీఎంకే నేత మురళీధర్ ఎన్నికల అధికారులకు సమాచారం అందించారు. ఉత్తర చెన్నై ఎన్నికల అధికారి లక్ష్మీ అదేశాల మేరకు శనివారం తెల్లవారుజామున ఇంటిపై దాడిచేశారు. అధికారులను చూడగానే మహిళలు తమ చేతుల్లోని చీరలను రోడ్డుపై విసిరివేసి పారిపోయారు. ఆ చీరలను అధికారులు స్వాధీనం చేసుకుని కౌన్సిలర్‌ను విచారిస్తున్నారు. సీఎం జయ ఆదివారం ప్రచారానికి వస్తుండగా పార్టీని అప్రతిష్టపాలు చేసేందుకు డీఎంకే ఈ పనికి పూనుకుందని ఆమె ఆరోపించారు. తాంబరం మునిసిపాలిటీ కడప్పేరీ నెహ్రూనగర్‌లో అన్నాడీఎంకే వారు నగదు పంపిణీ చేస్తున్నారని ఫిర్యాదు అందడంతో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు అక్కడికి చేరుకున్నారు. అధికారులు రాగానే ఒక బృందం పారిపోయింది. 3 వ వార్డు పార్టీ ఇన్ చార్జ్ జేసురాజ్ (47)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగదు పంచలేదు, స్లిప్పులు మాత్రమే పంచానని ఆయన పోలీసులకు చెప్పారు. నగదు పంపిణీపై విచారణ జరుపుతున్నారు.
 
 అభ్యర్థులను అడ్డుకున్న ప్రజలు
 ఇదిలా ఉండగా అన్నాడీఎంకే అభ్యర్థులు పలుచోట్ల ప్రజల నుంచి ప్రతిఘటనను ఎదుర్కొన్నారు. నెల్లై జిల్లా దిశయినై మునిసిపాలిటీ అంబేద్కర్ నగర్ తాగునీటి సమస్యను ఏకరవుపెట్టి శుక్రవారం సాయంత్రం అక్కడికి వ చ్చిన అభ్యర్థి ప్రభాకరన్‌ను అడ్డుకున్నారు. ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి ప్రచార వాహనాలను నిలిపివేశారు. దీంతో అభ్యర్థి తిరుగుముఖం పట్టారు. అలాగే తెన్‌కాశీ నియోజకవర్గ అభ్యర్థి వసంతి మురుగేశన్ తన ప్రచారంలో భాగంగా చింతామణికి చేరుకున్నారు. తమకు రోడ్లు, మరుగుదొడ్లు లేవని అడ్డుకున్నారు. పార్టీ నేతలు నచ్చచెప్పినా ఫలితం లేకపోవడంతో ప్రచారాన్ని నిలిపివేసి వెళ్లిపోయారు. తిరువళ్లూరు జిల్లా సమీపం పున్నపాక్కం ప్రాంతంలో శుక్రవారం రాత్రి అన్నాడీఎంకే అభ్యర్థి వేణుగోపాల్ తన ప్రచార వాహనంలో ప్రసంగిస్తూ వెళుతుండగా కొందరు యువకులు రాళ్ల వర్షం కురిపించారు. దీంతో ముందువైపు అద్దాలు పగిలిపోగా డ్రైవర్ విఘ్నేష్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యూరు. ఈ సంఘటనలో డీఎండీకే నాయకుడు సేట్ (25)ను శనివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
 

>
మరిన్ని వార్తలు