రాజకీయాల్లోకి రానేరాను

23 Mar, 2014 00:13 IST|Sakshi
రాజకీయాల్లోకి రానేరాను

 న్యూఢిల్లీ: ఇది ఎన్నికల కాలం కాబట్టి చాలా మంది బాలీవుడ్ తారలు పోటీలోకి దిగి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అభయ్ డియోల్‌కు మాత్రం ఇలాంటి ఆలోచనలు ఏవీ లేవు. పోలింగ్ రోజు బయటికి వచ్చి ఓటేసి రావడమే తనకు తెలుసని అన్నాడు. ‘రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన నాకైతే లేదు. తాము మార్పు తేగలమని ఇతర నటులు నమ్మితే ముందుకు సాగవచ్చు. అందులో తప్పేం లేదు.
 
 వ్యవస్థను బాగు చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిందే’ అంటూ అభయ్ మనసులోని మాటను బయటపెట్టాడు. ఈ 38 ఏళ్ల నటుడు సినిమాల్లో చాలా వరకు సామాజిక, రాజకీయ నేపథ్యమున్నవే కావడం విశేషం. షాంఘై సినిమా భూనిర్వాసితుల గురించి చర్చిస్తుంది.  చక్రవూ్‌‌యహ  నక్సలైట్ల సమస్య చుట్టూతిరుగుతుంది. రాంఝనాలో అభయ్ సామ్యవాద భావాలున్న నాయకుడిగా కనిపిస్తాడు.
 
  రాజకీయాల్లోకి రాకుండానే తన సినిమాలతో సమాజంలో మార్పులు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నానని అన్నాడు. ‘నేను నాయకుణ్ని కాదు.. సామాజిక కార్యకర్తనూ కాను. సినిమాల ద్వారా చిన్న ప్రయత్నం చేస్తున్నాను. నా సినిమాలన్ని సమాజాన్ని ప్రతిబింబిస్తాయి’ అని వివరించాడు. అన్నట్టు మనోడు తాజాగా నిర్మాత అవతారం ఎత్తి వన్ బై టూ అనే సినిమా తీశాడు. తన నిజజీవిత ప్రేయసి ప్రీతీదేశాయ్ ఇందులో అభయ్‌కు జోడీ. దురదృష్టవశాత్తూ వన్ బై టూ పెద్దగా ఆడలేదు.
 
 దీని వైఫల్యం కొంచెం బాధగా అనిపించినప్పటికీ, ఇక ముందు కూడా సినిమాలు తీస్తానని చెప్పాడు. నటులు, దర్శకులు, నిర్మాతలకు జయాపజయాలు సహజమని, ఎల్లప్పుడూ వంద శాతం విజయం సాధ్యం కాదని అన్నాడు. ‘నువ్వు ఎన్నిసార్లు కిందపడ్డావనేది ముఖ్యం కాదు.. నువ్వు ఎన్నిసార్లు తిరిగి లేచావనేది ముఖ్యం’ అనే నానుడిని తాను విశ్వసిస్తానని అభయ్ డియోల్ వివరించాడు.
 

>
మరిన్ని వార్తలు