ప్రజలు మా పార్టీకి ఓట్లు వేయలేదు

28 Apr, 2017 21:00 IST|Sakshi
ప్రజలు మా పార్టీకి ఓట్లు వేయలేదు

న్యూఢిల్లీ: ఎన్నికల్లో వరుస ఓటములు, పార్టీ నేతల రాజీనామాలతో ఢీలా పడ్డ ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌కు మరో షాక్ తగిలింది. ఎన్నికల్లో పార్టీని గెలిపించడంలో కేజ్రీవాల్‌ సామర్థ్యంపై ఆయన సన్నిహితుడు కుమార్‌ విశ్వాస్‌ సందేహం వ్యక్తం చేశారు. ఇటీవల ఎదురైన వరుస పరాజయాలపై ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు.

నాయకత్వ మార్పు సహా, కఠిన నిర్ణయాలు తీసుకునే విషయాన్ని పార్టీ పరిశీలించాలని కుమార్ విశ్వాస్ కోరారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు, రాజౌరి ఉప ఎన్నిక, అలాగే ఎంసీడీ ఎన్నికల్లో ఆప్‌ ఓటమిపై కేజ్రీవాల్‌ ఆత్మరక్షణలో పడటాన్ని ప్రశ్నించారు. ఈవీఎంల వల్ల ఆప్‌ ఓడిపోలేదని, ప్రజలు పార్టీకి ఓట్లు వేయలేదని చెప్పారు. 'ఈవీఎంలను నిందించడం మంచిది కాదు. ఓటర్లకు, కార్యకర్తలకు చేరువ కావడంలో విఫలమయ్యాం. సర్జికల్ దాడులపై కేజ్రీవాల్‌ వైఖరి తప్పు. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించకుండా ఉండాల్సింది. తప్పుడు నిర్ణయాల వల్లే పంజాబ్‌లో ఆప్ ఓడిపోయింది' అని విశ్వాస్‌ అన్నారు.
 

మరిన్ని వార్తలు